Business

ఇండియాపై అమెరికా ప్రేమ…భారీ పెట్టుబడులు-వాణిజ్యం

US Investing In India For More Than 54 Million Dollars

* ఆన్‌లైన్‌ దా‘రుణ’ యాప్‌ల అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పందించింది. తెలంగాణ సహా దేశంలో పలుచోట్ల రుణ యాప్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అలాంటి యాప్‌ల ఉచ్చులో పడొద్దని, వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు సూచించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) యోగేశ్‌ దయాల్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

* భారత్‌లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 54 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ‘గత మూడు దశాబ్దాలుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత వృద్ధికి కూడా ఇది ఆటంకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భారత నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్(ఎన్‌ఐఐఎఫ్‌)లో అమెరికా 54 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది’ అని యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ ‌(డీఎఫ్‌సీ) వెల్లడించింది.

* టెస్లా మోడల్‌ 3 తయారీ సమయంలో కంపెనీ తీవ్ర కష్టాల్లో ఉండటంతో ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువలో పదోవంతుకే విక్రయించాలని భావించినట్లు టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఈ ఘటన 2017లో చోటు చేసుకొందని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ‘‘మోడల్‌ 3 అభివృద్ధి సమయంలో తీవ్రమైన కష్టాల్లో ఉన్నాము. అప్పుడు టెస్లాను ప్రస్తుతం ఉన్న ధరలో పదోవంతుకు విక్రయించే డీల్‌ను యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో చర్చించాలనుకున్నాను. కానీ, ఆయన ఆ భేటీకి నిరాకరించారు’’ అని పేర్కొన్నారు. 2017లో టెస్లా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒక దశలో దివాలా దశకు చేరింది. నాటి నుంచి టెస్లా షేరు విలువ దాదాపు 1400 శాతం పెరిగింది. టెస్లా కూడా యాపిల్‌తోపాటు ఎస్‌అండ్‌పీ 500 సూచీలో స్థానం దక్కించుకొన్న మర్నాడే మస్క్‌ నుంచి ఈ ట్వీట్‌ రావడం విశేషం.

* బ్యాంకుల్లో లావాదేవీలు చేయాలనుకునే వారు త్వరపడండి. ఎందుకంటే బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈనెల 25న క్రిస్మస్‌, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. 2020 సంవత్సరంలో ఇంకా 9 రోజులే ఉండగా.. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులే.. సాధారణంగానే ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తుంటాయి. అందువల్ల పండగ సమయంలో ఇబ్బంది పడేబదులు.. ముందుగానే ఖర్చులకు సరిపడే డబ్బులు ఉంచుకుంటే మంచిది. మళ్లీ ఈనెల 28వ తేదీ నుంచి బ్యాంకులు యథాతథంగా పని చేయనున్నాయి. కాగా.. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ రిటర్నులు దాఖలు చేయడానికి ఈనెల 31వ తేదీ వరకు అవకాశం ఉంది.