WorldWonders

పూణె గొఱ్ఱె ధర ₹1.5కోట్లు

పూణె గొఱ్ఱె ధర ₹1.5కోట్లు

గొర్రెలు లక్షల రూపాయల ధర పలకడం ఎప్పుడైనా విన్నారా. అయితే మీరు మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాకు వెళ్లాల్సిందే. ఒకటి, రెండూ కాదు ఏకంగా రూ.70లక్షలు వెచ్చించి మడ్గ్యాల్‌ జాతికి చెందిన గొర్రెను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ గొర్రె యజమాని ఆ ధరను నిరాకరించి.. రూ.1.50కోట్లకు అయితే అమ్ముతానని చెప్పడంతో కొనుగోలుదారుడు వెనుదిరిగాడు.

సంగ్లీ జిల్లా తెహ్‌సిల్‌కు చెందిన బాబు మెట్కారీ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా గొర్రెల వ్యాపారం చేస్తోంది. వారి వద్ద దాదాపు 200పైగా మడ్గ్యాల్‌ జాతి గొర్రెలు ఉన్నాయి. ఆ జాతి గొర్రెలకు మార్కెట్లో మంచి డిమాండు ఉంది. ఈక్రమంలో ఇటీవల ఓ కొనుగోలుదారుడు రూ.70లక్షలు వెచ్చించి అతడి వద్ద ఉన్న ఓ మడ్గ్యాల్‌ గొర్రెను కొనేందుకు ఆసక్తి చూపించాడు. గొర్రెల యజమాని బాబు స్పందిస్తూ.. ఆ ధరకు దాన్ని విక్రయించేందుకు నిరాకరించాడు. దాని అమ్మకం ధరను రూ.1.50 కోట్లుగా వెల్లడించాడు. ఈ సందర్భంగా బాబు మెట్కారీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మడ్గ్యాల్‌ గొర్రెలకు మంచి డిమాండు ఉంది. మేం గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాం. సర్జా(గొర్రె పేరు) వల్ల మా కుటుంబానికి ఎంతో కలిసివచ్చింది. ప్రస్తుతానికి నేను ఆ గొర్రెను అమ్మాలనుకోవడం లేదు. రూ.70లక్షలకు సర్జాను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి వచ్చారు. కానీ నేను తిరస్కరించి.. రూ.1.50కోట్లు ధరకు ఇస్తానని చెప్పాను. దాని కోసం అంత ధర వెచ్చించలేరని తెలిసే నేను ఆ ధర చెప్పాను’ అని తెలిపారు.

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా తెహ్‌సిల్‌ ప్రాంతం మడ్గ్యాల్‌ జాతి గొర్రెలకు ప్రసిద్ధి. ఆ జిల్లాలోని మడ్గ్యాల్‌ అనే గ్రామం పేరిట ఈ జాతి గొర్రెలకు ఆ పేరు వచ్చింది. ఇవి చూడటానికి దృఢంగా, బలిష్ఠంగా ఉంటాయి. మార్కెట్లో వీటి మాంసానికి భారీ డిమాండు ఉంటుంది. వీటి తల గుండ్రంగా ఉండి, రోమన్‌ ముక్కు కలిగి ఉంటాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఇవి 1.50లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ జాతి గొర్రెలను ఇతర ప్రాంతాల్లోనూ విస్తరింపజేసేందుకు ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.