Kids

2021 JEE-MAINS షెడ్యూల్

2021 JEE-MAINS షెడ్యూల్

వచ్చే ఏడాది నిర్వహించబోయే జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈసారి నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ మంగళవారం ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. గతంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఫీజు చెల్లింపునకు జనవరి 16వరకు తుదిగడువు ఇచ్చిన ఎన్టీఏ.. దరఖాస్తుల్లో మార్పులు, మార్పులు చేర్పులకు జనవరి 18 నుంచి 21 వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫిబ్రవరి మొదటి వారంలో హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. తొలి పరీక్షను ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షను రోజుకు రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12; మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు) నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తలే వచ్చే ఏడాదిలో జరిగే పరీక్షల్లోనూ విద్యార్థులు పాటించాలని స్పష్టంచేసింది. తొలి విడత పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తామని తెలిపిన ఎన్టీఏ.. మార్చి, ఏప్రిల్‌, మే నెలలో మరో మూడు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షలను విద్యార్థులు ఒకేసారి రాయొచ్చు లేదా నాలుగు సార్లయినా రాసేందుకు వెసులుబాటు కల్పించింది. ఒకవేళ నాలుగు సార్లు రాసినా ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే చివరగా ఆ మార్కులనే పరిగణలోకి తీసుకోనున్నారు. మే తర్వాత లేదా జూన్‌ చివరి వారంలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ ఏడాది కరోనా దెబ్బతో సీబీఎస్‌ఈ గానీ, పలు రాష్ట్రాల బోర్డులు గానీ సిలబస్‌ తగ్గించినప్పటికీ ఎన్టీఏ మాత్రం జేఈఈ మెయిన్స్‌లో సిలబస్‌ తగ్గించలేదని తెలుస్తోంది.