Devotional

ఏసు జననం…శాంతి సందేశం

Christmas Special Story - The Birth Of Jesus For Peace

పశువుల పాకలో పుట్టి.. గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబరతను చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. అపార విశ్వాసంతో దైవునికి ఇష్టుడై అనూహ్యమైన మహిమలను చూపారు. మానవరూపంలో జన్మించి ప్రజారక్షకుడిగా వెలిగారు. ప్రజల కోసమే లోకం నుంచి తొలిగారు. నమ్మిన వారికోసం బలిదానానికి సైతం వెనుకాడని ఆయన గొప్పదనాన్ని చాటి చెప్పేదే క్రిస్‌మస్‌.
**ఏసు క్రీస్తు జన్మించి 2016 సంవత్సరాలవుతోంది. మరి ఆ త్యాగమూర్తి మన హృదయాల్లో కొలువవ్వాలంటే.. క్షమాగుణం అలవర్చుకోవాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి.. పంచాలి. ఈర్షా్యద్వేషాలను పారదోలాలి. కుట్రలు, కుతంత్రాలు వదిలేయాలి. ద్రోహ చింతన విడనాడాలి. అబద్ధం, లంచం, లోభితత్వం వంటి పాపాలకు దూరంగా ఉండాలి.
**జీసస్‌ ఎవరంటే..?
లోకాన్ని రక్షించడానికి దేవుడి చేత మానవుడిగా లోకానికి వచ్చిన వ్యక్తి క్రీస్తు అన్నది క్రైస్తవ సోదరుల ప్రగాఢ విశ్వాసం. ప్రజల పరిరక్షణే ఆయన ప్రథమ కర్తవ్యం. ఇది క్రైస్తవుల భావం. ఇదేవారి నడతకు, నడకకు జీవం. యేసు బోధనలు అందరికీ ఆదర్శం. ఆయన బోధనల సమాహారమే పవిత్రమైన బైబిల్‌ గ్రంథం.
**బైబిల్‌ గురించి సంక్షిప్తంగా..
గ్రీకుభాషలో బైబిల్‌ను బిబ్లాస్‌ అంటారు. ఆంగ్లంలో దీని అర్థం ‘ద బుక్‌ ఆఫ్‌ బుక్స్‌’. తెలుగులో దీని భావం శ్రేష్ఠమైన పుస్తకంగా పేర్కొంటారు. బైబిల్‌ ప్రధానంగా రెండు భాషల్లో రాశారు. హిబ్రూ భాషలో పాత నిబంధన, గ్రీకు, అరమిక్‌ భాషలో కొత్త నిబంధన రాయబడింది. అనంతరం 1200 భాషల్లోకి తర్జుమా చేశారు. క్రీ.శ 1236లో కార్డినల్‌కాలో బైబిల్‌ను అధ్యాయాలుగా, క్రీ.శ 1551తో సర్‌ రాబర్ట్‌ స్టీవెన్‌ వచనాలుగా విభజించారు. ముద్రణా యంత్రం కనిపెట్టిన తరవాత ముద్రితమైన తొలి గ్రంథం బైబిల్‌.
**క్రీస్తు చెప్పిన మాటలు
* నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడిగా రూపొందుతావు. నీ మాటలు బట్టే అపరాధివని తీర్పు పొందుతావు..: మన మాట తీరులోనే మనలోని మంచి చెడు బహిర్గతమవుతుందని అర్థం.
* ఒక మనిషి లోకమంత సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న అతనికి ఏమీ ప్రయోజనం..: ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదీ కాదు. అది లేనప్పుడు ఎంత సంపాదించినా వృథా. అందుకే అడ్డ దారుల్లో వెళ్లకూడదనేది నీతి.
* దేవుడు జతపరచిన వాళ్లను మనుష్యులు వేరు చేయకూడదు..: తల్లి, తండ్రి, తోబుట్టువులు, భార్య, పిల్లలు దేవుడు సృష్టించిన బంధాలు. వీటికి మనిషి దూరం కాకూడదనేది క్రీస్తు మాట.
* ప్రజల హృదయాల్లోంచే దురాచారాలు, దొంగతనాలు, వ్యభిచారాలు బయటకు వచ్చి మనుష్యులను అపవిత్రపరచును..: మన నుంచి ఏ తప్పు జరిగినా అది మన మనసు చేసేదే. అంటే దానికి బాధ్యత వహించాల్సింది మనమేనని అర్థం.
* ఆ దినం గురించి.. గడియ గురించి ఎవరూ ఎరుగరు.. జాగ్రత్త పడండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి..: మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. బతికి ఉన్నంత కాలం ఆధ్యాత్మిక చింతనతో గడపాలని భావం.
* శత్రువును ప్రేమించండి.. ద్వేషించే వారికి మేలు చేయండి. శపించే వారిని దీవించండి.. బాధించే వారి కోసం ప్రార్థన చేయండి..: మనకు కీడు చేసే వారికి కూడా మేలు చేయగలిగే గుణం కలిగి ఉండాలని అర్థం.
* నీ ఆత్మీయున్ని కోల్పోయానని కుమిలిపోకు.. వారు దైవ సన్నిధికి చేరారు. సంతశించు..: చనిపోయిన వారి కోసం రోధించకూడదని చెపుతున్నాడు క్రీస్తు.
**క్రిస్‌మస్‌ వేడుకలు ఇలా..
డిసెంబరు ఒకటో తేదీ నుంచే క్రిస్‌మస్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉమెన్స్‌ క్రిస్‌మస్‌, యూత్‌, చిల్డ్రన్స్‌, గ్రాండ్‌ క్రిస్‌మస్‌ పేరిట కార్యక్రమాలు కొనసాగుతాయి. వితంతువులకు వస్త్ర దానం, పేదలకు అన్నదానం, గ్రామీణ సంఘ కాపరుల సహాయ సహకారాలు తదితర కార్యక్రమాలు వీటిలో భాగం. క్రొవ్వొత్తుల అలంకారాలు, ప్రార్థనలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, క్యారోల్స్‌ పేరిట ఇంటింటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతారు. 24వ తేదీన క్రిస్‌మస్‌ ఈవ్‌ పేరిట రాత్రివేళ ప్రత్యేక కార్యక్రమాలు, ప్రార్థనలతో గడుపుతారు. 25న క్రిస్‌మస్‌ పండుగతో పాటు రాత్రి ఏడు నుంచి 12 గంటల వరకు ప్రార్థనాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.