Movies

మెరుగ్గా రజనీ ఆరోగ్యం-తాజావార్తలు

Apollo Bulletin Today On Rajinikanth's Health - Says It Is Stable

* జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్‌ రజినీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది.రజినీ డిశ్చార్జ్‌పై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు వెల్లడించారు.క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. నిన్నటికంటే ఈరోజు ఆయన‌ ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.రజినీకాంత్‌ బీపీ కంట్రోల్లోనే ఉందన్నారు. ఆయన‌ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు వెల్లడించారు.కాగా.. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.రక్తపోటును అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని, బీపీ సమస్య తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని స్పష్టం చేశాయి..

* యావత్ ప్రపంచంలో లక్షలాది మందిని బలితీసుకున్న సునామీ విలయానికి 16 ఏళ్లు నిండిన సందర్భంగా తమిళనాడులో మృతులకు నివాళులు అర్పించారు.చెన్నై సహా పలు సముద్ర తీర ప్రాంతాల్లో మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు. మృతులను స్మరిస్తూ పూజలు నిర్వహించారు.2004 డిసెంబర్‌ 26న విరుచుకుపడ్డ సునామీ ధాటికి తమిళనాడులోని చెన్నై, నాగపట్టణం సహా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత నేలవెల్లి రామారావుపై హత్యాయత్నం జరిగింది. ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తెల్లవారుజామున కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామారావు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావుపై దాడికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా దాడికి పాల్పడిన నిందితుడు మాడపాటి రాజేష్‌ ఇవాళ ఉదయం మధిర కోర్టులో లొంగిపోయాడు.

* ఇటీవల ఆదిలాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌(52) మృతిచెందాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశాడు. ఈ నెల 18న ఎంఐఎం నేత షారూఖ్ అహ్మద్‌.. జమీర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జమీర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

* సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూ ప్రస్తుతం వెనక్కి తగ్గిన చైనా.. పాకిస్థాన్‌ను మనపై ఎగదోసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది! దాయాది దేశానికి డ్రోన్లు విక్రయించి తన దుష్ట బుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌ను టార్గెట్‌ చేసేందుకు పాక్‌ను పావుగా వాడుకుంటున్న డ్రాగన్‌.. సైనిక అవసరాల కోసం తయారు చేసిన సాయుధ డ్రోన్లను సమకూర్చింది. శత్రువును టార్గెట్‌ చేయగల సత్తా కలిగిన 50 వింగ్‌లూంగ్‌-2 డ్రోన్లను పాకిస్థాన్‌కు విక్రయించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనా నుంచి ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా భారత్‌కు అత్యాధునిక ఆయుధ సంపత్తి ఎంతో అవసరం. ఆఫ్రికా, ఆసియాల్లో జరిగిన పలు యుద్ధాలలో వింగ్ లూంగ్ ఈఈ విజయవంతం కావడాన్ని చైనా గుర్తుచేస్తుండగా.. భారత సైనిక అధికారులు మాత్రం సాయుధ డ్రోన్లు అనియంత్రిత గగతనతలంలో లేదా గగనతల ఆధిపత్యం ఉన్న చోట మాత్రమే ఉత్తమంగా పనిచేయగలవని పేర్కొంటున్నారు.

* ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై రానున్న వారం రోజుల్లో భాజపా 25 వెబినార్లు (వీడియో సమావేశాలు) నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2014లో ప్రధాని ల్ నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికలను కలిపి నిర్వహించాలని తరచూ ప్రజల ముందు వినిపిస్తున్నారు. ప్రస్తుతం జరిగే విధానం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుండటంతో ప్రధాని ఈ విధానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నీ ఒకేసారి జరగాలన్నది ప్రధాని కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన 80వ ఆల్‌ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలోనూ ప్రధాని ఒకే దేశం-ఒకే ఎన్నికను ప్రస్తావించారు. ‘‘ ప్రతి కొన్ని నెలలకొకసారి వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. అందువల్ల ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ విధానంపై ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాలి.’’ అని మోదీ పలుమార్లు తెలిపారు. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రణాళికలో భాగంగా ఈ వెబినార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ నాయకులు, నిపుణులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘ఈ నెలాఖరులోగా 25 వెబినార్లు నిర్వహించాలని మేం అనుకుంటున్నాం.’’ అని పార్టీనాయకుడొకరు తెలిపారు.

* భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటై యూపీఏ కూటమి ద్వారా జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా మారాలని శివసేన పార్టీ సూచించింది. అంతేకాకుండా దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తమ నాయకత్వానికి సంబంధించి, యూపీఏ కూటమి భవిష్యత్తు గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తన అధికార పత్రిక సామ్నా వేదికగా అభిప్రాయపడింది.

* భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి మరో పార్టీ వైదొలిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌ బేనీవాల్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) కూటమి నుంచి బయటకొచ్చింది. నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు బేనీవాల్‌ ప్రకటించారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించేవారి పక్షాన తాము ఉండబోమని తెలిపారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో నిర్వహించిన రైతుల ఆందోళన కార్యక్రమంలో ఈ మేరకు బేనీవాల్‌ ప్రకటన చేశారు.

* 60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది. రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు రెండు లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేశారు. వారిలో 60ఏళ్లు పైబడిన వారికి టీకాను అనుమతించలేదు. ఆ వయసు వారిపై ఈ టీకాను విడిగా పరీక్షించారు. ఈ ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి టీకాను అందరికీ అనుమతిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా రష్యా ప్రభుత్వం 3 లక్షల స్పుత్నిక్‌ టీకాలను అర్జెంటీనాకు పంపారు. రష్యా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను పంపారు. ఈ స్పుత్నిక్‌-వి టీకా ఎగుమతికి సంబంధించి రష్యా ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికే అర్జంటీనా, బెలారస్‌లు తమ దేశాల్లో స్పుత్నిక్‌ టీకా వినియోగాన్ని అనుమతించారు.

* నగరంలోని బాచుపల్లిలో హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. బాచుపల్లి పరిధి ప్రగతినగర్‌లో వ్రతం జరుగుతున్న ఇంట్లోకి 10 మంది హిజ్రాలు చొరబడి ఇంటి యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చివరకు ఇంటి యజమాని నుంచి రూ.16,500 బలవంతంగా వసూలు చేసి వెళ్లిపోయారు. ఈ మేరకు ఇంటి యజమాని హిజ్రాలపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది హిజ్రాలను అరెస్టు చేసి, వారి నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

* బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్రానికి వచ్చినవారిలో మేడ్చల్‌ జిల్లాకు చెందిన మరో ఇద్దరికి కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన కొవిడ్‌ బాధితుల సంఖ్య 18కి చేరింది. హైదరాబాద్‌ జిల్లాలో నలుగురు, మేడ్చల్‌ జిల్లా నుంచి ఆరుగురు, జగిత్యాల నుంచి ఇద్దరు, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కొరు చొప్పున కరోనా పాజిటివ్‌ బాధితులున్నారు.

* యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన పలువురికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా యూకే నుంచి వచ్చిన 14 మంది కర్ణాటకవాసులకు, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు భువనేశ్వర్‌లో బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కూడా వైరస్‌ సంక్రమించినట్లు గుర్తించారు.

* మోడెర్నా కొవిడ్‌-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్‌ఫిష్‌ అలర్జీ ఉండటం గమనార్హం.