Business

జనవరి 1వ తేదీ ఉండి ఇండియాలో నూతన ఆర్థిక నిబంధనలు

New Financial  Policies In India From Jan 2021

చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్‌పీజీ సిలిండర్ ధరలు, జీఎస్‌టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. 2021 జనవరి 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలు సామాన్యుని జీవితాన్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ మార్పుల గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి.
*చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి ‘పాజిటివ్ పే సిస్టం’ పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్‌ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఇది వినియోగదారుడి అభీష్టానుసారం ఉంటుంది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది.
కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ వాటి చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లావాదేవీల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
*వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది.
పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చుల నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కారు కంపెనీలైన మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా కంపెనీలు తమ వాహనాల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు తెలిపాయి.
దేశంలో ల్యాండ్‌లైన్‌ల నుండి మొబైల్ ఫోన్‌లకు కాల్ చేయడానికి త్వరలో ‘0’ నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్‌ను టెలికాం విభాగం కోరింది.
*జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017లోపు అమ్మిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం 1989 సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు సవరించారు. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవ (యుపీఐ చెల్లింపు) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్‌పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్‌పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటీమ్ అవసరం.
*గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ని 2021 జనవరి1 నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గూగుల్ పే ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల చెల్లింపులు చేసినప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఈ విషయంపై గూగుల్ స్పందించలేదు.
*చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్‌పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది.
*5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్‌టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్‌టీఆర్ 3జీ, 4 జీఎస్‌టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో 94 లక్షల జీఎస్‌టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది చిన్న వ్యాపారులకి ఊరట కలగడం విశేషం.