Business

మళ్లీ డీజిల్ కార్లు తయారు చేయనున్న మారుతీ-వాణిజ్యం

c

* దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) మరోసారి డీజిల్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు యోచిస్తోందని సమాచారం. ఎస్‌యూవీ, మల్టీపర్సస్‌ విభాగాల్లో డీజిల్‌ వాహనాలకు గిరాకీ ఉండడంతో కంపెనీ పునరాలోచనలో పడ్డట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు తప్పనిసరి చేయడంతో డీజిల్‌ సెగ్మెంట్‌ నుంచి మారుతీ తప్పుకున్న విషయం తెలిసిందే.

* ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌పై ఈ ఏడాది చివర్లో ఈపీఎఫ్‌వో 8.5శాతం చొప్పున వడ్డీ జమచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరుకోట్ల ఈపీఎఫ్‌వో ఖాతాలు ఉన్నాయి. ఈ ఏడాడి సెప్టెంబర్లో వడ్డీరేటు 8.5శాతాన్ని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో 8.15శాతం తర్వాత ఇన్‌స్టాల్‌ మెంట్‌లో 0.35శాతం జమ చేయనుంది. కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఆధ్వర్యంలో ఈపీఎఫ్‌వో ట్రస్టీల భేటీ జరిగింది.

* ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, రష్యా వేర్వేరుగా రూపొందించిన టీకాలను కలిపి కొవిడ్‌-19పై ప్రయోగించాలని ఆయా సంస్థలు నిర్ణయించాయి. ఇందుకోసం రెండు దేశాల పరిశోధక బృందాలు చేతులు కలపనున్నాయి. ఈ రెండు టీకాలను అడినోవైరస్‌ ఆధారంగానే రూపొందించారు. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదు. రష్యాలోని గమాలెయా పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన స్పుత్నిక్‌ టీకా ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం వల్ల ప్రజలకు కొవిడ్‌-19 నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందా అన్నది తేల్చేందుకు పరిశోధకులు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం గమాలెయా సంస్థ చేసిన ఒక ప్రతిపాదనకు ఆస్ట్రాజెనెకా సానుకూలంగా స్పందించింది. ఈ రెండు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భిన్న రకాల టీకాల మిశ్రమాన్ని ఉపయోగించడం.. కొవిడ్‌ నుంచి మెరుగైన రక్షణలో కీలకం కావొచ్చని గమాలెయా పేర్కొంది. వ్యాక్సిన్లపై సహకారం విషయంలో ఇది కొత్త అధ్యాయమవుతుందని తెలిపింది. స్పుత్నిక్‌ టీకాతో 90 శాతం రక్షణ లభిస్తుందని తుది విడత ప్రయోగాల్లో తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా విషయానికొస్తే.. ఒక డోసేజీతో 62 శాతం, మరో రకం డోసుతో 90 శాతం రక్షణ లభిస్తుందని వెల్లడైంది.

* రిటైల్‌ వ్యాపార సంస్థ క్లౌడ్‌టైల్‌ ఇండియా జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 8వ తేదీన అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ సంస్థ పన్ను రికార్డుల్లో పేర్కొంటున్న చిరునామాలో ఎటువంటి కార్యాలయం లేకపోవడాన్ని హరియాణాకు చెందిన ఎక్సైజ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ అధికారులు గుర్తించారు. సాధారణ తనఖీల్లో ఈ విషయం బయటపడింది.

* డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరో నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 24గంటలు ఆర్టీజీఎస్‌(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి 12.30నిమిషాల నుంచి ఆర్టీజీఎస్‌ సేవలు 24క్ష్7 అందుబాటులో ఉండనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఇది సాధ్యమయ్యేందుకు కృషిచేసిన ఆర్‌బీఐ బృందానికి, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు.

* 2021 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు మొదలవుతోంది. బడ్జెట్‌కు ముందు జరిగే సంప్రదింపులు ప్రారంభం కానునున్నాయి. దీనిలో భాగంగా డిసెంబర్‌ 14 నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీలో వివిధ వర్గాలను, గ్రూపులను కలుసుకోనున్నారు. ఈ భేటీలు అన్నీ వర్చువల్‌ రూపంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.