Business

ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఉద్యోగుల బిడ్డింగ్-వాణిజ్యం

ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఉద్యోగుల బిడ్డింగ్-వాణిజ్యం

* ఎయిర్‌ ఇండియా బిడ్డింగ్‌ చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్‌ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ బిడ్‌కు ప్రస్తుత ఎయిర్‌ ఇండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షీ మల్లిక్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు.

* నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసింది. ఈవోఐకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించిన నేపథ్యంలో చివరి రోజున టాటా సన్స్‌ ఈవోఐను దాఖలు చేసింది. బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది.

* భారత్‌ను విద్యుత్తు వాహనాల తయారీ హబ్‌గా చేయాలనే లక్ష్యంతో తమిళనాడులో విద్యుత్త ద్విచక్ర వాహన తయారీ హబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఓలా ప్రకటించింది. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకొంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కేంద్రంగా నిలవనుందని పేర్కొంది. ఇది ఏటా 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. ఇక్కడ దాదాపు 10వేల మందికి ఉద్యోగాలు లభించవచ్చని పేర్కొంది. దీంతో త్వరలోనే విద్యుత్తు వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రణాళికను ఓలా వేగవంతం చేసినట్లు అయింది.

* ఫాస్ట్‌ ఫుడ్‌ వ్యాపారంలో మంచి పేరున్న బర్గర్‌ కింగ్‌ భారతీయ విభాగం ఐపీవో లిస్టింగ్‌ నేడు పూర్తయింది. కంపెనీ ఒక్కోషేరను రూ.60 వద్ద కేటాయించింది. ఈ ఐపీవోకు బంపర్‌ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. 156.65రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఈ షేరు లిస్టింగే రూ.115.35 వద్ద మొదలైంది. అంటే 92.25శాతం ప్రీమియంతో మార్కెట్లోకి అడుగుపెట్టిందన్నమాట. మధ్యాహ్నం 12గంటల సమయంలో షేరు ధర రూ.71.85 పెరిగి రూ.131.85 వద్ద ట్రేడవుతోంది. అంటే 120శాతం పెరిగినట్లైంది.

* జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది. ఏడో విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6 వేల కోట్ల రుణాలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో 23 రాష్ట్రాలకు 5,516.60 కోట్లు.. కేంద్ర పాలిత ప్రాంతాలైన దిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరికి రూ.483.40 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోకపోవడంతో వాటికి పరిహారం విడుదల చేయలేదని తెలిపింది. తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకు రూ.42వేల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం రుణాలుగా ఇచ్చింది.

* సమయం… సాయంత్రం ఐదు గంటలు. అప్పటివరకు మోగుతున్న యూట్యూబ్‌ స్క్రీన్‌ మీద కోతి బొమ్మ వచ్చి కూర్చుంది. మెయిల్‌ చేద్దామని చూస్తే Temporary error అంటూ ఓ మెసేజ్‌ వచ్చింది. అదేంటి మీకూ ఈ సమస్య వచ్చిందా అనకండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఇలాంటి సమస్య వచ్చింది. సుమారు గంటసేపు ఈ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గూగుల్‌కు చెందిన ప్రధానమైన సర్వీసులు జీమెయిల్‌, యూట్యూబ్‌, డాక్స్‌, ఫొటోస్‌, కాంటాక్ట్స్‌, హ్యాంగ్‌అవుట్స్‌ ఇలా గూగుల్‌ ప్రోడక్ట్స్‌ సేవలు నిలిచిపోయాయి. అయితే గంట తర్వాత కూడా కొన్ని దేశాల్లో ఈ సమస్య కొనసాగింది.

* అక్టోబరు నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) తొమ్మిది నెలల గరిష్ఠానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గణాంకాలు విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబరులో 1.48శాతంగా ఉన్న సూచీ.. నవంబరులో 1.55శాతానికి పెరిగింది. గత నెలలో ఆహార పదార్థాల ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ తయారీ రంగ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత టోకు ద్రవ్యోల్బణం ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఈ సూచీ 2.26శాతంగా నమోదైంది.