NRI-NRT

జనవరి 31వరకు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు

జనవరి 31వరకు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను కేంద్రం మరోసారి పొడిగించింది. జూన్‌ 6న ఇచ్చిన ఆదేశాలను జనవరి 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది. జనవరి 31 వరకు అన్ని అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. నిర్దేశించిన మార్గాల్లోనే అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతిస్తున్నట్టు డీజీసీఏ బుధవారం జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. కార్గో విమాన సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేసింది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, వందేభారత్‌ మిషన్‌ కింద మే నుంచి ప్రత్యేక విమానాలను డీజీసీఏ నడిపింది. ఆ తర్వాత అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా 24 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జూలై నుంచి ఎంపిక చేసిన రూట్‌లలో ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నారు.

దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. దేశంలో స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 20కి చేరడంతో ఆందోళన కలిగిస్తోంది.