Health

వైద్యాధికారులకు మరో కొత్త తలనొప్పి

Andhra Health Officials Warn On New COVID Strain From Britain

గత నెల రోజుల వ్యవధిలో బ్రిటన్ నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన మొత్తం 1,148 మందిలో ఇప్పటి వరకూ 1,040 మంది జాడ కనుగొన్నామని, ఇందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని, మరో 90 మంది జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో 982 మందిని క్వారంటైన్లో వుంచామని, వీరిలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు కన్పించటంతో తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలున్నాయో లేదో పరిశీలించేందుకు వారి రక్త నమూనాలను పుణేలోని ఎన్ఐవి ల్యాబ్ కు పంపామని ప్రకటనలో వివరించారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు సోమవారం నుండి కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ ట్రయల్ రన్ ను ఐదు ప్రాంతాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకు సంబంధించిన వెబ్ ఆధారిత సాఫ్ట్ వేర్ కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒకటి లేదా రెండు జిల్లాల్లో వ్యాక్సిన్ ట్రయల్ రన్ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తాము కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాటంనేని వివరించారు.