Kids

భగవద్గీత గూర్చి ఈ విషయాలు తెలుసా?

భగవద్గీత గూర్చి ఈ విషయాలు తెలుసా?

1. భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
28. భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” – శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= “అ”-కారము.
100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
105. తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.