Politics

నాకే క్రేజ్ ఎక్కువ

VH Compares To Revanth - Confirms He Has More Craze

తెలంగాణ పీసీసీ అధ్యక్ష‌ పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ రేవంత్ పేరే ప్రముఖంగా వినపడుతోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు అయ్యారని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని తెలుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చి న రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారని విమర్శించారు. అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడారు.