Movies

నిలకడగా రజనీ ఆరోగ్యం-తాజావార్తలు

Rajini's BP Under Control - Apollo Releases Bulletin

* ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. రజనీకాంత్‌ ఆరోగ్యాన్ని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు శనివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రజనీకాంత్‌కు తోడుగా ఆయన కుమార్తె ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయన్ను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించట్లేదని చెప్పారు. రజనీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు కోసం ఆస్పత్రికి ఎవరూ రావొద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు. బీపీ హెచ్చు తగ్గుల కారణంగా రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

* తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలిసి బాధపడ్డానన్నారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

* జేవీ సోమయాజులు ప్రధాన పాత్రలో మంజుభార్గవి, అల్లు రామలింగయ్య కీలకపాత్రల్లో కె.విశ్వనాథ్‌ రూపొందించిన అపురూప దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. నటి సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ఛాట్‌ షో ‘సామ్‌జామ్‌’. తాజాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనని తాను సక్సెస్‌గా అభివర్ణించుకుంటానని తెలిపారు. ఆటోబయోగ్రఫీ రాయాలని.. దాని ద్వారా కొంతమందిలోనైనా ప్రేరణ నింపాలనే ఆశ ఉందని వెల్లడించారు.

* నగరంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలను జాతీయ మదింపు, గుర్తింపు సంస్థ (న్యాక్‌) ఐదేళ్ల పాటు బ్లాక్‌ లిస్టులో పెట్టింది. విద్యా సంస్థల నాణ్యతను మదించి న్యాక్‌ గ్రేడింగ్‌ ఇస్తుంది. విద్యా సంస్థలో వసతులు, బోధనా ప్రమాణాలు, కోర్సు పూర్తైన విద్యార్థుల్లో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని మదించి గ్రేడ్‌ ఖరారు చేస్తుంది. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు ఇప్పటివరకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ ఉంది. అక్రిడిటేషన్‌ పునరుద్ధరణకు మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ గత నెల 13న న్యాక్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే బీహెచ్‌ఈఎల్‌, ఎయిర్‌టెల్‌, మరో సంస్థ పేరిట కళాశాల యాజమాన్యం బోగస్‌ నివేదిక సమర్పించినట్లు న్యాక్‌ గుర్తించింది. గత నెల 22న జరిగిన న్యాక్‌ 88వ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అక్రిడిటేషన్ కోసం కళాశాల సమర్పించిన దరఖాస్తును తరస్కరించడంతో పాటు వచ్చే ఐదేళ్ల పాటు దరఖాస్తు చేయకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని న్యాక్‌ పాలకమండలి తీర్మానించింది. ఈ మేరకు న్యాక్‌ పరిపాలనా అధికారి మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు.

* యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 16 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ 16 మంది బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిలో నలుగురు హైదరాబాదీలు‌, నలుగురు మేడ్చల్ జిల్లాల వాసులు, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,091 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,861 యాక్టివ్‌ కేసులున్నాయి.

* తెలంగాణలో తమ కార్యకర్తలను అడ్డుకోవడానికి తెరాస ప్రయత్నిస్తే ఒక్క మంత్రి కూడా ఇంటి నుంచి బయటకు రాలేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. జగిత్యాలలో తన పర్యటనను అడ్డుకునేందుకు తెరాస యత్నించడంపై ఆయన మండిపడ్డారు. దాడి చేస్తే పక్కాగా ప్రతిదాడి చేస్తామని చెప్పారు. జగిత్యాలలో రైతులతో నిర్వహించిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. సన్నవడ్లు పండించాలని చెప్పి రైతులను సీఎం కేసీఆర్‌ నట్టేట ముంచారని‌ ఆరోపించారు.

