Kids

బందరు లడ్డూ కథాకమామీషు

బందరు లడ్డూ కథాకమామీషు

బందరు కోనేరు సెంటర్… ఈ పేరు చెప్పగానే ఎంతటివారికైనా నోరూరాల్సిందే…షుగర్ పేషెంట్లను కూడా ఆ వాసన విడిచిపెట్టదు…ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ రుచి చూసేద్దాంలే అనుకుంటారు…అదే బందరు లడ్డు సెంటరు.. ఒక స్వీటు ఆ ఊరి పేరుతో ప్రసిద్ధి కావడం విశేషమే కదా…

బందరు లడ్డుగా ప్రసిద్ధి చెందిన ఆ లడ్డు అసలు పేరు తొక్కుడు లడ్డు. ఈ లడ్డూని శనగ పిండితో తయారు చేస్తారు. దీని తయారీకి చాలాసేపే పడుతుంది. తయారుచేసి నోట్లో వేసుకున్నాక శ్రమ అంతా మర్చిపోవలసిందే. అక్కడి తాతారావు స్వీట్ దుకాణంలో బందరు లడ్డు కొనడానికి జనం ఎగబడతారు. దుకాణానికి ముందు వైపు మోడరన్ గ్లాసుతో డిజైన్ చేసి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా విలక్షణంగా ఉంటుంది.

ఎడమ పక్కన గోడ మీద డజన్ల కొద్దీ సర్విసెట్టి సత్యనారాయణ తాతారావు చిత్తరువులు ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జగ్జీవన్‌రామ్… వంటి పెద్దలంతా ఆయన దుకాణంలోని బందరు లడ్డూ అభిమానులు. వారు నిత్య కస్టమర్లు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి బందరు లడ్డు మీద ఎనలేని ప్రేమ. ‘‘ఈ దుకాణాన్ని మా మామగారు 1951లో ప్రారంభించారు’’ అని చెప్పే తాతారావు బందరు లడ్డూ దుకాణాలను విస్తృత పరిచారు.

విచిత్రమేమంటే ఈ లడ్డు తయారీ విధానాన్ని ఇక్కడకు తీసుకువచ్చినవారు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు. వాళ్లని సింఘ్స్ లేదా బొందిలీలు అంటారు. బందరులో స్థానికంగా ఉండేవారు వీరి దగ్గర తయారీ విధానం తెలుసుకున్నారు. వలస వచ్చిన ఉత్తర భారతీయులు ఈ లడ్డు తయారీని క్రమేపీ విడిచిపెట్టేశారు. స్థానికంగా ఉన్న బందరు వాస్తవ్యులు మాత్రం దీన్ని అందిపుచ్చుకున్నారు.

‘‘మా దగ్గర తయారయ్యే లడ్డూలు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నాయి. ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడకు మా లడ్డూలు ప్రయాణిస్తాయి. బందరు లడ్డు తయారీ సామాన్యం కాదు. చాలా శ్రమతో కూడిన పని. అసలు సిసలైన ఘుమఘుమలాడే మధురమైన రుచి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తారు. మామూలు రుచి రావడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే విషయాన్ని పరోక్షంగా చెబుతారు తాతారావు.
తయారీ విధానంలో ఎటువంటి మార్పూ తీసుకు రాకపోవడమే తన విజయ రహస్యం అంటారు తాతారావు. ఏ విధంగా తయారుచేస్తారో చూడాలనుకునేవారిని ఆప్యాయంగా వంటగదిలోకి తీసుకువెళ్లి, అన్నీ వివరిస్తూ చూపుతారు.
పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లేకుండా అయినా పెళ్లి అవుతుందేమోకాని, బందరు లడ్డు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యమూ జరగదు అని చెబుతారు అక్కడి పనివారు.

స్వీట్స్‌ అంటే ఇష్టంలేనివారిని సైతం తినిపించేలా నోరూరించే మిఠాయి ‘బందరు లడ్డు’. ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి’ అని లొట్టలేసుకుంటూ తింటారు. తీపి తినటానికే పుట్టాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఈ బందరు లడ్డు. ప్రపంచ ప్రసిద్థిగాంచిన ఈ లడ్డూ మనం మచిలీపట్నంగా పిలుచుకునే బందరులోనే తయారీ. అందుకే ఈ లడ్డూకి ‘బందరు లడ్డు’ అని పేరుపడిపోయింది. రుచుల్లో రారాజుగా ఖ్యాతికెక్కిన ఈ తొక్కుడు లడ్డూ తీపి చరిత్రను తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? అందుకే జీవన పనుగట్టుకొని బందరుకు వెళ్లి, అనేక తీపికబుర్లు మోసుకొచ్చింది. ఆ విశేషాలు మీకు ప్రత్యేకం.
పరిచయం అవసరంలేని విశిష్టమైన మిఠాయి బందరు లడ్డు. బందరులో లడ్డూ, హల్వానే కాక ప్రతి మిఠాయికీ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచి ఎన్నో యేళ్లుగా తెలుగు ప్రజల కీర్తిలో ఓ భాగమవుతూ వస్తోంది. బందరు వెళ్ళిన వారంతా మరిచిపోకుండా కొనుక్కొని మరీ తినేలా ఈ ఊరి పేరుతో ప్రసిద్ధికెక్కింది బందరు లడ్డు.
**బందరులడ్డూ చరిత్ర
వందల సంవత్సరాలకు ముందున్న చరిత్రను తిరగేస్తే తప్ప బందరు లడ్డూ పుట్టుక గురించి చెప్పలేం. అది రెండవ ప్రపంచయుద్ధం కాలం నాటి మాటగా చెప్తుంటారు. మొదటిగా ఈ లడ్డూ సింగ్‌లచే బందరు వాసులకు సంక్రమించిందని చెప్తారు. రాజ్‌పుత్‌ల వంశం నుంచి వచ్చిన వారు సింగ్‌లనీ, వీరు బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి వచ్చారనీ, వారిని ఇక్కడ బొందిలీలు అన్నారనీ, వారే ఈ లడ్డూ తయారీని నిర్వహించేవారనీ ప్రతీతి. ఇక్కడి వారి మాటల ప్రకారం బుద్దూసింగ్‌, నారాయణసింగ్‌, నాట్‌సింగ్‌, జగన్నాథ్‌సింగ్‌, ఠాకూర్‌సింగ్‌ అనేవారు పూర్వం బందరు లడ్డూకు అప్పట్లోనే ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చారట.
**అసలు సారథులు
బందరు లడ్డూ తయారీలో వృత్తిపరమైన గురువులుగా చక్కా నారాయణస్వామి, అనుముకొండ రాఘవయ్య (జింటాన్‌ మేస్త్రీ), తెలుకల రాఘవయ్య, టార్జాన్‌ మేస్త్రీ, గౌరా మల్లయ్య్ల ప్రసిద్ధి గడించారు. ప్రస్తుతం బందరు లడ్డూకి పేరొందిన తాతారావు మామగారైన వెంకటరత్నం సింగ్‌ల దగ్గర ఫార్ములా నేర్చుకున్నారని కొందరు చెబుతుంటారు. ఇక పరిశ్రమ యజమానులుగా అప్పటి కాలం నుంచి కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, మద్దుల దుర్గయ్య, రేపల్లె వెంకటేశ్వర్లు, విడియాల గురునాథం, విడియాల సత్యం, శిర్విశెట్టి రామకృష్ణారావు, శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య, పెడన శేషయ్య లడ్డూ తయారీలో విశేషమైన శ్రద్ధ చూపారంటారు. ఇప్పుడు బందరులో తాతారావు నడుపుతున్న తాతారావు మిఠాయి కొట్టు, అలాగే గౌరా మల్లయ్య కుమారుడైన గౌరా వెంకటేశ్వరరావు నడిపిస్తున్న మల్లయ్య మిఠాయి కొట్లు స్థానికంగా ప్రసిద్ధి.
**బెల్లంతోనే మధురిమ
ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా మిఠాయి చేయటానికి ఎక్కువగా పంచదార వాడతారు. ఒక్క బందరులోనే బెల్లం వాడతారు. అందుకే ఈ మిఠాయికి అంత రుచి, పేరు వచ్చింది. కొన్ని వందల ఏళ్ల నుంచి మన తెలుగువారి సంస్కృతిలో భాగంగా వస్తుంది. ఇక్కడ అమ్మే స్వీట్లలో బందరు లడ్డు, హల్వాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ బందరు లడ్డు, హల్వా తయారీవిధానంలో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది.
**నకిలీ బెడద ఎక్కువే
తాతారావు, మల్లయ్య ఒకప్పుడు కలిసే పనిచేసి, తర్వాత కాలంలో ఎవరికి వారు సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు. అయితే బందరు లడ్డూ పేరుతో చాలాచోట్ల నకిలీ స్వీట్స్‌ కూడా అమ్మేస్తున్నారు. ”ఇంత ప్రఖ్యాతి పొందిన బందరు లడ్డూని ఎగుమతి చేస్తే, ధర పెంచవలసి ఉంటుంది. ఒక్కోసారి లడ్డూ పాడవటం కూడా జరగొచ్చు. అలా జరిగితే అది మన తప్పు అవుతుంది. ఆ ప్రభావం వలన బందరు లడ్డూకి ఉన్న పేరు చెడుతుంది. పేటెంట్స్‌ వద్దు అది తీసుకుంటే దానిపై వచ్చే నకిలీలను అదుపు చేసే బాధ్యతను నిర్వర్తించడం చాలా కష్టం” అని తాతారావు చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే బందరు లడ్డూకి పేటెంట్‌ రాబోతుందట! డి.ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ నుంచి కూడా బందరు లడ్డూపై మంచి నివేదిక రావడం వలన బందరువాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ”భవిష్యత్‌లో దీన్ని నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే మనం చేసేదేమీలేదు” అంటున్నారు మల్లయ్య స్వీట్స్‌ యజమాని వెంకటేశ్వరరావు.
**’చేదు’ జీవితాలు
బందరులో లడ్డూ తయారీలో 300-400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ కలిపి ‘స్వీట్‌ మేకర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌’ అని పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా వీరిలో సమన్వయం లేకపోవటం వలన యూనియన్‌ స్థాపన సాధ్యపడటం లేదు. పొయ్యి వెలిగించటం దగ్గర నుంచి పాకం పట్టడం, లడ్డూని తయారుచేయడం, అగ్నిగుండంలా ఉండే వంటపొయ్యల దగ్గర పనిచేస్తుంటారు. వేడినూనెతో కానీ, వేడి నెయ్యితో కానీ పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ తట్టుకుంటూ జీవితాలను గడుపుతున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులు యజమాని ఎప్పుడైనా పనిలో నుంచి తీసేసినా, జీతం సరిగా ఇవ్వకపోయినా అడిగే దిక్కే ఉండదు. అందుకే యూనియన్‌ ఉండాలన్నది వీరి అభిప్రాయం. పని విధానంలో శ్రమను బట్టి జీతాలను ఇవ్వాలన్నది ఈ కార్మికుల విజ్ఞప్తి.
**తెలుగు రుచుల్లో మేటి
తెలుగు రుచులనగానే గుంటూరు కారం, గోంగూర పచ్చడి.. అంటాం.. అన్నింటిలో బందరు లడ్డూ తీపే మేటి. అలాంటి బందరు లడ్డూ నకిలీల కంట్లోపడి బెంబేలెత్తుతోంది. వందల ఏళ్ళ క్రితమే ప్రపంచ ఖ్యాతిగన్న బందరు లడ్డూ రుచి పేటెంట్‌ హక్కుకూ నోచుకోక విలవిల్లాడుతోంది. ”అయ్యా! బందరు లడ్డూ రుచి తెలిసిన పాలకులారా! బందరు లడ్డూ రుచికి న్యాయం చేయండి. లడ్డూ తయారీలో శ్రమటోడ్చేవారి కష్టాన్నీ పట్టించుకోండి!! అప్పుడే బందురు లడ్డూకి నిజమైన రుచి వచ్చినట్టు.
**150 ఏళ్ళ బండి
ఈ తోపుడు బండికి 150 యేళ్లు. అప్పట్లో ‘బొందిలీలు’ మిఠాయి ఈ బండిపైనే అమ్ముకునేవారట! గౌరా మల్లయ్య వాళ్ల దగ్గర పనిచేసేవారు. కొన్నేళ్ల తర్వాత ఈ తోపుడుబండిని మల్లయ్య వాళ్ల దగ్గర నుంచి కొనుక్కున్నారు. తర్వాత కాలంలో మల్లయ్య కూడా ఈ బండిపైనే బందరు మిఠాయి అమ్మేవారు. మల్లయ్య తదనంతరం అతని కొడుకు ఈ బండిని భద్రంగా ఉంచారు. బండికున్న రూపంలో ఎలాంటి మార్పూ చేయకుండా, కేవలం చెక్క ఉన్న స్థానంలో అల్యూమినియం ప్లేటు అమర్చి, గాలికొట్టాల్సిన అవసరంలేని ట్యూబ్‌లెస్‌ టైర్లను తొడిగి, ఇప్పటికీ ఈ బండిని చరిత్రకు ఆనవాలుగా ఇక్కడ ఉంచారు. అప్పటి బండిలోనే మిఠాయిలను పెట్టి బందరు లడ్డూకి ఉన్న ఘనచరిత్రను చాటుతున్నారు.

source:Telugu Ruchulu

https://m.facebook.com/story.php?story_fbid=1752060408384409&substory_index=0&id=1612541125669672