Business

పెరిగిన బంగారం. మునిగిన మార్కెట్లు-వాణిజ్యం

Business News - Gold Prices Rise. Stock Markets Fall.

* వరుస లాభాల్లో జోరుమీదున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు లోనయ్యాయి. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కొత్త రకం వెలుగుచూడడం, జీవనకాల గరిష్ఠాల నేపథ్యంలో సూచీలు కరెక్షన్‌ బాట పట్టడంతో మరోసారి బ్లాక్‌ మండే నమోదైంది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లు సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 1400 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 13,350 దిగువకు చేరింది. ఆరు రోజుల వరుస లాభాలకు సోమవారం బ్రేక్‌ పడింది. సుమారు రూ.6.59 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల విలువ రూ.6,59,313 కోట్లు క్షీణించి రూ.1.78 లక్షల కోట్లకు చేరింది.

* బంగారం ధర మళ్లీ పెరిగింది. మరోసారి రూ.50వేల మార్కు దాటింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర గ్రాముకు రూ.496 మేర పెరిగి రూ.50,297లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడం, రూపాయి విలువ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు వెండి సైతం కేజీకి రూ.2,249 మేర పెరిగింది. దీంతో దిల్లీలో కేజీ వెండి ధర రూ.69,477కి చేరింది.

* దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 140 పాయింట్లు నష్టపోయి 46,820 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 13,709 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.41 వద్ద కొనసాగుతోంది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగు చూసిన నేపథ్యంలో ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కొంత నిరాశలో పయనిస్తున్నాయి. అలాగే, బ్రిటన్‌ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి.

* మన దేశంలో పండగొచ్చినా, శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ధర మాట ఎలా ఉన్నా బంగారం కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతుంటారు. అయితే, పసిడి అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల దేశ వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతోంది. కరోనా పుణ్యమాని ఈ ఏడాది బంగారం దిగుమతుల భారీగా తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య 40 శాతం మేర దిగుమతులు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయానికి మొత్తం బంగారం దిగుమతుల విలువ 20.6 బిలియయన్‌ డాలర్లు కాగా.. ఈ ఏడాది అది 12.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. ఒక్క నవంబర్‌ విషయానికొస్తే ఈ నెలలో 3 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 2.65 శాతం అధికం.

* కారు ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. గతేడాది జులైలో డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా డ్రైవర్‌ పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంగ్ల వార్తా పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది.

* దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున విమానయాన సంస్థలపై విధించిన ఆంక్షలను మరింత సడలించాలని కేంద్రం నిర్ణయించింది. నాలుగు గంటల వ్యవధిలోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాల్లో ఐసోలేషన్‌ జోన్‌ని ఏర్పాటుచేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అంతర్జాతీయ విమానాలకు సడలింపులివ్వాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ విజ్ఞప్తి చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 16న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్‌ కోసం కొన్ని సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలన్న నిబంధనను సవరించింది. నాలుగు గంటలకు మించిన ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో చివరి వరుసలోని కుడివైపునున్న సీట్లను క్వారంటైన్‌ కోసం రిజర్వు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. గగనతలంలో ప్రయాణికులకు కొవిడ్‌ సంబంధిత లక్షణాలు వృద్ధి చెందితే.. వారికోసం అవసరమైన పీపీఈ కిట్లను విమానయాన సంస్థలు సమకూర్చాలని పేర్కొంది.

* జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి రుణాలు విడుదల చేసింది. 8వ విడతగా మరో రూ.6వేల కోట్లను సోమవారం విడుదల చేసింది. 23 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.48 వేల కోట్లకు చేరింది. ఇందులో తెలంగాణకు రూ.688.59 కోట్లు, ఏపీకి రూ. 1181.61 కోట్లు రుణాల కింద కేంద్రం విడుదల చేసింది.