Editorials

నేడు అంతర్జాతీయ తేనీరు దినోత్సవం

నేడు అంతర్జాతీయ తేనీరు దినోత్సవం

చాయ్ అని పిలిచే ఆ ‘గోధుమరంగు’ ద్రవం ఉత్తి ద్రవం కాదు. అది కనీస మర్యాద. తలనొప్పికి మందు. కాలక్షేపానికి సాకు. కలిసి కూర్చోవడానికి ఉపాయం. రోజును సాఫీగా సాగనిచ్చే లూబ్రికంట్. అందుకే- ప్రపంచం దానికోసం గ్లాసులెత్తి గౌరవం ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఈజిప్ట్, మయన్మార్ లాంటి దేశాల్లో టీ ‘జాతీయ డ్రింకు’ హోదా సంపాదించుకుంది. మన దేశంలో కూడా అలా ప్రకటిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటేక్‌సింగ్ అహ్లువాలియా ముందు వెల్లడించినా, కాఫీ (పరిశ్రమ) చిన్నబుచ్చుకుంటుందన్న కారణంగా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ, అప్రకటిత నేషనల్ డ్రింక్ అదే! ఎందుకంటే, దేశంలోని 83 శాతం ఇళ్లల్లో టీ తాగనిదే రోజు ఆరంభమే కాదు.
*చరిత్రలో చాయ్!
తూర్పు, దక్షిణాసియాలోనే తేయాకు చెట్లను తొలుత గుర్తించారు. కాబట్టి, ఇది ఆసియా భూభాగం ప్రపంచానికి సగర్వంగా సమర్పించిన మొక్క. అయితే, తేయాకులో ఉన్న మహత్తును మొట్టమొదటగా పసిగట్టింది చైనీయులు! క్రీస్తు పూర్వం పదో శతాబ్దంలోనే చైనాలో తేనీరు తాగినట్టుగా చెప్పే ఆధారాలు దొరికాయి. అయితే, ఇప్పుడు తాగుతున్నట్టుగా కాకుండా- వైద్యపానీయంగా సేవించేవాళ్లు. క్రమంగా అది వాళ్ల జీవితంలో భాగమై కూర్చుంది. చైనాలో ఒకరోజును ప్రారంభించడానికి కావాల్సిన ఏడు ముఖ్యావసరాల్లో (సెవన్ నెసెసిటీస్) చాయ్ కూడా ఒకటి. మిగిలిన ఆరు: పొయ్యిలకట్టెలు, బియ్యం, నూనె, ఉప్పు, సాస్, వెనిగర్. చైనాలో కూడా చాయ్ చాయే! ‘చాయ్’ అనే పిలుస్తారు గుండెసంబంధిత జబ్బుల్ని తగ్గిస్తుందనీ, కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుందనీ, నోటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందనీ, రక్తపోటును తగ్గిస్తుందనీ, ఊబకాయాన్ని నియంత్రిస్తుందనీ, ఇంకా రకరకాల ఆరోగ్య కారణాలు టీకి ఆపాదిస్తారు. ఇప్పుడు మద్యపు కంపెనీలు నియమించుకుంటున్నట్టుగా, పాతకాలంలో చైనాలో- టీని రుచి చూసి, బాగుందో లేదో తేల్చే నిపుణులు కూడా ఉండేవారు. చైనా నుంచి క్రమంగా టీ ఘుమఘుమలు కొరియా, జపాన్, వియత్నాంలాంటి దేశాలకు వ్యాపించాయి.
*ఇండియన్ టీ!
