Politics

జగన్ ప్రభుత్వ సేవకు శ్రీలక్ష్మీకి లైన్ క్లియర్-తాజావార్తలు

జగన్ ప్రభుత్వ సేవకు శ్రీలక్ష్మీకి లైన్ క్లియర్-తాజావార్తలు

* ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీ కేడర్‌కు రిపోర్టు చేశారు.తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌ డిప్యుటేషన్​కు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది.ఏపీ సాధారణ పరిపాలన శాఖకు శ్రీలక్ష్మి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు.ఏపీ ప్రభుత్వం త్వరలోనే శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటి వరకూ ఆమె తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి కీలక పదవుల్లో పనిచేశారు.అనంతరం ఓబులాపురం గనుల వ్యవహారంలో చిక్కుకుని సీబీఐ తాఖీదులు పొందారు.ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్నారు.అనంతరం తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్​పై వచ్చేందుకు దరఖాస్తు చేశారు.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా దాదాపు అరగంట పాటు ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కేసీఆర్‌చర్చించినట్లు తెలుస్తోంది.

* రజనీ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం.సూపర్​ స్టార్​ రజనీకాంత్​ 70వ పుట్టినరోజు సందర్భంగా పోయస్​ గార్డెన్​లోని ఆయన నివాసం వద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు.వారిలో కొందరు తలైవా వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రోబో, భాషా తదితర చిత్రాల్లోని రజనీ గెటప్​లను వేసి అలరించారు.రజనీకాంత్​ పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు.రజనీకాంత్​ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టినరోజును అభిమానులు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

* ఏపీ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎ్‌సఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం మరో లేఖ రాశారు. 2021 ఓటర్ల జాబితా ప్రక్రియను అప్‌డేట్‌ చేయాలని, కొత్త ఓటర్లకు ఫిబ్రవరిలో జరిగే స్థానిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సూచించారు. స్థానిక ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు జరగకుంటే కేంద్రం నుంచి నిధులు రాబోవని, ప్రక్రియ నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్‌కే ఉంటాయని హైకోర్టు పేర్కొన్న విషయాలను కూడా నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు.

* తెలంగాణలో మూడునెలల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ల బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనుండగా అందుకోసం స్లాట్‌ల బుకింగ్‌ కొనసాగుతోంది. సంబంధిత శాఖ వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌లను పొందవచ్చు. పౌరులకు, బిల్డర్‌లకు విడిగా లాగిన్ సదుపాయం కల్పించారు. స్లాట్‌ల బుకింగ్‌తో పాటు ఇతర సేవలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

* అమరావతి కోసం ప్రభుత్వంతో సాగిస్తున్న పోరులో విజయం సాధించి తీరుతామని రాజధాని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబరు 17 నాటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా గుంటూరులో అమరావతి ఐకాస శనివారం మహా పాదయాత్ర చేపట్టింది. శుభం కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు జరిగిన ఈ పాదయాత్రలో మహిళలు, రైతులు వేలాదిగా పాల్గొన్నారు. తెదేపా, వామపక్ష నేతలు రైతులకు సంఘీభావం తెలిపారు.

* హరియాణా ప్రభుత్వంలో తాను ఉన్నంత వరకు ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందేలా చూస్తానని డిప్యూటీ సీఎం, జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 17 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్రం వచ్చే 24గంటల నుంచి 40 గంటల్లో మరో దఫా చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నానన్నారు. శనివారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

* కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఎల్లుండి సింఘు సరిహద్దులో నిరాహార దీక్ష చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 19లోపు తమ డిమాండ్లు అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని, కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు.

* సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ప్రకటించబోయే రాజకీయ పార్టీ గురించే ఇప్పుడు చర్చంతా. డిసెంబర్‌ 31న తన రాజకీయ పార్టీ గురించి మరిన్ని విషయాలు ప్రకటిస్తానని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ పార్టీకి సంబంధించిన ఎలాంటి చిన్నవార్త కూడా బయటికి రాకూడదని తన బృందానికి గట్టిగానే సూచించారట. ఇదంతా ఇలా ఉండగా.. ఆయన పార్టీ గుర్తు ఇదేనంటూ వినిపిస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆయన చివరిసారిగా మీడియా ముందు కనిపించినప్పుడు ‘రాక్‌ ఆన్‌’ ఎమోజీ (బాబా సినిమా లోగో) అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు.

* భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, బెంగాల్‌ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రంలోకి రప్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ శనివారం సమన్లు జారీ చేసింది. దీంతో ఈ పరిణామాలు ఇరుపక్షాల మధ్య మరింత వేడిని పెంచాయి. పశ్చిమబెంగాల్‌ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌ ఎస్పీ భోల్‌నాథ్‌ పాండే, ప్రెసిడెన్సీ రేంజ్‌ డీఐజీ ప్రవీణ్‌ త్రిపాఠి, దక్షిణ బెంగాల్‌ అదనపు డీజీ రాజీవ్‌ మిశ్రాలను కేంద్రంలో పనిచేయాలని పిలిచింది.

* వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్ అంటే అందరికీ గుర్తొచ్చేది బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించడం. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 13 సగటుతో 117 పరుగులే చేశాడు. అయితే ఐపీఎల్‌లో సత్తాచాటడానికి ఎంతో ప్రయత్నించానని, కానీ ఏదీ కలిసిరాలేదని రసెల్ అన్నాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ (సీపీఎల్‌)‌ అనంతరం వెంటనే యూఏఈకి చేరుకోవడంతో బయోబబుల్‌ తనని మానసికంగా దెబ్బతీసిందని తెలిపాడు.

* కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నర్సాపురలో ఉన్న ప్రముఖ కంపెనీకి చెందిన ఫోన్లను తయారుచేసే విస్టర్న్‌ కార్పొరేషన్‌ ప్లాంట్‌పై కార్మికులు దాడి చేశారు. జీతాలు చెల్లించడం లేదంటూ ప్లాంట్‌లోని అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ప్లాంట్‌పై ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యాలయంలోని అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను విరగ్గొట్టారు. వాహనాలను సైతం తగలబెట్టారు.

* బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ఆరోగ్యం ఏ క్షణంలోనైనా క్షీణించొచ్చని రాంచీలోని రిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ ఉమేశ్‌ ప్రసాద్‌ అన్నారు. ఆయన కిడ్నీలు 25శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం క్షీణించొచ్చని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని డాక్టర్‌ ప్రసాద్‌ అన్నారు.

* తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ అరంగేట్రంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావమూ ఉండబోదని తమిళనాడు సహకార మంత్రి సెల్లూర్‌ కె రాజు అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీ రామచంద్రన్‌ లేదా జయలలితలా విజయవంతం కాలేరన్నారు. తమిళనాడులో సీఎం పళనిస్వామి ప్రభంజనం కొనసాగుతోందని, రాష్ట్రంలో ఎవరు పాలించాలో, కేంద్రంలో ఎవరు ఉండాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.