DailyDose

ఢిల్లీ విమానాశ్రయంలో భారీ రద్దీ-తాజావార్తలు

Delhi Airport Is Full Of Passengers Due To COVID Screening

* బ్రిటన్‌లోని కొత్త కరోనా వైరస్‌ భారత్‌లోనూ అలజడి రేపుతోంది. యూకే నుంచి భారత్‌కు చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25మందికి పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. దీంతో నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్న ప్రయాణికులు తమ రిపోర్టుల కోసం ఎనిమిది గంటలకు పైగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు వచ్చాకే వారిని బయటకు పంపాలనే నిబంధనలు ఉండటంతో దాదాపు 500 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేక నియమావళి అనుసరించాల్సి ఉండటంతో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతున్నట్టు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

* తెలంగాణలోని పారిశ్రామిక కారిడార్‌ సహా ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌, నేషనల్‌ డిజైన్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆయన లేఖ రాశారు. రెండు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రూ.5వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ రెండింటిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. ప్రాజెక్టు వ్యయంలో కనీసం సగం మొత్తాన్ని 2021-22 కేంద్ర బడ్జెట్ లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

* కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అనుమతులు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్రిటన్‌, అమెరికా, రష్యా, చైనా దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 23లక్షల మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. చైనా, అమెరికా, బ్రిటన్‌, రష్యా దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించాయి. మరి భారత్‌ నెంబర్‌ ఎప్పుడొస్తుంది, మోదీ జీ?’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ప్రశ్నించారు.

* ఎస్సీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు మొత్తం రూ.59 వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఇందులో 60 శాతం వాటా కేంద్రం భరించనుండగా.. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయని కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

* వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు.

* మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ జఖియా ఖనం, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామి రెడ్డి, స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

* అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘లెజియన్‌ ఆఫ్ మెరిట్‌’ను పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఇరుదేశాల కృషిని ఇది గుర్తించిందని అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దం ఇరు దేశాలకు ఎన్నో సవాళ్లతో పాటు మరెన్నో అవకాశాలను ముందుంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుందనే విశ్వాసాన్ని, నిబద్ధతను 130కోట్ల మంది భారతీయుల తరపున స్పష్టంచేస్తున్నానని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

* దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధికి ఎన్నికల కోడ్‌ అడ్డం కారాదని ప్రధాని మోదీ ఆలోచననుంచి పుట్టుకొచ్చిన జమిలి ప్రతిపాదనపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని ప్రధాన రాజకీయ పక్షాల అధినేతలు ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునివ్వడం కొత్త చర్చకు తెరలేపింది. చట్టాల్లో తగిన సవరణలు చేస్తే జమిలికి తాము సిద్ధమేనని సాక్షాత్తు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

* బ్రిటన్‌ నుండి తెలంగాణకు వచ్చినవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వీరిలో కొత్త వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది గుర్తించేందుకు నమూనాలను పుణె వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు.ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు అధికారులు తెలిపాయి.నేరుగా యూకే నుంచే తెలంగాణకు వచ్చిన ప్రయాణికులు 355 మంది ఉన్నట్లు తేల్చారు.అయితే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను ట్రేస్ చేస్తోన్న వైద్య శాఖకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య శాఖ ఫోన్లను లైట్ తీసుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు.దాంతో ట్రేసింగ్ ఇబ్బందిగా మారుతోంది. అందుకే మర్కజ్ ఫార్ములాను అమలు చేయడానికి వైద్యారోగ్య శాఖ ప్లాన్ చేస్తోంది. అంటే కరోనా తొలినాళ్లలో అవలంబించిన మర్కజ్ ఫార్ములాను ఫాలో అయితే వాళ్ళను పట్టుకోవడం ఈజీ అని అంటున్నారు.వచ్చిన అందరి ఫోన్ లొకేషన్ ద్వారా గుర్తించి వారిని ట్రేస్ చేయడానికి చూస్తోంది వైద్యారోగ్య శాఖ.

* గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరుపై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి సచివాలయం వద్ద 1902 నంబరును కచ్చితంగా ప్రదర్శించాలని.. ప్రజలల సమస్యలు తెలియజేయడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ సమీక్ష నిర్వహించారు.

* కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఓ లక్కీ డ్రాలో భారత్‌కు చెందిన 30ఏళ్ల నవనీత్‌ సంజీవన్‌ మిలియన్‌ డాలర్లు గెలుచుకున్నారు.

* బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ సంస్థకు సంబంధించిన రెట్రోస్పెక్టివ్‌(వెనకటి తేదీ నుంచి విధించిన) పన్ను వివాదం కేసులో భారత్‌కు చుక్కెదురైంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌) కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూల తీర్పు వెలువరించింది. భారత్‌ కోరిన పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. పైగా ఈ కేసు నేపథ్యంలో భారత్‌ నిలిపివేసిన డివిడెండ్లు, పన్ను తిరిగిచెల్లింపులు సహా ట్యాక్స్‌ వసూలు కోసం అమ్మిన షేర్ల ద్వారా వచ్చిన సొమ్మును వడ్డీతో కలిపి రూ.7,600 కోట్లు కెయిర్న్‌ ఎనర్జీకే భారత ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. ఎస్‌ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. కరోనా పరిస్థితులపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈనెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.