Business

ఇండియాలో జనవరి నుండి టెస్లా బుకింగ్స్-వాణిజ్యం

Business News - Tesla Bookings In India To Begin From January 2021

* టెక్‌ దిగ్గజం టెస్లా తన మోడల్‌-3 భారత్‌లోకి తీసుకొచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా సోమవారం ధ్రువీకరించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. తొలుత విక్రయాలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత అసెంబ్లింగ్‌‌, తయారీపై దృష్టిపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ నెంబర్‌ వన్‌ తయారీ హబ్‌గా మారుతుందన్నారు. మరోపక్క జనవరిలో మోడల్‌ -3 కార్ల బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించి జూన్‌లో డెలివరీలు మొదలు పెట్టేలా యత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలను ఉటంకిస్తూ ఆంగ్ల ప్రతిక ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. అక్టోబర్‌లో టెస్లా సీఈవో అలెన్‌ మస్క్‌ కూడా ఈ విషయాన్ని ముందస్తుగా వెల్లడించారు. 2021 నాటికి భారత్‌లో టెస్లా ఉంటుందని ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో భారత్‌లో పరిశోధనశాలను, బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తోంది. ఇక టెస్లా మోడల్‌ 3 కారు పూర్తి విదేశాల్లోనే తయారై భారత్‌కు చేరనుంది. కంపెనీ ఈ కార్లకు ఎటువంటి డీలర్‌ షిప్‌లను ఏర్పాటు చేయకుండా.. నేరుగా విక్రయించే అవకాశం ఉంది. దాదాపు 2016 నుంచి భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని టెస్లా భావిస్తోంది.

* బ్యాంకు ఖాతాలో తగినంత డబ్బులు లేకపోయినా ఏటీఎం ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తే చార్జీలు తప్పవు. బ్యాలెన్స్‌ లేక ఏటీఎం ట్రాన్సాక్షన్‌ ఫెయిలయిన సందర్భాల్లో దేశంలోని పలు బ్యాంకులు పలు రకాలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారుల నుంచి రూ.20తోపాటు జీఎస్టీ వసూలు చేస్తున్నది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ రూ.25తోపాటు జీఎస్టీని అపరాద రుసుముగా వసూలు చేస్తున్నాయి. యాక్సిస్‌, కొటక్‌ మహేంద్ర బ్యాంకులు రూ.25 వసూలు చేస్తున్నాయి.

* సార్వభౌమ పసిడి బాండ్ల 2020-21 సిరీస్ ఈX స‌బ్‌స్క్రిప్ష‌న్‌‌ నేడు (డిసెంబ‌రు 28) ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. అందువల్ల పెట్టుబడికి హామీ ఉంటుంది. గ్రాము బంగారం ధర రూ. 5,000 గా నిర్ణయించారు. అంతేకాకుండా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లింపు చేసేవారికి గ్రాముకు రూ. 50 తగ్గింపును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకునే చందాదారులకు గ్రాము బంగారం రూ.4,950 కే అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 1, 2021. ఒక గ్రాము యూనిట్ గా పరగణించి బంగారు బాండ్లలో పెట్టుబడి చేయవచ్చు. కనీసం ఒక గ్రాము నుంచి పెట్టుబడి చేయవచ్చు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి. సోమవారం ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 13,843 వద్ద, సెన్సెక్స్‌ 308 పాయింట్లు పెరిగి 47,281 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఉదయం ఒక దశలో 100పాయింట్లకు పైగా లాభపడింది. ఫలితంగా సూచీలు సరికొత్త శిఖరాలకు చేరాయి.

* కరోనా కాలంలో బంగారం ధర భారీగా పుంజుకుంది. ఈ ఏడాది 10 గ్రాముల పసిడి ధర వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. అయితే 2021 ఏడాదిలో కూడా పసిడి ధరల పరుగు మరింత వేగం అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తాజా ఉద్దీపన చర్యలు, బలహీనమైన అమెరికన్ డాలర్‌ తదితర అంచనాల మధ్య, కొత్త సంవత్సరంలో బంగారం 10 గ్రాములకు 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

* భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి 48,000 కోట్లతో భారత ప్రభుత్వం మూడు పథకాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 10.5 లక్షల కోట్ల రూపాయల మొబైల్ ఫోన్‌ల తయారీ కోసం పీఎల్‌ఐ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 16 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గత అక్టోబర్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.11 వేల కోట్లను కూడా విడుదల చేసింది. తాజాగా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారుచేసే కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు అని ప్రభుత్వానికి పేర్కొన్నాయి.