Politics

కేసీఆర్ ఫాంహౌజ్ వెతకండి. అప్పుడు జైలు ఖాయం.

Bandi Sanjay Asks Telangana DGP To Search KCR FarmHouse

తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం జోరందుకుంది. దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో పాటు జీహెచ్‌ఎంసీ ఇచ్చిన ఫలితాల జోష్‌తో బీజేపీ వలసలపై దృష్టి పెట్టింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలనే టార్గెట్‌గా బీజేపీ రాజకీయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌లోని‌ కీలక నేతను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ పొర్లుదండాలు పెట్టినా సీఎం కేసీఆర్‌ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో తనిఖీలు చేస్తే నిధులు బయటపడతాయన్నారు. నిధుల్ని కాపాడుకోవడానికే కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటున్నారని, ఫామ్‌హౌస్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి సోదాలు చేయాలని కోరారు. నిధులు దొరికితే ప్రజలకు పంచుతామన్నారు. నిరుద్యోగులకు రూ.72 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఆదిలాబాద్‌లో ఎంఐఎం నేత కాల్పులు జరిగాయని, తాము తల్చుకుంటే టీఆర్‌ఎస్‌ను అడ్డుకోగలమని బండి సంజయ్‌ అన్నారు.