Business

సెన్సెక్స్ సరికొత్త రికార్డు-వాణిజ్యం

Business News - Sensex New All Time High Dec 2020

* దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దేశీయంగా వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో సూచీలు కూడా లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్లు లాభపడి 45,608 చేరగా, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 13,392 వద్ద స్థిర పడింది.

* 2021 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను అందించడం మొదలుపెడుతుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మంగళవారం ప్రకటించారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2020లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని అభివర్ణించారు. ఈ ఆధిపత్యం కొనసాగించడానికి అవసరమైన 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా ప్రారంభించేందుకు విధానపరమైన నిర్ణయాలు భారత్‌ త్వరగా తీసుకోవాలన్నారు. దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

* దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. మంగళవారం పసిడి ధర 10 గ్రాములకు రూ. 816 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి రూ. 49,430 పలికింది. అటు వెండి కూడా ఇదే బాట పట్టింది. కొనుగోళ్ల కళతో ఒక్కరోజే ఏకంగా రూ. 3,063 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 64,361కి చేరింది.

* కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థకు నూతన సీఈవోగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కుమార్తె అయిన మాళవిక.. అప్పుల్లో ఉన్న కాఫీడే సంస్థను తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు గతంలో చెప్పారు. సీఈవోతో పాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్‌ వసుంధరా దేవీ, గిరి దేవనూర్‌, మోహన్‌ రాఘవేంద్రను సంస్థ బోర్డు నియమించింది. వీరు 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగుతారని బోర్డు వెల్లడించింది.

* వివిధ కాలావధి రుణాలపై యెస్‌ బ్యాంక్‌ 5-70 బేసిస్‌ పాయింట్లు మేర ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించింది. రేట్ల కోత తర్వాత ఈ బ్యాంకు ఎంసీఎల్‌ఆర్‌ 6.35- 8.55% శ్రేణిలో ఉండనుంది. బ్యాంకులు ప్రతి నెలా మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటును సమీక్షించాలన్నది ఆర్‌బీఐ నిబంధన.

* అవసరానికి, కోరికకు మధ్య ఉన్న చిన్నగీతను ఆర్థిక ప్రణాళికను తారుమారు చేస్తుంది. అనవసర కోరికలకు పోయి అప్పుల పాలవ్వడం వల్ల ఆందోళన తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే చక్కని ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే దేనికెంత ఖర్చు చేయాలో ఓ అవగాహనకు రాగలుగుతారు. భవిష్యత్‌లో రమారమి ఎంత డబ్బు అవసరమవుతుందో అంచనా వేయగలుగుతాం. సరైన సమయానికి హైరానా పడకుండా ఉండేందుకు ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందువల్ల కొన్ని కోరికలు చంపుకునైనా కొంతమొత్తాన్ని పొదుపు చేయమని నిపుణులు చెతున్నారు.