Sports

పుండు మీద కారం పోస్తున్న పాంటింగ్

Ricky Ponting Says Indian Team Is Weak And That's Why 36/9

తొలి టెస్టులో టీమ్‌ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. శనివారం అడిలైడ్‌లో తొలి టెస్టు పూర్తయ్యాక అతడు ఓ క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 36/9 అత్యల్ప స్కోరుకే చేతులెత్తేయడంతో అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలోనే పాంటింగ్‌ పై విధంగా స్పందించాడు. మరోవైపు టీమ్‌ఇండియాలో అసలైన లోటుపాట్లు తెలిశాయని, దాంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే మంచి అవకాశం ఆస్ట్రేలియాకు దక్కిందని పాంటింగ్‌ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్‌లోనూ తమ జట్టు విజయం సాధిస్తే భారత్‌ తిరిగి కోలుకోవడం చాలా కష్టమన్నాడు. ఇక రెండో టెస్టు నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు మరింత ఇబ్బందికరమని చెప్పాడు. అప్పుడు టీమ్‌ఇండియాకు అసలైన సవాలు ఎదురుకానుందన్నాడు. అలాగే ‘బాక్సింగ్‌డే’ టెస్టుకు ముందు భారత జట్టులో పలు మార్పులు చేసుకోవాలని సూచించాడు. తుది జట్టులో కోహ్లీ లేనందున మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ను తీసుకోవాలన్నాడు.