DailyDose

ఏపీ రెవెన్యూ వెబ్‌సైట్ హ్యాక్-నేరవార్తలు

AP Revenue Website Hacked To Steal Money In Hyderabad

* ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్‌ నంబర్‌, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన రెవెన్యూ వెబ్‌సైట్‌ నుంచి నిందితులు భూముల దస్తావేజులు డోన్‌లోడ్‌ చేసుకున్నారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంకు అకౌంట్ నుంచి మధురానగర్‌కు‌ చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఖాతాలోని రూ.10 వేలు కాజేశారు.

* వివాహం జరిగి మూడునెలలు కూడా కాకముందే భార్యను సామాజిక మాధ్యమాల్లో కాల్‌గర్ల్‌గా చిత్రీకరించిన శాడిస్టు భర్త ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలేనికి చెందిన రేవంత్‌కుమార్‌ తితిదేలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పలమనేరుకు చెందిన యువతితో ఆయనకు వివాహం జరిగింది. పెళ్లి జరిగిన మూడు రోజుల నుంచే ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. బెల్టుతో కొట్టడం, కాల్చడంతో పాటు అదనపు కట్నం, నగలు తీసుకురావాలని రేవంత్‌ వేధించేవాడు. భార్యను అనుమానిస్తూ తరచూ మరో మహిళతో వివాహేతర సంబంధం నెరిపేవాడు.

* గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధసిరి గ్రామంలో జంపని నాగేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. స్థలం విషయంలో ఘర్షణ జరగడంతో మృతుడి సమీప బంధువుగా అనుమానిస్తున్న నిందితుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నిందితుడు గదిలోనే పెట్టి తాళం వేసి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంపని నాగేశ్వరరావు పదిహేనేళ్ల కిందట గ్రంధసిరి గ్రామానికి వలస వచ్చాడు. సమీప బంధువుల ఖాళీ స్థలంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాడు.

* ఒకే పేగు తెంచుకుని పుట్టిన అన్నదమ్ములే ఆస్తి కోసం కొట్టుకుంటున్న నేటి రోజుల్లో అన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక తమ్ముడూ ప్రాణాలు విడిచిన విషాద ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఒకేరోజు అన్నాతమ్ముళ్లు గుండెపోటుతో కన్నుమూయడం వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. గుంటూరు ఫాతిమాపురానికి చెందిన తెదేపా కార్యకర్త షేక్‌ అబ్దుల్‌ నబీ (40) బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందారని నిర్ధారించారు. అన్న కళ్ల ముందే ప్రాణాలు విడవడం తమ్ముడు షేక్‌ దస్తగిరి (36) తట్టుకోలేకపోయారు. గుండెనొప్పితో అక్కడే కుప్పకూలారు. వైద్యులు పరీక్షించి దస్తగిరి కూడా కన్నుమూశాడని చెప్పారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. దస్తగిరి పెయింట్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అబ్దుల్‌ నబీకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దస్తగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నాతమ్ముళ్ల భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. తెదేపా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు షేక్‌ చినబాజి, కనపర్తి శ్రీనివాసరావు, పోపూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. తొలి విడత పంపిణీలో 30 కోట్ల మందికి టీకాను అందచేస్తామని.. వారిలో వైద్యారోగ్య సిబ్బందికి, కరోనా యోధులకు అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ఐతే సైబర్‌ మోసగాళ్లు ఇదే అదనుగా ప్రజల్లో కొవిడ్‌పై భయాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. కొవిడ్‌ టీకా త్వరగా ఇప్పిస్తామని, అందుకు కొంత మొత్తం చెల్లించి తమ పేరు నమోదు చేయించుకోవాలని ఫోన్లు చేస్తున్నారు. ఈ మాదిరి ఆరు ఫిర్యాదులను నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

* నకిలీ అశ్లీల ఫొటోలను సృష్టించి దాదాపు 100 మంది మహిళల్ని బెదిరించిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ దిల్లీలో ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసభ్యకరంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమెను బెదిరించి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల సుమిత్‌ ఝా అనే నిందితుడు ఇలాంటి తరహా కేసుల్లోనే గతంలో ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టయ్యాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నిందితుడు ఫిషింగ్‌ టెక్నిక్స్‌ నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉంటున్న సుమిత్‌.. తన నేరాన్ని అంగీకరించాడన్నారు. నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

* తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరరాఘవయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై గొడ్డలి, కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి వీరలంకమ్మ మృతిచెందగా, తండ్రి నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తన భార్యతో గొడవల కారణంగానే వీర రాఘవయ్య తల్లిదండ్రులపై దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన అవనిగడ్డ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.