Business

వాట్సాప్-ఇన్‌స్టాలు అమ్మక తప్పదా?-వాణిజ్యం

వాట్సాప్-ఇన్‌స్టాలు అమ్మక తప్పదా?-వాణిజ్యం

* సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు గట్టి షాక్‌ తగిలింది. వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించి చిన్న చిన్న ప్రత్యర్థి సంస్థలను అణిచేస్తోందంటూ అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం, 48 రాష్ట్రాలు ఈ కంపెనీపై న్యాయస్థానాల్లో దావా వేశాయి. దీంతో ఫేస్‌బుక్‌ తన అనుబంధ విభాగాలైన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించాల్సి వచ్చే పరిస్థితి ఎదురైంది. అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌(ఎఫ్‌టీసీ), 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ ఈ దావా వేశారు.

* వరుసగా రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ల దూకుడుకు బ్రేక్‌ పడింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌ 46 వేలు, నిఫ్టీ 13,500 మార్కు దాటిన నేపథ్యంలో గురువారం నాటి ట్రేడింగ్‌లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, ఇన్‌ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో సూచీలు నష్టపోయాయి.

* బంగారం ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.534 తగ్గి 48,652కి చేరింది. మరోవైపు వెండి సైతం కేజీకి రూ.628 తగ్గింది. దీంతో దిల్లీలో కేజీ వెండి ధర రూ.63,339కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1835 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 23.84 డాలర్లగా ఉంది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీకి సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండడం, డాలరు విలువ వరుసగా నాలుగో రోజూ బలపడడం వంటివి అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్ తపన్‌ పటేల్‌ వెల్లడించారు.

* కొవిడ్‌ తర్వాత మార్కెట్లోకి కొత్త సంస్థలు ఐపీవోలకు రావడం మొదలైంది. త్వరలో ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఇండియన్‌ రైల్వేస్‌ ఫైనాన్సింగ్‌ కార్పొరేషన్‌’ ఐపీవోకు రానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఎండీ అమితాబ్‌ బెనర్జీ పీటీఐకు తెలిపారు. మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా కొనసాగితే డిసెంబర్‌ మూడో వారంలో బిడ్డింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక వేళ ప్రతికూలంగా మారితే మాత్రం జనవరి వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు.

* దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ తన బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభ తేదీని ప్రకటించింది. ఈ ఆఫర్‌ విలువ సుమారు రూ.16వేల కోట్లుగా భావిస్తున్నారు. ఇది డిసెంబర్‌ 18న మొదలై.. జనవరి 1వ తేదీన ముగియనుంది. గత నెల 5,33,33,333 వాటాలను బైబ్యాక్‌ చేసేందుకు టీసీఎస్‌ వాటాదారులు అనుమతి మంజూరు చేశారు. ఒక్కోషేరు రూ.3,000 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ‘‘ సెబీ బైబ్యాక్‌ నిబంధనలు-2018 ప్రకారం ఆఫర్‌ లెటర్‌ను అర్హులైన వాటాదారులకు పంపించనున్నాము. ఈ ప్రక్రియ డిసెంబర్‌ 15 కంటే ముందే పూర్తవుతుంది’’ అని బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది.