Food

కూరగాయలు ఆకుకూరల స్మూథీ

కూరగాయలు ఆకుకూరల స్మూథీ

కూరగాయలు, ఆకు కూరలతో తయారుచేసే స్మూథీలు ఆరోగ్యాన్నిస్తాయి. ఏ కాలంలో తీసుకున్నా… ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. కావాలనుకునేవారికి బరువునూ పెంచుతాయి. అవేంటో చూసేద్దామా… శరదృతువు, హేమంత రుతువులు ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జీర్ణశక్తి పనితీరు ఈ కాలంలో మెరుగ్గా ఉంటుంది. శరీరంలోని మలినాలను బయటికి పోగొట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది అనుకూలమైన వాతావరణం. కాయగూరలు, ఆకుకూరలు, తాజా పండ్లు, ఇంట్లో ఉండే కొన్ని రకాల ద్రవపదార్థాలతో తయారుచేసుకునే స్మూథీలు తీసుకుంటే, రానున్న రుతువుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్ఛు అదెలాగంటే…
*మజ్జిగతో… కప్పు కమ్మటి మజ్జిగ, ఒక అరటిపండు, అర చెక్క యాపిల్‌, పావు చెంచా యాలకుల పొడి తీసుకోవాలి. ముందుగా యాపిల్‌ ముక్కలను మిక్సీలో వేయాలి. తరువాత అరటిపండు ముక్కలను వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో మజ్జిగ వేసి బాగా కలిపి, చివరగా యాలకుల పొడిని వేయాలి. రుచికి అవసరమైతే పావు చెంచా తేనె వేసుకుంటే చాలు. ఇది సన్నగా ఉండేవారికి చాలా మంచిది.
*పాలకూరతో… కప్పు అనాసపండు ముక్కలు, అరకప్పు పాలకూర తరుగు, ఎనిమిది బాదం పప్పులు, పది తులసి ఆకులు, అర కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందుగా బాదం పప్పులను మిక్సీలో పొడిలా చేసుకోవాలి. తరువాత అనాసపండు ముక్కలు, పాలకూర, తులసి ఆకులను వేసి, చివర్లో నీటిని చేర్చి బాగా మెత్తగా అయ్యేలా చేసుకుంటే… స్మూథీ తయారవుతుంది. సన్నగా లేదా అధిక బరువు కాకుండా మధ్యస్థంగా ఉండేవారికి ఇది చాలా మంచిది. రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. క్యారెట్‌తో… కప్పు క్యారెట్‌ ముక్కలు, 10 నుంచి 15 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావు చెంచా సైంథవ లవణం సిద్ధం చేసుకోవాలి. కప్పు నీళ్లు, క్యారెట్‌, అల్లం ముక్కలను ముందుగా మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా చేయాలి. ఈ రసాన్ని వడబోసి, ఇందులో పుదీనా ఆకులను సన్నగా తరిగి కలపాలి. చివరిగా సైంథవ లవణాన్ని రుచికి తగినంత వేసుకుంటే చాలు. ఇది అధిక బరువున్నవారికి మంచిది.