Politics

క్షమాపణలు కోరిన జగన్-తాజావార్తలు

YS Jagan Asks To Be Apologized In Pulivendula Tour

* పులివెందుల నియోజకవర్గానికి తాను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని సీఎం జగన్‌ అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్టాండ్‌, బస్‌డిపోకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. త్వరలో యురేనియం ప్రభావిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. గండి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.14.5కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం వివరించారు.పోతిరెడ్డిపాడులో సామర్థ్యానికి తగ్గట్టుగా నిల్వచేస్తేనే రాయలసీమలోని దిగువ ప్రాంతాలకు నీరు ఇవ్వొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా గండికోట, చిత్రావతి నిర్వాసితులకు సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. నిర్వాసితుల త్యాగం వల్లే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించి గండికోటలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయగలుతున్నామన్నారు. చిత్తశుద్ధి ఉంటేనే ప్రాజెక్టు పనులు చేయగలరని.. 18నెలల కాలంలో పూర్తి చేసి చూపించామని చెప్పారు. ఏనాడూ గండికోట రిజర్వాయర్‌లో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంచే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి వైఎస్‌ఆర్‌ తర్వాత ఏ పాలకులూ పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం వ్యాఖ్యానించారు. గండికోట నిర్వాసితులు అవస్థలు పడ్డారని.. పొరపాటున తప్పు చేసి ఉంటే తమ బిడ్డగా క్షమించాలని జగన్‌ కోరారు. నిర్వాసితులు చిరునవ్వులు చిందించేలా వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

* అహ్మదాబాద్‌- ముంబయి బుల్లెట్‌ రైలుకు అవాంతరం ఎదురైంది. థానే జిల్లా పరిధిలోని భూమిని ఈ రైలు ప్రాజెక్ట్‌కు బదలాయించేందుకు ఆ పార్టీ నేతృత్వంలోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (టీఎంసీ) తిరస్కరించింది. ముంబయి మెట్రో కార్‌ షెడ్‌ విషయంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

* పది జట్ల ఐపీఎల్‌కు బీసీసీఐ ఆమోదం లభించింది. 2022 నుంచి పది జట్లతో లీగ్‌ నిర్వహించేందుకు బీసీసీఐ పాలక మండలి ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన బోర్డు సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో సభ్యులందరూ ఇందుకు అంగీకరించారు. అంతేకాకుండా 2028 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చాలన్న ఐసీసీ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నుంచి కొన్ని విషయాలపై స్పష్టత రావడమే ఇందుకు కారణం.

* వచ్చే మార్చిలోపు కేటీఆర్‌ సీఎం అయ్యే అవకాశం ఉందని మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ పేర్కొన్నారు. డోర్నకల్‌లో మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన రెండు ట్రాక్టర్లను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ని కలిసి కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్‌కు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరు చేయాలంటూ విన్నవించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాబోయే సీఎం కేటీఆర్‌ అంటూ రెడ్యానాయక్‌ వ్యాఖ్యానించారు.

* వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన భూ ఆక్రమణ ఆరోపణలను నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆ ఆరోపణలు నిరూపించలేకపోతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని విజయసాయికి ఆయన సవాల్‌ విసిరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణబాబు మాట్లాడారు. వైకాపా నేతలు కబ్జా చేయడానికే ఆక్రమణలు తొలగిస్తున్నారని.. వాటిని తన బినామీలుగా చూపిస్తూ అభాండాలు వేస్తున్నారని విమర్శించారు.

* ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా రుణాలు ఇవ్వకపోగా.. సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ముందు చెత్తవేసి తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత వంటి పథకాలకు ఉయ్యూరులోని వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని.. లబ్ధిదారులతోపాటు నగర పంచాయతీ సిబ్బందితో అవహేళనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయా బ్యాంకుల కార్యాలయాల వద్ద చెత్తను పారబోశారు. విజయవాడలో మూడు చోట్ల, ఉయ్యూరులో 4 చోట్ల, మచిలీపట్నంలో ఒక చోట బ్యాంకుల వద్ద చెత్తవేసి నిరసన తెలిపారు. విజయవాడ యూనియన్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయంతో పాటు మరో రెండు చోట్ల చెత్తతో నిండిన పారిశుద్ధ్య వాహనాలను నిలిపారు. ఉయ్యూరులో యూనియన్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్ ప్రాంగణాల వద్ద చెత్త పారబోసి ఆందోళన చేపట్టారు. రుణాల మంజూరు విషయంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ డా. ప్రకాశ్‌ పలుమార్లు ఆయా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలాంటి నిరసనకు దిగినట్లు లబ్ధిదారులు తెలిపారు.

* కొత్త రకం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ రోజు రాత్రి నుంచి జనవరి 1 వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తామంటూ సీఎం యడియూరప్ప బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధించిన కర్ఫ్యూ అమలులోకి రాకముందే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ ప్రబలడంతో దాని వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని తొలుత నిర్ణయించినట్టు సీఎం యడియూరప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కర్ఫ్యూ అమలు చేయాల్సిన అవసరం లేదని భావించినట్టు తెలిపారు. అందుకే కేబినెట్‌ సహచరులు, సీనియర్‌ అధికారులతో చర్చించిన అనంతరం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటనలో తెలిపారు.

* నగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తులను గుర్తించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలా చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేస్తారన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలను గుర్తించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే రోహింగ్యాలు, సంఘ విద్రోహశక్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఆ తర్వాత పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేట కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో భాజపా బలపడుతుందని గుర్తించి ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్‌.. మేయర్‌ ఎన్నిక ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. రూ.5 కోట్లు ఇస్తాం.. తెరాసలోకి రావాలని భాజపా కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.