WorldWonders

రష్యాలో బర్గర్ కోసం ₹2లక్షలు ఖర్చు

రష్యాలో బర్గర్ కోసం ₹2లక్షలు ఖర్చు

రష్యాకు చెందిన మిలియనీర్‌ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాకు విహార యాత్రకు వెళ్లారు. వెళ్లింది హాయిగా గడపడానికే అయినా, నచ్చిన ఆహారం దొరకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. దాంతో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బర్గర్ తినేందుకు 450 మైళ్లు ప్రయాణించాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. 33 ఏళ్ల విక్టోర్ మార్టినోవ్ అనే మిలియనీర్‌ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాలోని అలుస్తాకు విహార యాత్రకు వెళ్లారు. అయితే అక్కడ దొరికే ఆహారం ఆయన నోటికి రుచించలేదు. అక్కడ నుంచి దగ్గర్లోని మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కు వెళ్లాలంటే 450 మైళ్లు ప్రయాణించాల్సి ఉంటుంది. డబ్బు కంటే అనుకున్నప్పుడు నచ్చిన వంటకం రుచి చూడడమే ముఖ్యమనుకొని, అప్పటికప్పుడు ఒక హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకున్నారు. తమకు నచ్చినట్లుగా 49 పౌండ్లు(సుమారు రూ.5,000) విలువైన వంటకాలు రుచి చూసి తిరిగి వచ్చేశారు. ఈ ప్రయాణానికి వారికి అయిన ఖర్చు 2,000 పౌండ్లు( అంటే అక్షరాలా రూ. రెండు లక్షలు). దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను మార్టినోవ్‌ నెట్టింట్లో షేర్ చేయగా నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ‘నేను, నా స్నేహితురాలు ఆర్గానిక్ ఫుడ్‌తో విసిగిపోయాం. అందుకే మేం మాకు నచ్చిన ఆహారం తినడం కోసం హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకున్నాం. ఈ ప్రయాణం మాకు గుర్తుండిపోయే సాహసంగా మిగిలింది. మేం అక్కడ బర్గర్లు తిని, తిరిగొచ్చేశాం’ అని వివరించారు. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న దగ్గరి నుంచి మెక్‌డొనాల్డ్స్‌ అక్కడ తన సేవలను నిలిపివేసింది.