Politics

హరీశ్‌రావుకు కేసీఆర్ ప్రశంసలు

KCR Praises Harish Rao And Siddipeta

తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ సిద్దిపేట అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ ఎంపీగా రెండో చోట్లా తాను విజయం సాధించానని.. తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ పదవిలో కొనసాగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సమయంలో ఎంతో దుఃఖించామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటపుడు ఆణిముత్యంలాంటి నాయకుడిని ఇచ్చి వెళ్లానని మంత్రి హరీశ్‌ను ఉద్దేశించి చెప్పారు. హరీశ్‌ తన పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశారనే సంతోషం గుండెలనిండా ఉందని కేసీఆర్‌ కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్‌ కష్టాలు లేవని.. భవిష్యత్‌లోనూ రావన్నారు. పటిష్ఠమైన విధానంతో ముందుకెళ్తున్నామని.. అవసరమైతే ఇతరులకు విద్యుత్‌ ఇచ్చే స్థితికి చేరుతున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో వెనుకబడిన, మూరుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నామని.. దానికి అనుగుణంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్‌ వివరించారు. సిద్దిపేట మంచినీటి విధానాన్నే మిషన్‌ భగీరథ పేరుతో రాష్ట్రమంతా విస్తరించామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 98.31 శాతం ఇళ్లకు నల్లా సదుపాయం ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని.. ఇది తాము చెబుతోంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందని చెప్పారు. సిద్దిపేటలో చుక్క నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని నాటి పరిస్థితులను కేసీఆర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు రంగనాయక సాగర్‌ ద్వారా అద్భుత సాగునీరు అందిస్తున్నామన్నారు. రంగనాయక సాగర్‌ చుట్టూ సుందరీకరణకు రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన‌ ప్రకటించారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసల రహదారిని మంజూరు చేస్తామని.. దీనిపై రేపే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం కాల్వ ద్వారా సాగునీరు అందని గ్రామాల కోసం ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇర్కోడు ఎత్తిపోతల పథకంగా దానికి నామకరణం చేస్తామన్నారు. దీనికోసం రూ.85కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రూ.161 కోట్లతో నియోజకవర్గం చుట్టూ మరో ఔటర్‌ రింగురోడ్డు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సిద్దిపేట డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కొత్తగా మరో వెయ్యి ఇళ్లతో పాటు సిద్దిపేటకు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టౌన్‌హాల్‌ నిర్మాణానికి రూ.50కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు రూ.25కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్‌ వివరించారు. సిద్దిపేటలో నెలరోజుల్లో బస్తీ దవాఖానా ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.