DailyDose

వేతనాలు విరమణ వయస్సు పెంచిన కేసీఆర్-తాజావార్తలు

Breaking News - KCR Announces Good News To Employees

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్‌డ్, డెయిలీ వైజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పింఛనుదారులు.. ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి రాష్ట్రంలో 9,36,976 మంది ఉంటారని.. అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అవసరమైతే వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం ప్రకటించారు.

* శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీశైలం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు సత్రంలో కొంత మంది భక్తులు భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏదో విషయంలో భక్తులు, సత్రం సిబ్బంది మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పరస్పరం దాడి చేసుకోవడంతో ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వైకాపాలోని వర్గపోరుకు వేదికవుతోంది. తాజాగా మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే వంశీని వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో మల్లవల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. వంశీ వేదిక వద్దకు వెళ్లకుండానే వైకాపాలోని ఓ వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో మల్లవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

* కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ఇది రాజకీయ కుట్ర అని, వెంటనే నిజ నిర్ధారణ కమిటీ వేసి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

* భారత్‌లోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని లేహ్‌లో సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్‌ కదలికల కోసం భారత వాతారణశాఖ (ఐఎండీ) ప్రత్యేక వాతావరణ సూచనలు అందించనుంది. దీంతో హిమాలయాల్లో రెండో వాతావరణ కేంద్రాన్ని భారత్‌ ఏర్పాటు చేసినట్లైంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లోనూ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఐఎండీ అందుబాటులోకి తెచ్చింది. ‘లద్దాఖ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. ఇది స్థానికులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే దేశ భద్రత, భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కాగా.. భారత్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం (అటల్‌ టన్నెల్‌)ను నిర్మించింది. మనాలి నుంచి లేహ్‌ వరకు 9.2 కి.మీ ఉన్న ఈ సొరంగ మార్గం.. సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంది.

* యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన చైనా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిందన్న వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌లకు కూడా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ లేకుండా పోతుందనే వార్తలు ఎక్కువయ్యాయి. పలు వ్యాక్సిన్‌లు ప్రయోగదశల్లో ఉండగానే వివిధ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటోన్న వేళ.. చైనా వ్యాక్సిన్‌వైపు మాత్రం చాలా దేశాలు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని కలిగించేందుకు డ్రాగన్‌ దేశం తంటాలుపడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు రైతులు మద్దతిస్తున్నారన్న అక్కసుతోనే రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలోని పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. రైతులు నష్టపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అన్నదాతలకు భాజాపా అండగా నిలుస్తుందన్నారు. ఇకపై రైతులు పండించిన పంటను కొనబోయేది లేదని సీఎం కేసీఆర్‌ చెప్పడం.. ఒక రకంగా రాష్ట్ర రైతులను భయానికి గురిచేయడమే అవుతందని విమర్శించారు.

* తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అందుకోసం అడుగులు వేస్తోంది. పార్టీ విజయం కోసం ఐదంచెల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. షెడ్యూల్‌ ప్రకటన, నోటిఫికేషన్‌కు ముందునుంచే ప్రణాళికలు తయారుచేసుకున్న ప్రతిపక్షం ఇప్పటికే 8వేల మంది బూత్‌ లెవల్‌ కార్యకర్తలను సిద్ధం చేసుకుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాలకు పరిశీలకులుగా 89 మంది సీనియర్‌ నేతలను నియమించింది. ఇతర పార్టీలకన్నా ముందే పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని అధినేత చంద్రబాబు ప్రకటించి ప్రచారం మొదలయ్యేలా చేశారు. పార్టీకి రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న రాబిన్‌ శర్మ ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. ఆయన బృందం తిరుపతి ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

* భాజపాకు సీనియర్‌ ఎంపీ గుడ్‌బై చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్‌లోని భరూచ్‌ లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు మన్‌సుఖ్‌‌ భాయి వాసవ పార్టీని వీడుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు లేఖ రాశారు. ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికైన వాసవ.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ‘‘పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువల రక్షణకు కృషిచేశాను. అయితే, అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేసిన తప్పు పార్టీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నా. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలుస్తాను. లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను అందజేస్తా. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి’’ అని లేఖలో పేర్కొన్నారు.

* రైతులు పండించిన పంటలను ఇకపై కొనబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించేంత వరకు ఆందోళన చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. రైతు వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణను ఉత్తమ్‌ ప్రకటించారు. గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నేతలతో కలిసి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి జనవరి 7 వరకు మండలాల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పంటలు కొనుగోలు చేయాలనే డిమాండ్లతో తహసీల్లార్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. జవవరి 11న జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని.. 18న ఒక చోట రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపి ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పారు. రుణమాఫీ, పంట నష్టంపై ఎలాంటి చర్చే లేకుండా ముఖ్యమంత్రి వ్యవసాయ సమీక్ష ఎలా చేస్తున్నారని ఉత్తమ్‌ నిలదీశారు.

* అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేయడం.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. తాడిపత్రి ఘటన పై సీఎం జగన్, డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులు కూడా ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. గత 19 నెలల్లో దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. ఏ మాఫియా మూక దాడి చేస్తుందో అని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని జీవిస్తున్నారని ధ్వజమెత్తారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు.మంగళవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు నిర్వహించడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లబ్‌లను మూసివేయిస్తోంది తప్ప ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నాని.. బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పేందుకే స్పందిస్తున్నానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనని తాను వకీల్‌ సాబ్‌ అనుకుంటే జనం మరో విధంగా భావిస్తున్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఆపాలని ఎవరూ కోరలేదని, తనంతట తానే స్వయంగా సినిమాలు ఆపేస్తున్నట్టు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత పుత్రుడు ఒకవైపు, దత్త పుత్రుడు మరో వైపు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. పవన్‌కు మరోసారి ప్యాకేజీ అందడంతో పర్యటనలు వేగవంతం చేశారని ఎద్దేవా చేశారు.

* విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు వాటి ప్రాముఖ్యత తగ్గుతోందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంకు(పీఎంసీ) కుంభకోణం కేసులో తన భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. తనతో ఎవరైనా రాజకీయంగా తలపడాలనుకుంటే ఎదురుగా వచ్చి ఢీకొట్టాలని భాజపాకు పరోక్షంగా సవాల్‌ విసిరారు.