DailyDose

ఒక్క సీటు కూడా గెలవని తెదేపా-తాజావార్తలు

TDP Couldn't Win Even One Seat In GHMC 2020

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస తన సత్తా చాటింది. ఉదయం పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వెనకబడినట్లు కనిపించినప్పటికీ ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో తెరాస 50 స్థానాల్లో విజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితం కాగా, తెదేపా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

* తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పీసీసీకి కొత్త సారథిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఉప్పల్‌, ఏఎస్‌రావు నగర్‌లో మాత్రమే గెలిచి హస్తం పార్టీ.. మిగతా చోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో ఎదురైన పరాభవంతో కొంత నైరాశ్యంలోకి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను గ్రేటర్ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ‌‌ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

* తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, గ్రేటర్‌లో తమ పార్టీ బలం పుంజుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని, లేకపోతే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేవాళ్లమన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు.

* తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, గ్రేటర్‌లో తమ పార్టీ బలం పుంజుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని, లేకపోతే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేవాళ్లమన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు.

* వైకాపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని ఏపీ భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రధాన రహదారుల దుస్థితిపై భాజపా ఆధ్వర్యంలో శనివారం రహదారుల దిగ్బంధనం కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు వైకాపా అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో మీడియాతో విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడారు. భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదని మండిపడ్డారు.

* దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికైనా వెల్లడవుతాయని కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.

* కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నాయకులను పోలీసులు విచారించారు. విచారణలో భాగంగా తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రవీంద్రను స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది.

* రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సృష్టించడం కంటే అప్పులు ఎక్కువ చేసిందని.. వీటికి రెవెన్యూ లోటు తోడైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచేసి లెక్కలు తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల బీమాలో రైతుల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26లక్షల మందికి పంటల బీమా కట్టి 50లక్షల మందికి కట్టినట్లు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు వేలం వేయటానికి అవేమీ జగన్ సొంత ఆస్తులు కాదన్నారు. వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన పలు వీడియోలను మీడియా ముందు చంద్రబాబు ప్రదర్శించారు.‘‘చేసింది చెప్పుకునే సత్తా లేకే ప్రభుత్వం అసెంబ్లీలో ఐదు రోజులుగా తమను సస్పెండ్ చేస్తూ వచ్చింది. ప్రజల్ని బెదిరించటం, వారి తరఫున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచమైన చర్య. రైతు సమస్యల పరిష్కారంపై జగన్‌కు ఆలోచనే లేదు. దశ దిశ లేని ‘దిశ’ చట్టాన్ని ఆటకెక్కించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ‘దిశ’ చట్టం ఓ ఉదాహరణ. తమ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక న్యాయంతో ముందుకు వెళ్లాం. దాడులు చేస్తూ అవాస్తవాలను నిజం చేయాలనుకోవడం కుదరదు. ప్రత్యేక హోదాపై కథలు చెప్పి ఆ ఊసే లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి వైకాపా నేతలు పొట్టలు నింపుకొన్నారు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

* చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు ప్రయత్నించడం ఇందుకు కారణమైంది. పవన్‌ తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ వైకాపా శ్రేణులు జనసేన నాయకులను అడ్డుకున్నారు.

* తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటతో విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో బచ్చుల అర్జనుడికి చికిత్స అందిస్తున్నారు.

* కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం, గురువారం కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. శనివారం మరోసారి రైతుల సంఘాల నేతలతో సమావేశం కానున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం జరిగే చర్చలకు ముందు సింఘు బోర్డర్‌లో రైతు సంఘాల నాయకులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

* అన్నిరంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు కల్పించి గౌరవించుకున్నప్పుడే అన్నిచోట్లా సౌభాగ్యం వెల్లివిరుస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోనూ మహిళలకు సరైన అవకాశాలు కల్పించి.. విధానపరమైన నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేయాల్సిన తక్షణావసరం ఉన్న‌దని ఆయన పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టులో 13 మంది మహిళా న్యాయమూర్తులు ఉండటంపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. ఇది మరింత పెరుగడం ద్వారా మహిళలు న్యాయవ్యవస్థలోకి వచ్చేందుకు స్ఫూర్తి కలిగించగలమన్నారు.

* పెద్ద మొత్తంలో బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టి విదేశాల‌కు ప‌రారైన కింగ్‌ఫిష‌ర్ విజ‌య్‌మాల్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నీడ‌లా వెంటాడుతున్న‌ది. ఫ్రాన్స్‌లో ఆయ‌న‌కున్న దాదాపు 1.6 మిలియన్ యూరోల విలువైన ఆస్తులను శుక్రవారం స్వాధీనం చేసుకున్న‌ది. ఈడీ చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు ఫ్రెంచ్ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫ్రాన్స్‌లోని 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న విజ‌య్ మాల్యా ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ .14 కోట్లు.