మన దగ్గర తేయాకు పండినా మనకు దాన్ని తాగడం అలవాటు చేసింది ఇంగ్లీష్‌వాళ్లే! ఇంగ్లీష్‌వాళ్లకు పోర్చుగీస్‌వాళ్లు పరిచయం చేశారు. పోర్చుగీస్‌వాళ్లు (మతగురువులు) 16వ శతాబ్దంలో చైనానుంచి నేర్చుకున్నారు.స్వాతంత్య్రం తర్వాతే మనదేశంలో టీ అధిక ప్రజాదరణ పొందింది. జనానికి టీ అలవాటు చేయడానికి కంపెనీలు ఎలా ప్రచారం చేశాయి? ఎలా కూడళ్లలో ఉండి రమ్మని పిలిచేవాళ్లు? ఎలా ఉచితంగా తాగించేవాళ్లు? గంజితప్ప తెలియని సామాన్యులు ఈ కొత్త ద్రవాన్ని తాగడానికి సందేహిస్తూ కళ్లు మూసుకుని ఎలా గుటుక్కున మింగేవాళ్లు? లాంటి వివరాలు దాశరథి రంగాచార్య రచనల్లోనూ, ‘హింసించే 23వ రాజు పులకేశి’ సినిమాలోనూ తెలుస్తాయి.ఇరానీ చాయ్ అంటుంటాం. నిజానికి భారత్ నుంచే సిల్క్‌రూట్ గుండా(ఒకప్పుడు ప్రాక్పశ్చిమాలను కలిపిన వ్యాపారమార్గం) ఇరాన్‌కు వెళ్లింది టీ. ఇరాన్‌లో తాగేదీ, హైదరాబాద్‌లో తాగేదీ (ఆ మాటకొస్తే మొత్తం దేశంలో) ఒకేలా ఉండదు. ఒక చక్కెరగుళికను నోట్లో వేసుకుని, దాన్ని చప్పురిస్తూ, డికాక్షన్‌ను తాగుతారు ఇరానీయులు. మనదగ్గర టీ అంటే చక్కెర, పాలు కలిపినదే! రెండు ప్రాంతాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే- సాసర్‌తో ఎంజాయ్ చేయడం!
*టీయిస్టులా తాగాలి!
టీ పెట్టడం అంటే పొయ్యిమీద నీళ్లను మరగకాచడం కాదు. టీ తాగడమంటే హడావుడిగా టీ కప్పులోకి వంపుకుని, గట్టిగా పెదవులాన్చి, గాలితో సహా కడుపులోకి గుంజుకోవడం కాదు. దానిమీద పూర్తి మనస్సుని మగ్నం చేయాలి; పొంగుతున్న ఆవిర్లు గీస్తున్న దృశ్యాల్ని చూడాలి; కదిలినప్పుడు కప్పు గోడలకు తాకి జారిపోయే రంగుల్ని గమనించాలి. ఒక్క నోరే కాదు, కళ్లు, ముక్కు, చెవులు, చేతుల్తో సహా టీని ఆస్వాదించాలి. చెవులు ఎందుకు పనిచేయాలంటే, శబ్దాల్ని ఫిల్టర్ చేసుకోవడానికి కావాలి. అనువైన సమయాన్ని వీలుచేసుకుని, సౌకర్యంగా కూర్చుని, మిగతా విషయాల్ని కప్పుకు బయటే చాయ్‌పత్తలాగా వడగట్టేసి, కేవలం తాగడం కోసం మాత్రమే తాగాలి. ఇంత వ్యవహారం ఉంది కాబట్టే, టీ తయారీ ఒక కళ స్థాయికి ఎదిగింది. ఒక జీవనవిధానంగా వర్ధిల్లింది; వర్ధిల్లుతోంది.
*తేనీటి మతం
జపాన్‌లో ‘టీ గార్డెన్’ అనేది దాదాపుగా దేవాలయం లాంటిది! ఒక మనిషి ధ్యానంకోసం వెళ్లేప్పుడు ఎలా వెళ్తాడో, అంత పద్ధతిగా వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ప్రహరీదాకా వెళ్లి, అక్కడ కూర్చుని నిరీక్షించాలి. కాసేపటికి ‘హోస్టు’ ఆహ్వానం ఇస్తూ లోపలికి తీసుకుపోతాడు. కొంతదూరం వెళ్లాక కుళాయి దగ్గర చేతులు కడుక్కోవాలి, నీళ్లు పుక్కిలించి ఉమ్మాలి. చేతులు, నోరు రెడీ అయిపోయాయి. ఇక కావాల్సింది మనసు. దారంతా పూసిన పూలను, పరుచుకున్న పచ్చదనాన్ని చూసుకుంటూ, తానొక ప్రత్యేకమైన కార్యం నిమిత్తం వెళ్తున్నట్టుగా వెళ్లాలి. కాంతిమంతమైన పూలతో మనసు దారి మళ్లకుండా లేతరంగుల పూలు మాత్రమే అక్కడ పెంచుతారు. ఇప్పుడు కళ్లతోపాటు మనసు కూడా ట్యూన్ అయిపోయినట్టే! ఇక టీహౌజ్‌లోకి వెళ్లి, ఆ అమృతాన్ని ఒక దేవదూతలాగా నిలువెల్లా తాగడమే! ‘చానోయు’గా పిలిచే ఈ విధానంలో టీ తాగడం దాదాపుగా ఒక పూజలాంటిది.మానవాళి మధ్య సమన్వయం, ప్రకృతితో సహజీవనం, క్రమశిక్షణాయుత మనసు, హృదయాన్ని నెమ్మదిపరచడం, శాశ్వత వెలుగును అందుకున్నప్పటి స్వచ్ఛతను సంతరించుకోవడం… ఇలాంటి అంశాలను తేనీటి సేవనానికి ముడిపెట్టడం వల్ల ఇదొక తాత్వికస్థాయికి చేరుకుంది. దీనికిదే ‘టీయిజం’ అయికూర్చుంది.
