Politics

పులివెందులలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్న తెదేపా

YS Jagan Slams Chandrababu In Sri Kalahasthi

‘పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా చంద్రబాబు, ఆయన సహచరులు కలిసి కోర్టుల్లో కేసులు వేశారు. న్యాయస్థానాలు స్టేలు కూడా ఇచ్చాయి. దీంతో ఈ నెల 25న ఇవ్వాలనుకున్న 31.74 లక్షల ఇళ్ల పట్టాలకుగాను 10% (3.74 లక్షల) పట్టాల పంపిణీ ఆగిపోయింది. పట్టాల పంపిణీకి ఈ నెల 25న శ్రీకారం చుడితే అంతకంటే ఒక్క రోజు ముందు హైకోర్టులో పిల్‌ వేశారు. నా సొంత నియోజకవర్గమైన పులివెందుల్లోనూ స్టే తీసుకొచ్చారు. వీళ్లు మనుషులేనా అని కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. వీళ్లు రాజధాని అనే అమరావతిలో అక్షరాలా 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రభుత్వం అడుగులు వేస్తే.. డెమోగ్రాఫిక్‌ కింద ఇస్తుందంటూ కోర్టుకెళ్లారు. అంటే కులాలపరంగా తేడా వస్తుందని చెప్పి ఏకంగా చంద్రబాబు మనుషులు కేసులు వేశారు. కోర్టులో స్టే కూడా వచ్చింది. వీళ్లు కేసులు వేయడం ఏమిటి? వాటిపై స్టేలు రావడం ఏమిటి? అని బాధ అనిపిస్తుంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపం ఊరందూరు గ్రామం వద్ద ముఖ్యమంత్రి సోమవారం ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించి బహిరంగ సభలో మాట్లాడారు.