Politics

తెలంగాణాలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు-తాజావార్తలు

Telugu News Roundup Of The Day - No More Dharani In Telangana

* అధిక నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న దేశాల్లో బ్రిటన్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, అమెరికా, దక్షిణాఫ్రికా నిలిచినట్లు కాంట్రాక్టర్‌ హైరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెక్‌ఫైండర్‌ సర్వే పేర్కొంది. ‘గ్లోబల్‌ డిమాండ్‌ ఫర్‌ ఇండియన్‌ ఐటీ కాంట్రాక్టర్స్‌’ పేరిట సంస్థ సర్వే వెలువరించింది. క్లౌడ్‌, సైబర్‌, డిజిటలీకరణతో కూడిన కీలకమైన డొమైన్ల కోసం ఆయా దేశాల కంపెనీలు భారత ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నట్లు టెక్‌ఫైండర్‌ తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్య దేశవ్యాప్తంగా 52000 మంది నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

* తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భాగంగా నూతనంగా చేపట్టిన స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరపనున్నట్లు వెల్లడించింది. అయితే కార్డ్‌ (సీఏఆర్‌డీ) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

* ‘‘దీదీ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో మీరు ఒంటరి అవక తప్పదు’ అని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్ర పర్యటనకు వెళ్లిన షా.. నేడు మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ నుంచి భాజపాలో చేరిన కీలక నేత సువేందు అధికారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. దీదీపై నిప్పులు చెరిగారు.

* వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో ఉన్న మొత్తం నల్లా కనెక్షన్లు, నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు, కార్యక్రమ విధివిధానాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, జలమండలి అధికారులతో ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమీక్షించారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను రానున్న రెండు వారాల్లో పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.

* వారందరి లక్ష్యం ఒక్కటే…కొత్త సాగు చట్టాల రద్దు! అందుకోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు!! దిల్లీ సరిహద్దులకు తరంగంలా తరలివస్తూనే ఉన్నారు. ఎక్కుపెట్టిన జల ఫిరంగులు…అడ్డుపెట్టిన కాంక్రీట్‌ దిమ్మెలు వారి సంకల్పాన్ని నిలువరించలేకపోయాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలతో సహా రహదారులనే ఆవాసాలుగా మార్చుకున్నారు. దేశం ఇదివరకెన్నడూ చూడని కొత్త తరహా ఉద్యమం దిల్లీ సరిహద్దుల్లో ఇప్పుడు కనిపిస్తోంది. 23 రోజులు గడిచిపోయినా…వారిలో ఉద్యమ స్ఫూర్తి ఇనుమడిస్తూనే ఉంది కానీ వీసమంత కూడా తగ్గలేదు.

* సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 13 వరకు 3,607 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఈడీ ఓ ప్రకటన విడుదల చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం ప్రత్యేక బస్సు సర్వీసుల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులు నడపనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల మధ్య 1,038 ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ వివరించారు. అయితే ఈ ప్రత్యేక సర్వీసుల్లో ఛార్జీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* అందరూ కోరుకుంటే తాను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధమేనని రాహుల్ గాంధీ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన కోరుతూ అసమ్మతి గళం వినిపించిన నేతలతో శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అలాగే కొత్త సంవత్సరంలోగా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

* అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండున్నర రోజుల్లోనే పూర్తయింది. టీమ్‌ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆసీస్‌ సునాయాస విజయం సాధించింది. రెండు వికెట్లు నష్టపోయి 53 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటును భర్తీ చేస్తూ 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

* వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

* భవిష్యత్తులో వైకాపా, తెదేపాతో భాజపా పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం రాయలసీమలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

* నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బుక్‌లెట్‌ను చదవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్‌లెట్‌లో వ్యవసాయ చట్టాల గురించి విస్త్రృత సమాచారం ఉందని, ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో గ్రాఫిక్స్‌ రూపంలోనూ తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. నమో యాప్‌లో కూడా బుక్‌లెట్‌ లభ్యమవుతుందన్నారు. అందరూ దీన్ని చదివి షేర్‌ చేయాలని ట్విటర్‌ వేదికగా ప్రజలను కోరారు.

* ఊహాగానాలకు తెరదించుతూ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక నేత సుబేందు అధికారి నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు. మిడ్నాపూర్‌లో జరిగిన భాజపా బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సుబేందుకు షా సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబేందు మాట్లాడుతూ.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. ఆత్మగౌరవానికి రాజీపడే చోట తాను ఉండలేనని, అందుకే టీఎంసీని వీడానని చెప్పారు.

* వారందరి లక్ష్యం ఒక్కటే…కొత్త సాగు చట్టాల రద్దు! అందుకోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు!! దిల్లీ సరిహద్దులకు తరంగంలా తరలివస్తూనే ఉన్నారు. ఎక్కుపెట్టిన జల ఫిరంగులు…అడ్డుపెట్టిన కాంక్రీట్‌ దిమ్మెలు వారి సంకల్పాన్ని నిలువరించలేకపోయాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలతో సహా రహదారులనే ఆవాసాలుగా మార్చుకున్నారు. దేశం ఇదివరకెన్నడూ చూడని కొత్త తరహా ఉద్యమం దిల్లీ సరిహద్దుల్లో ఇప్పుడు కనిపిస్తోంది.

* తూర్పు లద్దాఖ్‌లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై చర్చించాయి. భారత్, చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ కమిటీ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది.