NRI-NRT

గల్ఫ్ కార్మికుల కడుపు కొట్టిన మోడీ సర్కార్

Modi Govt New Circular On Gulf Labor Salaries Must Be Withdrawn Says NRI TRS

గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని మహేష్ బిగాల అన్నారు. గల్ఫ్‌ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్‌ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్‌ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎడారి దేశాల్లో కనీస వేతనాలు అమలు కావట్లేదని బాధపడుతున్నారు. అలాంటిది మన దేశ ప్రభుత్వమే తక్కువ వేతనానికి సిఫారసు చేస్తే, గల్ఫ్‌ కంపెనీలు మన కార్మికుల కడుపు కోత మిగిల్చింది అని మహేష్ బిగాల అన్నారు. దీని వల్ల కోటి మందికి పైగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గల్ఫ్ కార్మికుల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం…గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలఅని ఎన్నారై తెరాస బెహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్‌కుమార్ డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం అని, స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే ఇప్పటికే ఇక్కడ ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని ఇలాంటి పరిస్థితిలో వేతనాలు తగ్గించడం చాల అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయాలి గానీ ఇలా చీకటి చేసే ప్రయత్నం వలన లక్షల కుటుంబాలు రోడ్డు పైకి వచ్చి బ్రతకాల్సి వస్తుంది అని ఇప్పటికైనా వెంటనే సర్కులర్లను రద్దు చేయాలని సతీష్ కోరారు.