Business

హోండా సంచలన నిర్ణయం-వాణిజ్యం

Business News - Honda Takes Decision To Stop Production At Noida Plant

* ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) యూపీలోని గ్రేటర్‌ నొయిడాలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్‌లోని తపుకరాలో మాత్రమే జరగనుంది. నొయిడాలో కంపెనీ కార్పొరేట్‌ హెడ్‌ ఆఫీస్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ డివిజన్‌, రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం, ఇతర కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయి.

* ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక వసతులను పట్టించుకోకుండా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మనం ప్రయత్నిస్తున్నామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌, ఈవీపీ అభీక్‌ బారువా అన్నారు. కొవిడ్‌ మహమ్మారి మనకు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సిన అవసరాన్ని తెలియజేసిందన్నారు. శుక్రవారం ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ (ఎఫ్‌టీసీసీఐ) నిర్వహించిన ఓం ప్రకాశ్‌ టిబ్రెవాలా స్మారక ఉపన్యాసంలో ఆయన పాల్గొన్నారు. సులభతర వ్యాపార నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉంటేనే ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, కార్మిక, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాలు చొరవ తీసుకుని, సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. వియత్నాం తరహాలో రాష్ట్రాలు పెట్టుబడులు సంపాదించాలన్నారు. జీఎస్‌టీ శ్లాబులను హేతుబద్ధీకరించాలని, పన్ను మదింపును సులభతరం చేయాలని తెలిపారు. ఈ సదస్సులో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ ఇనాని, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.భాస్కర్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ లహారుకా తదితరులు పాల్గొన్నారు.

* విప్రో మాజీ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆయన భార్య, ఇతరులపై నమోదైన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజ్య కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ స్టే విధించడంతో పాటు ప్రతివాదులైన ఎన్‌జీఓ ఇండియన్‌ అవేక్‌ ఫర్‌ ట్రాన్స్‌పరెన్సీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ప్రేమ్‌జీ గ్రూప్‌ సంస్థ మూడు సంస్థలను (రూ.45,000 కోట్ల విలువ) విలీనం చేసుకునే ప్రక్రియలో విశ్వాస ఉల్లంఘన, అవినీతికి పాల్పడిందని సదరు ఎన్‌జీఓ చేసిన ఆరోపణలపై బెంగళూరు ట్రయల్‌ కోర్టు ప్రేమ్‌జీ తదితరులకు ఈ ఏడాది జనవరి 27న సమన్లు జారీ చేసింది. వీటిని కొట్టివేయాలంటూ ప్రేమ్‌జీ, ఇతరులు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దాన్ని కొట్టివేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రేమ్‌జీతో పాటు పి.శ్రీనివాసన్‌, ఎమ్‌ఆర్‌ భట్‌, జి.వెంకటేశ్వరరావు తదితరులు ఈ కేసులో ఉన్నారు. సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఏఎమ్‌ సింఘ్విలు ప్రేమ్‌జీ, ఇతరుల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఎన్‌జీఓ చేసిన ఫిర్యాదు ‘తుంటరి’ చర్యగా అభివర్ణించారు.

* కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించేందుకు, వృద్ధిని గాడిలో పెట్టేందుకు అనువైన బడ్జెట్‌ రూపొందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి తయారు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య) పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌-2020 కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ‘కొవిడ్‌ వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యం, వైద్య పరిశోధన-అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) పెట్టుబడులు పెట్టడానికి, టెలిమెడిసిన్‌ను నిర్వహించడానికి ఎక్కువ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో కీలకం. సరికొత్త జీవన విధానంలో వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై అనేక సవాళ్లను కూడా ఎదుర్కోవల్సి రావచ్చు. అందుకే పరిశ్రమల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాను. ఒక మహమ్మారి విజృంభించిన తరవాత ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌ను రూపొందిద్దామ’ని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు.

* భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్‌ కీలకపాత్ర వహించిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. శనివారం జరిగిన అసోచామ్‌ ఫౌండేషన్‌ వీక్‌ 2020 కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని ప్రసంగించారు. గత వందేళ్లలో ఇండస్ట్రీ ఛాంబర్‌ భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంతో సహా భారత అభివృద్ధికి సాక్షిగా నిలిచిందన్నారు. దేశపురోగతిలో భాగంగా వాణిజ్య సహకారాన్ని అందించినందుకుగాను ‘అసోచామ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆఫ్‌ ద సెంచరీ’ అవార్డును టాటా ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ రతన్‌టాటాకు అందించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధిలో టాటా గ్రూప్‌ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. అనంతరం రతన్‌టాటా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన కష్టసమయంలో దేశాన్ని ముందుండి నడిపించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎదురైన వ్యతిరేకత, ఆటుపోట్లను తట్టుకొని దేశాన్ని ఏకతాటిపై నడిపించారన్నారు. ప్రధాని చెప్పిన సూచనలు, జాగ్రత్తలు పాటించి ఉంటే ఇప్పటికి భారత్‌ కరోనా రహిత దేశంగా ఉండి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిఉండేదని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్‌ తాజాగా ఎయిరిండియా కొనేందుకు బిడ్లను వేసిన విషయం తెలిసిందే.

* కొద్ది నెలలుగా బలమైన వృద్ధి సాధిస్తూ వస్తున్న ఆర్థిక సాంకేతిక దిగ్గజం రాజోర్‌పే భారీమొత్తం లావాదేవీలపై దృష్టి సారించింది. 2021 చివరి కల్లా మొత్తం చెల్లింపుల పరిమాణాన్ని(టీపీవీ) 5000 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3.67 లక్షల కోట్లు)కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శుక్రవారం తెలిపింది. ఇంగ్లిషు రాని వినియోగదార్లు కూడా లావాదేవీలు పూర్తి చేసేలా ఇతర భాషల్లోనూ చెక్‌ అవుట్‌ పేజీ తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌ విక్రేతల సంఖ్య భారీగా పెరిగిందని.. సంప్రదాయ విక్రయశాలలు సైతం డిజిటల్‌ చెల్లింపులతో లావాదేవీలు జరుపుతున్నారని రాజోర్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు హర్షిల్‌ మాథుర్‌ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 70 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదార్లుండగా.. 30 కోట్ల మంది స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే చెల్లింపులను ‘స్థానికీకరిస్తున్నట్లు’ వివరించారు.