DailyDose

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ADGP కారు-నేరవార్తలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన నందిగామ ADGP కారు-నేరవార్తలు - Crime News - Crime News - Nandigama ADGP Tripathi Car Hits Two Wheeler - ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ADGP కారు-నేరవార్తలు

* కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజాలా కు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో బైక్‏ను అడిషనల్ డీజీపీ కారు ఢికొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రహదారి పక్కన గల కందకంలోకి డీజీపీ కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ఉన్న వ్యక్తి కంచిక చర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహరావు గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజాలా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆయనను వేరే కారులో తరిలించారు సెక్యూరిటీ సిబ్బంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి దర్యాప్తు చేపట్టారు.

* బ్లేడ్‌ బ్యాచ్‌ మరోసారి చెలరేగింది. తాడేపల్లి మండలం మెల్లెంపూడి డొంకలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకరిపై తీవ్రంగా దాడి చేసింది. విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన అచ్యుతరావును కొంతమంది ద్విచక్ర వాహనంపై ఇక్కడకు తీసుకొచ్చి బ్లేడుతో దాడికి పాల్పడ్డారు. అటుగా కారులో వెళ్తున్న వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అతనిని 108 అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు. అపస్మారక స్థితి నుంచి అతను బయట పడితేగానీ అతనిని తీసుకొచ్చిందెవరు? దాడి చేసింది ఎవరు అనేది తేలుతుందని పోలీసులు చెప్పారు.

* ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున బాపులపాడు మండలం బోమ్ములూరు వద్ద ఈ ఘటన జరిగింది. భీమవరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి వచ్చి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన మిగతా నలుగురిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకుపోయిన మృతులను క్రేన్‌ సాయంతో బయటికి తీశారు. మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా, మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లెకు చెందిన దంపతులుగా గుర్తించారు.

* తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌ మెట్లెక్కిన మహిళపై బెల్ట్‌తో దాడి చేసిన ఎస్సై ప్రకాశ్ కుమార్‌ను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్‌)కు పంపారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేశ్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. అర్బన్‌ జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీ సుప్రజను విచారణాధికారిగా నియమించి నివేదిక తెప్పించారు. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించినట్లు నిర్ధారించుకుని ఎస్సైను వీఆర్‌కు పంపారు.

* జీవితాంతం తోడుంటానన్న భర్తే తన భార్య ఆహుతయ్యేందుకు సాయమందించిన ఘటనిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన ఫారుఖ్‌, షహీనాలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతోపాటు అత్తమామలు షహీనాను వేధించేవారు. మనస్తాపం చెందిన ఆమె శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిపై పెట్రోలు పోసుకుంది. వారించాల్సిన భర్త తనకేమీ సంబంధం లేనట్లు పక్కనే నిల్చున్నాడు. ఆమె అడగటంతో ఫారుఖ్‌ అగ్గిపుల్ల అందించాడు. షహీనా వెంటనే నిప్పంటించుకోవటంతో ఫారుఖ్‌ హతాశుడై మంటలు ఆర్పడానికి ప్రయత్నించాడు. దీంతో అతనూ గాయాలపాలయ్యాడు. బంధువులు ఆమెను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటంతో ప్రథమ చికిత్స నిర్వహించి కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. షహీనా శరీర భాగాలు 60 శాతం కాలిపోవటంతో ప్రాణాపాయం ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

* కర్నూలు జిల్లా ఆదోని మండలం మండిగిరి పంచాయతీలో ఆదివారం భాజపా కార్యకర్త కేశవ్‌పై వైకాపా నాయకుడు ఉలిగప్ప దాడి చేసి గాయపరిచాడు. బాధితుడి కథనం.. భాజపా కార్యకర్త కేశవ్‌కు రాజీవ్‌గాంధీనగర్‌లో క్షౌరదుకాణం ఉంది. ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కేశవ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. అర్హుల జాబితాలో తన పేరు లేకపోవడంతో స్థానిక వైకాపా నాయకుడైన శేషిరెడ్డి వద్దకు వెళ్లి తన పేరు ఎందుకు లేదని కేశవ్‌ అడిగాడు. తర్వాత కొద్దిసేపటికి ఉలిగప్ప అనే వైకాపా నాయకుడు కేశవ్‌ దుకాణం వద్దకు వచ్చి ‘నీవు భాజపా కార్యకర్తవి కదా.. ఇంటి పట్టా ఎలా అడుగుతావు’ అని పరుష పదజాలంతో మాట్లాడి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ విషయమై బాధితుడు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి, చికిత్స కోసం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చేరాడు. పట్టణ సీఐ శ్రీరాములు ఫిర్యాదును స్వీకరించారు. భాజపా నాయకుడు ప్రకాశ్‌జైన్‌, నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డేమాను గోపాల్‌ బాధితుడిని పరామర్శించారు.

* ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం డీఆర్జీ, సీఆర్పీఎఫ్‌ బలగాలకు అయిదుగురు మావోయిస్టులు పట్టుబడ్డారు. గదిరాజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి గురిపీ అటవీ ప్రాంతంలో పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా వల్గేర్‌ ఏరియా కమిటీకి చెందిన సోముడు నాయకత్వంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో గాలింపు చేపట్టిన బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సమయంలో కొందరు మావోయిస్టులు పారిపోగా.. అయిదుగురు పట్టుబడ్డారు.