DailyDose

హైదరాబాద్‌లో ఏసీబీ దాడుల కలకలం-తాజావార్తలు

ACB Raids HMDA - Telugu Breaking News

* హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..భారీగా న‌గ‌దు ల‌భ్యంహైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్‌ వద్ద అధికారులు రూ.10.30 లక్షలను గుర్తించారు.దీంతో డీఎఫ్‌వో ప్రకాశ్‌కు చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు.డీఎఫ్‌వో ప్రకాశ్‌ గుత్తేదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రైడ్‌ చేసింది.డీఎస్పీ సూర్యానారాయణ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం విచారణ చేపట్టింది.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయిన ఆయన.. తాజాగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వరదలు, అకాల వర్షాల సమయంలో విపత్తు నిర్వహణ కింద రావాల్సి నిధులు, కేంద్రహోంశాఖ నుంచి పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాలపై కేసీఆర్‌ కీలకంగా ప్రస్తావించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో వరదలకు పాడైన రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా అమిత్‌షాతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

* సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ ధన్ రాజ్, వేణు నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ తన ఛాంబర్ లో విడుదల చేశారు. షార్ట్ ఫిల్మ్ లో నటించిన ధన్ రాజ్ ని, షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటింగ్ చేసిన హైమను, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ రికార్డింగ్ చేసిన గాయత్రి స్టూడియోస్ ప్రతినిధిని సజ్జనార్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ… “ఇటీవల కాలంలో సామాజిల మాధ్యమల్లో కొంతమంది సైబర్ నేరగాల్లు, ఆకతాయిలు సెలబ్రిటీలు, వీఐపీలు, రాజకీయ నేతలు, సినీ నటులు, సమాజంలోని వివిధ ప్రముఖులు, పోలీసులు, బాగా పరిచయమున్న వారి పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి తమకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, వెంటనే తిరిగి చెల్లిస్తామని చెప్పి నమ్మబలికి మోసం చేస్తున్నారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు!

* హైదరాబాద్ పాతబస్తీలో అంజలి అనే మహిళ చిట్ ఫండ్స్ పేరుతో 15 కోట్లరూపాయలతో కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్ జరిగింది.

* కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిబంధనలు తొలగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడిన వారిని దర్శనానికి అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా అమల్లో ఉన్న నిబంధనలను తొలగిస్తూ వారుకూడా శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు అనుమతిస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అనారోగ్యానికి వ్యాధి కారణం కాదని.. రియాక్షన్‌ మాత్రమేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ప్రజలు అస్వస్థతకు గురికావడానికి స్పష్టమైన కారణాలు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని.. మరికొన్ని పరిశోధన ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. అంతుచిక్కని ఈ రియాక్షన్‌కు సంబంధించిన కారణాలను నిర్ధారించేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని కమిషనర్‌ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా తాగు నీటిలో సీసం, నికెల్‌ లేదని తేలిందన్నారు.

* నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల ఆదాయం గురించి మీడియాలో వచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులందరూ పంజాబ్‌ రైతుల్లా ఆదాయం పెంచుకుందామంటే.. మోదీ ప్రభుత్వం వారి ఆదాయాలను బిహార్‌ రైతుల మాదిరిగా చేద్దామనుకుంటోందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ప్రధాని మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో రాహుల్‌ ఈ విధంగా స్పందించారు.

* భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడితో బంగాల్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. దాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నేడు పశ్చిమబంగాల్‌ డీజీపీ, చీఫ్‌ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. దీంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చూస్తోందని టీఎంసీ దుయ్యబట్టింది. అంతేగాక, దాడి జరిగేలా భాజపా నేతనే రెచ్చగొట్టారని ఆరోపించింది.

* యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తన అభిమానిని చూసి స్ఫూర్తి పొందారు. స్వప్నిక అనే దివ్యాంగురాలు నోటితో రౌడీ బొమ్మ గీశారు. వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. విజయ్‌ను ట్యాగ్‌ చేశారు. తన స్వస్థలం శ్రీకాకుళం అని, విజయ్‌ స్కెచ్‌ వేస్తున్నానని తెలిపారు. దీన్ని చూసిన విజయ్‌ ట్విటర్‌లో స్పందించారు. ఆమెకు తన అమితమైన ప్రేమను పంపుతున్నట్లు తెలిపారు. ‘నీ నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందాను. థ్యాంక్స్‌’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

* ఆస్ట్రేలియాలో దేశీయంగా తయారుచేస్తున్న ఓ కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి దశలో ఆశాజనక ఫలితాలిచ్చిన ఈ టీకా రెండు, మూడో దశలో మానవ శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు కారణమైనట్లు తేలిందని అధికారులు తెలిపారు. అయితే, అవి అంత ప్రమాదకరమైనవేమీ కానప్పటికీ.. టీకా ప్రయోగాల్ని, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ విశ్వవిద్యాలయం, ఔషధ తయారీ సంస్థ సీఎస్‌ఎల్‌ సంయుక్తంగా ఓ టీకాను తయారుచేశాయి.

* వరంగల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన 9 మంది హత్య (మృత్యు బావి) కేసులో వరంగల్‌ పోక్సో కోర్టు మరో కీలక తీర్పును వెల్లడించింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని హతమార్చి బావిలో జలసమాధి చేసిన కేసులో ఉరిశిక్ష పడిన సంజయ్‌కుమార్‌కు మరో కేసులో వరంగల్‌ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషి సంజయ్‌కుమార్‌ జీవించి ఉన్నంత కాలం జైల్లోనే ఉండాలని వరంగల్‌ పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి కావూరి జయకుమార్‌ శుక్రవారం తీర్పు వెల్లడించారు.