NRI-NRT

“సినిమా పాటల్లో సాహిత్యం”పై తానా సదస్సు

TANA Event On Lyrics In Movie Songs

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నాడు “సినిమా పాటల్లో సాహిత్యం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయితలు పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, వెన్నెలకంటి, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ లు పాల్గొని వివిధ అంశాలను స్పృశించి అందరినీ అలరించారు. “మనస్సు కవి” ఆచార్య ఆత్రేయ శతజయంతి సందర్భంగా నాలుగు దశాబ్దాల పాటు అభ్యుదయ భావాలతో సృష్టించిన సాహిత్యం, రాసిన సినిమా పాటల వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆయనకు అంకితమిస్తున్నట్లు సాహిత్య వేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరివెన్నెల మాట్లాడుతూ సినిమా పాటల్లో సాహిత్యపు విలువలు ఉన్నతంగా ఉండాలి అంటే దానికి ప్రధాన భాద్యతను సినీ గీత రచయితయే తీసుకోవాలి అన్నారు. వెన్నెలకంటి మాట్లాడుతూ సినిమా సాహిత్యంలో ప్రమాణాలు పడిపోతున్నాయి లేదా విలువలు తగ్గిపోతున్నయా అనే ప్రశ్న అర్థం లేనిదని, ప్రమాణాలు విలువలు ఎప్పుడు పడిపోవని, మార్పు మాత్రమే చెందుతాయని అన్నారు. డా. సుద్దాల అశోక తేజ మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి పాటల్లో ఎక్కువగా తెలుగు సాహిత్య కావ్యాలంకార లక్షణాలు ప్రస్పుటంగా ఉంటాయన్నారు. భువనచంద్ర మాట్లాడుతూ రచయిత ఎంత విస్తారంగా ప్రాచీన, ఆధునిక భారతీయ సాహిత్యాన్ని, పాశ్చ్యాత సాహిత్యాన్ని చదివితే అన్ని మంచి ఆలోచనలు వస్తాయని, అవి పాట వైభవాన్ని పెంచటానికి గీత రచయితకు ఉపయోగ పడతాయన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ప్రస్తుత పాటల్లో కొన్ని పడికట్టు పదాలు ఎక్కడనుంచో రావని, రచయిత తను చుట్టూ ఉన్న సమాజాన్ని అనునిత్యం పరిశీలిస్తే దొరికే పదాలే రచయిత అవసరాన్ని పట్టి వాడతారన్నారు. ఎంతో సమయాన్ని వెచ్చించి అద్భుతమైన సాహిత్య విలువలతో పాటను అందిస్తే అవి వివిధ కారణాల వల్ల ఆ సినిమా విజయవంతం కాకపోతే రచయితగా నిరుత్సాహ పడవలసిన అవసరం లేదని, శక్తివంచన లేకుండా కృషి చేసి మంచి పాట అందించడం వరకే రచయిత భాద్యత అని అనంత శ్రీరామ్ అన్నారు. గత ఎనిమిది నెలలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ పాల్గొని రామిశెట్టి సుమంత్, నిర్వాహకులకు, సమన్వయకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.