* మేయర్ ఎన్నికల్లో కేరళలో రాజధాని తిరువనంతపురం జాతీయ రికార్డు సృష్టించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 21 ఏళ్ల వయసులో ఆర్యా రాజేంద్రన్ మేయర్ పీఠాన్ని అధిష్టించనున్నారు. కళాశాల విద్యను అభ్యసిస్తోన్న ఆమె.. అతి చిన్న వయసులో ఈ పదవికి ఎన్నికానున్న వ్యక్తిగా నిలిచారు. సీపీఎం పార్టీకి చెందిన తిరువనాథపురం జిల్లా సచివాలయం ఆమె పేరును ఈ పదవికి సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సిఫార్సును రాష్ట్ర కమిటీ అంగీకరించింది.

* తమిళనాడులో పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న వేళ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం భాజపాలో చేరారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సమక్షంలో చెన్నైలో భాజపా కండువా కప్పుకొన్నారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ కోర్‌ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న అరుణాచలం తమిళనాడులో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

* ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్స విషయంలో ఎయిమ్స్‌ అభ్యర్థనపై దిల్లీ పోలీసులు అద్భుతంగా స్పందించారు. దిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిమ్స్‌కు గుండె తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా అంబులెన్స్‌ వెళ్లేందుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. దీంతో 18.5 కి.మీల దూరాన్ని కేవలం 12 నిమిషాల్లోనే అంబులెన్స్‌ చేరుకోగలిగింది.

* కరోనా కాలంలో ప్రజలకు బోనస్‌ ఇస్తానని మెయిల్‌ పెట్టిన కంపెనీ యాజమాన్యం చివరికి అది ఒక భద్రతా పరీక్ష అనేసరికి ఉద్యోగులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నెట్‌ డొమెన్‌ రిజిస్టేషన్‌ సంస్థ ‘గోడాడీ’లో జరిగింది. అసలేం జరిగిందంటే.. గోడాడీ సంస్థ ఉద్యోగులకు డిసెంబరు 14న ఓ మెయిల్‌ వచ్చింది. దానిలో ఉద్యోగులందరికీ హాలిడే బోనస్‌గా 650 డాలర్లు ప్రకటిస్తున్నట్లు ఆ మెయిల్‌లో ఉంది. దానిలో భాగంగా ఉద్యోగులంతా వారి వ్యక్తిగత సమాచారాన్ని అందించాలని కోరగా వారంతా సంబంధిత సమాచారాన్ని ఇచ్చారు.

* ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయంలో ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధాకర్‌ (22) గల్లంతయ్యారు. గల్లంతైన సుధాకర్‌ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చిన నేపథ్యంలో స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం లక్నవరం చేరుకున్నారు. సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడి గల్లంతయ్యారు. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేకపోయారు. స్థానిక ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

* పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగళ్లులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రగడ జరిగింది. సభలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ తనపై ఇంతవరకూ ఒక్క కేసూ లేదని.. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదన్నారు. తాను వివాదాలకు దూరంగా ఉంటాని చెబుతుండగా.. ఉండి నియోజకవర్గం వైకాపా కన్వీనర్‌ పీవీఎల్‌ నరసింహరాజు అడ్డుతగిలారు. తనపైనా ఎలాంటి కేసులు లేవంటూ ఎమ్మెల్యే వైపునకు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగ్గా.. సభలో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.

* దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 50 లక్షల లావాదేవీలు జరిగాయి. తద్వారా వసూళ్లు తొలిసారి రూ.80 కోట్లు దాటినట్టు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్టు తెలిపింది. ఫాస్టాగ్‌ ద్వారా ఒక్కరోజులోనే (డిసెంబర్‌ 24న) తొలిసారిగా వసూళ్లు రూ.80 కోట్లు దాటడం, 50లక్షల లావాదేవీలు జరగడం ఓ మైలురాయిగా అభివర్ణించింది.

* ప్రభుత్వం ఇచ్చిన 28లక్షల ఇళ్ల పట్టాల ప్రకటన మోసపూరితమని ఏపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాటిలో 70 శాతం నివాసముంటున్న సొంత స్థలానికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి పట్టా ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 38 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు లెక్కల్లో చూపి ఏడుగురికి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. మిగిలిన 31 మందికి వారికున్న సొంత స్థలానికి పొజిషన్‌ ఇచ్చారన్నారు.