Business

ఒక ఉద్యోగిని కోసం గూగుల్‌లో పెద్ద దుమారం-వాణిజ్యం

ఒక ఉద్యోగిని కోసం గూగుల్‌లో పెద్ద దుమారం-వాణిజ్యం

* కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గూగుల్‌ ఉద్యోగి టిమ్‌నిట్‌ గెబ్రూ నిష్క్రమణ ఆ సంస్థలో ఇప్పుడు పెద్ద దుమారమే రేకెత్తిస్తోంది. ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్‌మెంట్‌కు.. ఆమెకు మధ్య తీవ్ర విబేధాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఏఐలో రూపుదిద్దుకొంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని గెబ్రూ లేవనెత్తడమే వివాదానికి కారణమైనట్లు సమాచారం. నల్లజాతికి చెందిన గెబ్రూ ఆ వర్గం నుంచి వచ్చిన అద్భుతమైన కంప్యూటర్‌ శాస్త్రవేత్తగా.. ఏఐ హానికర ఉపయోగాలపై ప్రశ్నించే నిపుణురాలిగా పేరుగాంచారు.

* గత ఏడాదితో పోలిస్తే ఇటీవలి పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలకు వచ్చిన ఆర్డర్లు పరిమాణంలో 56 శాతం, స్థూల వ్యాపార విలువలో (జీఎమ్‌వీ) 50 శాతం వృద్ధి నమోదు చేశాయని యూనికామర్స్‌ నివేదిక వెల్లడించింది. 2019 దీపావళికి నెల రోజుల ముందు, 2020లో దీపావళికి నెల ముందు ఆర్డర్లను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను సంస్థ రూపొందించింది. సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా కొనుగోలు ధోరణులను అంచనా వేసింది. వినియోగదార్లు మునుపటి కంటే విలువకు ప్రాధాన్యం ఇస్తున్నారని, కొత్త విభాగాల్లో కొనుగోళ్లకు ఆన్‌లైన్‌లోనూ ముందుకొస్తున్నారని తెలిపింది. ప్రధానంగా వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య ఉత్పత్తులు అధికంగా ఉన్నాయని పేర్కొంది. తక్కువ ధరల ఉత్పత్తుల్లో ఎక్కువ విక్రయాలు జరగడంతో సరాసరి ఆర్డర్ల విలువలో 4 శాతం క్షీణత నమోదైందని వివరించింది.

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత పదహారు రోజుల్లో 13 సార్లు ధరలు పెరగడంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83 మార్క్‌ దాటి రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. అటు డీజిల్‌ ధర కూడా రూ. 73 దాటింది.

* ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2020 జాబితాలో అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే కావడం ప్రత్యేకం. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచారు. మస్క్‌ వరుసగా రెండోసారి ఈ జాబితాలో అగ్రస్థానం పొందడం గమనార్హం. కరోనా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ.. ఇతర దిగ్గజ నాయకులు సైతం గణనీయ పనితీరు కనబరిచినట్లు ఫార్చూన్‌ తెలిపింది.

* కొవిడ్‌-19 మహమ్మారి వల్ల ఈ ఏడాది కార్యాలయ స్థల నికర లీజింగ్‌ 46 శాతం క్షీణించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేశారు. కార్పొరేట్లు, కో-వర్కింగ్‌ సంస్థల నుంచి గిరాకీ మందగించడంతో 7 ప్రధాన నగరాల్లో కలిపి 2.5 కోట్ల చదరపు అడుగులకు లీజులు పరిమితం అవుతాయనే అంచనాను వ్యక్తం చేశారు. 2021లో గిరాకీ మళ్లీ పుంజుకుని, గత పదేళ్ల సరాసరి లీజింగ్‌ 3.1 కోట్ల చదరపు అడుగుల్ని అధిగమిస్తుందని స్థిరాస్తి కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. వర్క్‌ప్లేస్‌ ట్రెండ్స్‌ ఇండియా వ్యవస్థాపకులు తుషార్‌ మిత్తల్‌ నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్న పలువురు పరిశ్రమ నిపుణులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.

* తమ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల నిర్వహణకు భారత ప్రభుత్వ అనుమతి లభించినట్టు ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా ప్రకటించింది. పెగిహెప్‌ చికిత్సా విధానానికి సంబంధించి ప్రయోగాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు సంస్థ ప్రకటించింది.

* డీబీఎస్‌ బ్యాంక్‌ (సింగపూర్‌) నుంచి రూ.2,500 కోట్ల మూలధన సాయం అందినట్లు డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌) శుక్రవారం వెల్లడించింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ)ను తమ బ్యాంక్‌లో విలీనం చేసుకునేందుకు ఈ సాయం తోడ్పడుతుందని పేర్కొంది. ఈ రెండు బ్యాంకుల విలీన పథకం నవంబరు 27 నుంచి అమల్లోకి వచ్చింది. విలీన ప్రక్రియ తరవాత డీబీఐఎల్‌ మూలధనం, మూలధన నిష్పత్తి (సీఏఆర్‌) ఆర్‌బీఐ నిర్దేశించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. ఈ విలీనం ద్వారా ఎల్‌వీబీ డిపాజిటర్లకు, ఖాతాదార్లకు, ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు అందుతాయని తెలిపింది. డీబీఎస్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల్ని కూడా వాడుకోవచ్చని తెలిపింది.