Business

ఇండియాలో అమ్మకానికి నోకియా ల్యాప్‌టాప్‌లు-వాణిజ్యం

Business News - Nokia Laptops To Be Sold In India

* భారత విపణిలోకి నోకియా ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌ విడుదల చేసింది. నోకియా ప్యూర్‌బుక్‌ ఎక్స్‌14గా వ్యవహరించే వీటి ధర రూ.59,990. 1.1 కిలోల తేలికపాటి బరువు, 16.8 ఎంఎం మందం, 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ తెర, ఇంటెల్‌ ఐ5 టెన్త్‌ జనరేషన్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ లాంటి ప్రత్యేకతలతో నోకియా ప్యూర్‌బుక్‌ ఎక్స్‌14 లభ్యం కానుంది. వీటికి ముందస్తు ఆర్డర్లు 18 నుంచి ప్రారంభం కానున్నాయి.

* అసత్య ప్రచారాలు, హానికరమైన సమాచారం, సైబర్‌ దాడుల వంటివి సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా జరుగున్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా సంస్థలను నియంత్రణలో పెట్టేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నడుం బిగించింది. హింస, టెర్రరిజం, సూసైడ్‌, సైబర్‌ బెదిరింపులు, పిల్లలపై దాడి వంటి హానికరమైన కంటెంట్‌ నుంచి పౌరులను రక్షించడంలో భాగంగా ఆయా సంస్థలు, సీనియర్‌ స్థాయి మేనేజర్లనే బాధ్యులను చేసే అధికారం తమకు ఉందని యూకే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి సంబంధించిన కొత్త బిల్లును వచ్చే ఏడాది పార్లమెంటులో ప్రవేశపెడతామని వెల్లడించింది.

* దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, రిలయన్స్ లాంటి దిగ్గజ షేర్లు పతనమైన వేళ ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా దిగజారింది. అయితే ఆ తర్వాత జరిగిన కొనుగోళ్లతో ఆరంభ నష్టాలతో సూచీలు తేరుకున్నట్లే కన్పించినా.. ఒడుదొడుకులు తప్పలేదు. మార్కెట్‌ ఆద్యంతం లాభనష్టాల్లో ఊగిసలాడిన సూచీలు చివరకు స్తబ్దుగా ముగిశాయి. అయినప్పటికీ కొత్త రికార్డుల్లో నిలిచాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ అత్యల్పంగా 10 పాయింట్లు లాభపడి 46,263 వద్ద, నిప్టీ కూడా 10 పాయింట్ల లాభంతో 13,568 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐషర్‌ మోటార్స్‌, శ్రీ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ యునిలివర్‌, భారత్‌ పెట్రోలియం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, లోహ రంగం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

* రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పౌరుల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జూకర్‌బర్గ్‌తో జరిగిన ఆన్‌లైన్‌ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. దేశంలో దాదాపు 50శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలేనని.. ప్రతిఏటా వీరి ఆదాయం మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుందని అంబానీ అంచనా వేశారు.

* కొవిడ్‌ వ్యాక్సిన్‌ సానుకూలతలతో ఇటీవల దేశీయ స్టాక్‌ మార్కెట్‌ జోరుమీదుంది. వరుసగా కొత్త రికార్డులను తాకుతోంది. అయితే 2021 చివరినాటికి సెన్సెక్స్‌ 50,500 మార్క్‌ను తాకే అవకాశముందని ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ బ్యాంక్‌ బీఎన్‌పీ పరిబాస్‌ అంచనా వేస్తోంది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌లో మెరుగైన స్టాక్స్‌ ఉన్నందున సూచీలు పరుగులు పెట్టే అవకాశముందని పేర్కొంది.

* చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌.. స్మార్ట్‌టీవీల విభాగంలోకి అడుగుపెట్టింది. స్థానిక భాగస్వామి ద్వారా భారత్‌లో తయారుచేసిన 32 అంగుళాల, 43 అంగుళాల టీవీల విక్రయాలను ఈనెల 18న ప్రారంభించనుంది. 32 అంగుళాల టీవీ ధర రూ.11,999 కాగా.. 43 అంగుళాల టీవీల ఖరీదు.. రూ.19,999.

* వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. 15 రోజుల వ్యవధిలో సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డిసెంబరు 2వ తేదీన ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50 పెంచిన చమురు సంస్థలు.. మంగళవారం మరో రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.