DailyDose

ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా-తాజావార్తలు

Breaking News - France President Emmanuel Catches COVID

* ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా నిర్థారణ అయింది. దీంతో మాక్రాన్‌ వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఈ మేరకు ఎలీసీ ప్యాలెస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

* అమరావతి అంశంపై రెఫరెండానికి వెళదామని, ముఖ్యమంత్రి గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దీనిపై 45రోజుల్లో తేల్చుకుందామని ముఖ్యమంత్రి సిద్ధమా అని సవాలు చేశారు. అమరావతి రాజధాని ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న జనభేరి సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 48,652 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,79,644కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,505కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 517 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,70,967కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,063 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 63,06,397కి చేరింది.

* రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఆధార్‌ వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ కాలమ్‌ తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, పీటీఐఎన్‌ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రకియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని.. ఆధార్‌ వివరాలు మాత్రం సేకరించవద్దని స్పష్టం చేసింది. ఎలాంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు కులం, ఆధార్‌ వివరాలు అడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు కె.సాకేత్‌, ఐ.గోపాల్‌శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ప్రతులను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చించివేశారు. దేశ రైతులకు తాను ద్రోహం చేయదలచుకోలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు కోసం తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ ప్రతులను చించివేశారు. ఆయనతో పాటు పలువురు ఆప్‌ ఎమ్మెల్యేలు సైతం ప్రతులను చించివేసి తమ నిరసన తెలియజేశారు.

* కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించగానే యావత్‌ ప్రపంచం ఆ దేశాన్ని ప్రశంసించింది. కానీ వ్యాక్సిన్‌ను తీసుకోవడంలో ప్రజల నుంచి అరకొర స్పందనే వస్తున్నట్లు తాజా నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. వ్యాక్సిన్‌ ఉచితంగానే ఇస్తున్నప్పటికీ పంపిణీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

* సామాజిక న్యాయానికి బీసీలు ప్రతినిధులని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ల ఛైర్మన్లపై ఉందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన ‘బీసీ సంక్రాంతి’ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఇటు ప్రభుత్వం.. అటు బీసీ సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ ఛైర్మన్లంతా అనుసంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో దాదాపు 728 మంది బీసీలకు వివిధ స్థానాలు కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు వేశామన్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపికలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ప్రమాణ స్వీకారం చేసిన 56 మంది ఛైర్మన్లలో 29 మంది మహిళలు ఉండడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు జగన్‌ తెలిపారు. ఈ బాధ్యతలను ఎంతో పవిత్రంగా భావించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

* నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని, అయితే అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. తొలుత రైతులను ఖాళీ చేయించాలన్న అంశంపైనే విచారిస్తామని, చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

* కరోనా వైరస్‌ను ఒక్కసారిగా తుడిచిపెట్టేందుకు వ్యాక్సినేమీ మంత్రదండం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతీయ కార్యాలయం గురువారం తెలిపింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు పేర్కొన్నారు. ‘‘మనం ఎవరైనా, ఎక్కడ జీవిస్తున్నా ప్రపంచంలో కరోనా వైరస్‌ ఉన్నంతకాలం మనందరం ప్రమాదంలో ఉన్నట్లే. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకొని, మన చుట్టుపక్కల ఉన్నవారిని సురక్షితంగా ఉంచాలి. కరోనా వైరస్‌ గురించి భయాందోళనలు లేకుండా అప్రమత్తంగా ఉండాలి. వైద్యనిపుణుల సలహాలు, సూచనలు అనుసరించడం ద్వారానే మనం 2021ను సంతోషంగా ఆహ్వానించగలం’’ అని డబ్ల్యూహెచ్‌వో రీజినల్‌ డైరక్టర్‌ తకేషి కసాయ్‌ ఒక వర్చువల్‌ సమావేశంలో తెలిపారు. సంవత్సర కాలంగా విరామం లేకుండా శ్రమిస్తున్న ఆరోగ్య కార్యకర్తల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ను కనుగొనడం సవాలే కానీ దాన్ని ప్రపంచమంతటికీ సరిపోయేలా తయారు చేయడం పెద్ద సవాలని ఆయన పేర్కొన్నారు. మాస్కులు ధరించడం, సామాజికదూరాన్ని పాటించడం, వైరస్‌ సంక్రమిత ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ నుంచి క్షేమంగా ఉండగలుగుతామని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో రీజినల్‌ ఎమర్జెన్సీ డైరక్టర్‌ ఎకోడ్‌ కసాయ్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌-19 ను ఒక్కసారిగా మాయంచేసేందుకు వ్యాక్సిన్‌ మంత్రదండం కాదన్నారు. ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రజారోగ్య రక్షణ విషయాల్లో యువత భాగస్వామ్యం ఈ సమయంలో చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మూలాలు చైనాలోని వుహాన్‌లో ఉన్నాయని యావత్‌ ప్రపంచం భావిస్తోన్న విషయం తెలిసిందే. వీటిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వచ్చే నెల చైనా‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వుహాన్‌ స్పందించింది. ఈ దర్యాప్తునకు మేం భయపడుటలేదంటోన్న వుహాన్ వాసులు‌..దర్యాప్తు ద్వారా వైరస్‌ ఇక్కడ ఉద్భవించలేదనే విషయం నిరూపితమవుతుందని ఆశిస్తున్నారు. ‘డబ్ల్యూహెచ్‌ఓ బృందం రావడాన్ని స్వాగతిస్తున్నాం. వైరస్‌ ఎలా అభివృద్ధి చెందిందో మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ వైరస్‌ ఇక్కడే బయటపడిందని తెలిస్తే..అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే వీలుంటుంది’ అని వుహాన్‌కు చెందిన ఓ పౌరుడు వార్తా ఏజెన్సీతో పేర్కొన్నాడు. అయితే, ఆ మార్కెట్‌ నుంచే వచ్చిందని మాత్రం నమ్మడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ దర్యాప్తునకు మేము భయపడటం లేదని..ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు సవ్యంగానే ఉన్నట్లు మరో స్థానిక వ్యాపారి పేర్కొన్నాడు. జనవరి నెలలో అంతర్జాతీయ బృందం చైనాలో కొవిడ్‌ మూలాలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వుహాన్‌ వాసులు ఇలా స్పందిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సంచాలకులు లేఖ రాశారు. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, డిజైనింగ్‌, కాస్ట్‌ ఎస్టిమేట్‌ తదితర ప్రాథమిక అంశాలను డీపీఆర్‌లో వెల్లడించలేదని లేఖలో పేర్కొంది. డీపీఆర్‌ సమర్పించే విధానంలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించలేదంది. ఎలాంటి ప్రాథమిక అంశాలు లేని డీపీఆర్‌ను పరశీలించడం సాధ్యం కాదని.. నిర్ణీత మార్గదర్శకాల మేరకు పూర్తి అంశాలను పొందుపర్చి డీపీఆర్‌ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచించింది.

* దళారులకు కొమ్ముకాసే కొన్ని రాజకీయశక్తులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తు్న్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో మేలు జరుగుతుంటే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపడితే కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు దుష్ర్పచారం చేశాయన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల వల్లే ప్రపంచంలో 5వ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలిచిందన్నారు.

* పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగేలా సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డపేరు తెచ్చుకోవద్దన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌పైనా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళనకు దిగితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం ఖాయమన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిందని ఆయన విమర్శించారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయడం లేదో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.