Food

వేడినీరు మహా ఔషధం

Hot Water Is Best Medicine - Telugu Diet News

మనిషికి నీరే ప్రాణాధారం. రోజు మొత్తంలో చెమట ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేయడం అవసరం. శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. నీటికీ అంతే విలువ ఉంది. మానవ శరీరంలో ద్రవ పదార్థాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్‌ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. నీటిలో క్లోరిన్‌, అయోడిన్‌, ఆక్సీజన్‌ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. మానవ శరీరం సుమారు 60-70 శాతం నీటితో తయారయ్యుంటుంది. అదే విధంగా చిన్న పిల్లలో 75-78 శాతం నీటిని కలిగి ఉంటుంది. మానవ శరీరంలో కొవ్వు కణజాలం, లీన్‌ కణజాలం కన్నా తక్కువ శాతం నీరు ఉండటం వలన శరీరంలోని నీటి పరిమాణం వయస్సుతో మారుతుంది. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 లీటర్ల నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకురతాయి. చల్లటి నీరు కాకుండా గోరువెచ్చని నీరు తాగడం వలన ఎక్కువ ప్రయోజనాలు చేకురుతాయి. దీని వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు తెల్లవారు జామున, పడుకునే ముందు వేడి నీరు తాగితే వ్యాధులు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు.
**బద్దకానికి భలే మెడిసిన్‌..
మనం తాగేనీటిని వేడి చేసుకొని, వడబోసి తాగితే.. వందమేళ్లు ఉన్నాయని అంటున్నారు వైద్యు నిపుణులు. తెల్లవారు జామున, రాత్రి నిద్రించే ముందు సరిపడా వేడినీరు తాగితే అదే దివ్యౌషధమని భరోసా ఇస్తున్నారు. ఈ గోరువెచ్చటి నీరు తెల్లవారు జామున తాగితే అనేక వ్యాధులను ఇట్టే నిర్మూలించవచ్చని, బద్ధానికి ‘బై బై’ చెప్పొచ్చని అంటున్నారు. పూర్వీకులు కాచి వడబోసిన నీటినే తాగుతూ వేకువ జామున లేచి వ్యాయామంతో కూడిన నడకతో వ్యవసాయ పనులు చేసేవారు. పొద్దుగూకంగనే ఇళ్లకు చేరి, కాసిన్ని వేడినీళ్లతో స్నానం చేసి, రాత్రి పడుకునే ముందుకు సరిపడా వేడినీళ్లు తాగేవారు. ఇదే వారి ఆరోగ్యానికి అసలైన చిట్కా. మారిన జీవిన విధానంలో వేడినీటిని దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
***వేడినీటి వల్ల లాభాలు
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరం లోపల ఉన్న మలినాలు, విషపదార్థాలను బయటకు తొలగించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మరింత ఫలితాల కోసం తేనే, నిమ్మరసం కలుపుకోవచ్చు. వేగంగా బరువు తగ్గాలి అనుకునేవారికి సరైన మార్గం గోరువెచ్చని నీరు తాగడమే. ఇది జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వుకణాలను విచ్ఛినం చేస్తుంది. దీని వలన అధిక బరువు తగ్గుతుంది. మొటిమలు, ఇతర చర్మ రుగ్మతల నుంచి మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. అంటురోగాల మూల కారణాలను తొలగిస్తుంది. సరైన మోతాదులో వేడినీరు తాగడం వలన జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగి మలబద్దకాన్ని, పైల్స్‌ను నివారిస్తుంది. మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ పనులు చేసేవారు వ్యాయామాలు చేసే వారు తరచుగా మంచి నీళ్లు తాగడం మంచిది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తెల్లవారుజామున, నిద్రించే ముందు గోరు వెచ్చటి నీరు ఒక గ్లాస్‌ తాగితే.. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కరోనా సమయంలో వేడినీటి విలువతెలసింది. అంతా నీటిని వేడి చేసుకొని తాగడం వల్ల చాలా వరకూ రోగాలు తగ్గుముఖం పట్టాయి.