*తేనీటి మొక్క! ‘కామెల్లియా సినెన్సిస్’నే తేయాకు చెట్టు అంటున్నాం. ఎవరు ఏ రూపంలో చాయ్ తాగినా ఈ మహాతల్లి లేతాకుల చలవే! ఇందులో ప్రధానంగా మూడు జాతులున్నాయి. చైనా, అస్సాం, కాంబోడియా. చైనాది పొదజాతి. 2.75 మీటర్ల వరకు పెరుగుతుంది; వందేళ్లు బతుకుతుంది. అస్సాం, కాంబోడియా రకాలు ఏకకాండపు వెరైటీలు. వరుసగా 18, 16 మీటర్ల వరకు పెరుగుతాయి. రెండూ నలభై ఏళ్ల వరకు జీవిస్తాయి. మనదేశంలో డార్జిలింగ్, అస్సాం, నీలగిరి మూడు ప్రాంతాల్లో తేయాకు పండుతుంది. జాతుల్ని బట్టీ, నేలను బట్టీ ఆకుల రుచిలో మార్పు ఉంటుంది. మళ్లీ- అవే తేయాకు ఆకుల్ని ఆక్సిడేషన్ చేయడం కోసం అనుసరించే భిన్నమైన విధానాలవల్ల వివిధ ‘టీ’లు పుట్టాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఎల్లో టీ, ఊలాంగ్ టీ, పు ఎర్ టీ. ఇక ఆ పొడిగానీ, ఆకులుగానీ ఉపయోగించి, కాచుకునేప్పుడు మరికొన్నింటిని చేర్చడం వల్ల ఇంకొన్ని చాయ్‌లు తయారయ్యాయి. ఫ్లవర్ టీ, జాస్మిన్ టీ, బార్లీ టీ, బక్‌వీట్ టీ, హైడ్రాంజియా టీ, అల్లం టీ, మసాలా టీ!
*ఏ దేశంలో ఎలా?
చాలా దేశాల్లో ‘చాయ్‌ఖానా’లే స్నేహితులు కబుర్లు పంచుకోవడానికీ, ప్రేమికులు కాసింత వెచ్చటి ప్రేమను వంపుకోవడానికీ వేదికలు! అన్ని దేశాల్లో స్నేహం, ప్రేమ ఒకేలా ఉన్నా, టీ తాగేతీరు మాత్రం ఒకేలా ఉండదు. సాధారణంగా టీ అంటే తేయాకునీళ్లు మాత్రమే! అనగా- పాలు, చక్కెర కలిపిన గోధుమరంగు ద్రవం కాదు. మనభాషలో చెప్పాలంటే- చక్కెర లేని డికాక్షన్. ఇకముందు, టీ అని వచ్చిన చోటల్లా ఇదే అర్థం. టిబెట్‌లో ‘టీ’లో వెన్న, ఉప్పు వేస్తారు. దాన్ని ‘పో చా’ అంటారు. చా అంటే చా(య్) అనే! థాయ్‌వాళ్లు టీలో యానిస్ పొడి కలుపుతారు. కలిపాక- పాలపొడి, చక్కెర మీదుగా మరికొన్ని పాలు, ఐసుగడ్డలు వేసి పొడవైన గ్లాసులో చల్లగా ఇస్తారు. దాన్ని ‘చా యెన్’ అంటారు. స్విట్జర్లాండ్‌లో టీలో చక్కెర, నిమ్మరసం, పుదీనాతో పాటు అక్కడి స్థానిక మూలికలు కలుపుతారు.
సహేల్ రీజియన్‌గా పిలిచే ఆఫ్రికా దేశాల్లో (గాంబియా, సెనెగల్, నైజర్, నైజీరియా, చాద్, మాలి, కామెరూన్, సూడాన్) చాయ్‌లో నీళ్లు తక్కువ, పంచదార ఎక్కువ. పానకంలా ఉండాలి!
*జర్మనీలో సంప్రదాయంగా ‘పంచభూతాల టీ’ చేసే విధానం ఇలా ఉంటుందట. ముందుగా ఖాళీ కప్పులో కండచక్కెర వేస్తారు. తర్వాత టీ నీళ్లు పోస్తారు. అటుపై క్రీమ్ వేస్తారు. వెన్న ఆకాశం. టీ జలం. పంచదార భూమి. వేడిలో అగ్ని, కప్పుపై వాయువు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు! చంచాతో వాటిని కలిపి రుచి పాడు చేయరు. అంటే తాగేవాళ్ల నాలుక్కి ముందుగా దట్టమైన క్రీమ్ తగులుతుంది. అది అయిపోతూండగా, చిరుచేదు టీ రుచి తెలుస్తుంది. అటుపైన క్రమంగా తియ్యదనం పెరుగుతుంటుంది.
తలుచుకుంటేనే ఒక కప్పెడు వేడి వేడి టీ తాగాలనిపిస్తోందా!
*రండి, టీ తాగండి!
జపాన్‌లో రెస్టారెంట్లకు వెళ్తే భోజనంతోపాటు ఉచితంగా గ్రీన్ టీ సర్వ్ చేస్తారు. అలాగే టీని నేషనల్ డ్రింకుగా ప్రకటించుకున్న మయన్మార్‌లో కూడా కస్టమర్ హోటల్‌కు వెళ్లి టేబుల్ ముందు కూర్చోగానే, ఆర్డర్‌తో నిమిత్తం లేకుండా ముందు ఉచిత గ్రీన్ టీ తెచ్చిపెడతారు. అది వారి సంప్రదాయం. ఈజిప్ట్ నేషనల్ డ్రింకు కూడా చాయ్‌నే! అక్కడ అది ‘షాయి’. దీన్నే సోమాలియాలో ‘షా’ అంటారు. మొరాకో టీ కప్పులంత ముద్దుగా మరో దేశంలో ఉండవేమో! వాళ్లు రంగురంగుల గ్లాసులు వాడుతారు. అక్కడ టీ తాగడం నేత్రానందం కూడా! పైగా గ్లాసులో పుదీనా కొమ్మ వేసి సర్వ్ చేస్తారు. ఐర్లాండ్ దేశస్థులకు రోజుకు సగటున నాలుగు కప్పులు తప్పనిసరి. చాలామంది ఆరు కప్పులు కూడా సేవిస్తారు. ఇక టర్కీలోనైతే రోజుకు పది కప్పులు కూడా లాగించేవాళ్లుంటారు.అత్యధికంగా తేయాకు ఉత్పత్తి చేసే తొలి పది దేశాలు: చైనా, భారత్, కెన్యా, శ్రీలంక, టర్కీ, వియత్నాం, ఇరాన్, ఇండోనేషియా, అర్జెంటీనా, జపాన్. 2011 లెక్కల ప్రకారం మొత్తం ప్రపంచ ఉత్పత్తి: 43,21,011 టన్నులు. ఇందులో 16,40,310 టన్నులతో చైనా తొలిస్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న భారత్ ఉత్పత్తి: 10, 63, 500 టన్నులు.
*‘టీ’ తిరుగుబాటు
భారతదేశంలో తొలి టీ ప్లాంటర్ మణిరామ్ దీవాన్(1806-58). ఈయన అస్సాంలో టీ గార్డెన్స్ ప్రారంభించారు. తొలుత బ్రిటిష్‌వారికి సన్నిహితంగా మసిలినప్పటికీ, 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సమరంలో వారికి వ్యతిరేకంగా పాల్గొన్నారు. దానికారణంగా పట్టుబడి ఉరిశిక్ష అనుభవించారు