Politics

సర్పంచ్ పదవిని ₹2.5కోట్లకు కొనుక్కునాడు-తాజావార్తలు

Maharashtra Man Buys Sarpanch Post For 2.5Crores

* కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య భౌతిక కాయానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నివాళులర్పించారు. ఆయన భార్య అపరాజిత, కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అపరాజిత మాట్లాడుతూ తన భర్తను వైకాపా ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి హతమార్చారని.. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసే వరకు తకుమ అండగా ఉండాలని లోకేశ్‌ను కోరారు. ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే, ఆయన బావమరిది, మున్సిపల్‌ కమిషనర్ల పేర్లను చేర్చాలని ఈ సందర్భంగా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. సుబ్బయ్య మృతదేహంతో నేతలు ధర్నాకు దిగారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే సహా ఇతర పేర్లు చేర్చేవరకు ప్రొద్దుటూరు వీడేది లేదని ఈ సందర్భంగా లోకేశ్‌ తేల్చిచెప్పారు. తెదేపా కార్యకర్తల జోలికి రావాలంటే భయపడేలా చేస్తామన్నారు.

* ఆస్తులు వేలం వేయటం గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ… ఆ గ్రామంలో మాత్రం సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ పదవి కోసం ఒకరు ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చించారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా ఉమ్రానె గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామస్థులు అనధికారికంగా ఈ వేలం నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.5 కోట్లు వెచ్చించి విశ్వాస్‌ రావ్‌ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన వేలం రూ. కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే వేలం నిర్వహించారు. దేవరాను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారట!

* కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని కొనియాడారు. తాను కూడా రైతు బిడ్డనని, తమ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని భరోసా ఇచ్చారు. విపక్షాల విమర్శల నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

* దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు! 20 సెకండ్ల పాటు ఏకంగా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో జ్వలించాడు. కొరియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యుజన్‌ ఎనర్జీ, సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడి పేరు… కె-స్టార్‌ (ది కొరియా సూపర్‌ కండక్టింగ్‌ టొకమాక్‌ అడ్వాన్సుడ్‌ రీసెర్జ్‌). 2008లోనే తొలిసారిగా ఇది సంచలనం సృష్టించింది. అయితే- 2025 నాటికి దీన్ని కనీసం 300 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచాలన్నది పరిశోధకుల లక్ష్యం. ఈ దిశగా సూర్యుని మాదిరే కె-స్టార్‌లోనూ వారు జ్వలన (ఫ్యుజన్‌) ప్రతిస్పందనలను కలిగిస్తున్నారు. దీని కోసం వారు హైడ్రోజన్‌ నుంచి ప్లాస్మాను సేకరించారు. ఇందులో 100 మిలియన్‌ డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన ఆయాన్లు ఉంటాయి. ఫ్యుజన్‌ రియాక్టర్‌ సాయంతో ఆయాన్లను అధిక వేడిలో ఉంచడం ద్వారా… ప్లాస్మా 100 మిలియన్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో 20 సెకండ్ల పాటు కొనసాగేలా పరిశోధకులు విజయం సాధించారు. ‘‘వాణిజ్య అణు ఫ్యుజన్‌ రియాక్టర్లలో ప్లాస్మా ఆపరేషన్‌ చాలా కీలకమైనది. భవిష్యత్తులో ఈ పదార్థం అత్యంత ప్రభావవంతగా, దీర్ఘకాలం పనిచేసేలా సాంకేతికతను రూపొందించడంలో ఈ పరిశోధన దోహదపడుతుంది’’ అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

* హీరోయిన్లు అందరిని దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఫొటోషూట్లు చేస్తుంటారు. అది బాలీవుడ్‌లో అయితే.. వినూత్నం కాస్త వింతకు దారితీస్తుంది. కొంతకాలం క్రితం బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ ఆకులు అడ్డుపెట్టుకొని చేసిన ఫొటోషూట్‌ గుర్తుందిగా.. మరీ అంతలా కాకున్నా.. అలాంటి ప్రయత్నమే చేసింది మరో భామ. ‘గబ్బర్‌సింగ్‌’లో వపర్‌స్టార్‌తో కలిసి కెవ్వుకేక అంటూ చిందేసిన బాలీవుడ్‌ నటి మలైకా అరోడా గుర్తుందిగా. ఆమె చేసిన ఫొటోషూట్‌లోని ఒక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయింది. ఆ ఫొటోను ట్రోల్‌ చేస్తూ నెటిజన్లు ఆమెపై జోకులు వేసుకుంటున్నారు.

* రైతు సంఘాలతో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం ఆరో విడత చర్చలు ముగిశాయి. నాలుగు పాయింట్ల అజెండాపై దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చల్లో రెండు అంశాలపై పరస్పరం ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. వ్యవసాయచట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశంలో మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. దీంతో జనవరి 4న మరోసారి అన్నదాతలతో సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వెల్లడించారు. పర్యావరణ ఆర్డినెన్స్‌, అలాగే, విద్యుత్‌ రాయితీల విషయంలో రైతు సంఘాల నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

* పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను పదవి నుంచి తప్పించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన రాజ్యాంగ పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ మీడియాకు తెలిపారు.

* ఫైజర్ టీకాను స్వీకరించిన అమెరికాకు చెందిన నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సమాచారం. కొద్ది రోజుల క్రితమే ఆమె కొవిడ్-19 టీకా మొదటి డోసు తీసుకున్నారని అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. టీకా వేయించుకున్న అనంతరం డిసెంబర్ 18న ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పోస్టు చేశారు. ఒక రోజు మొత్తం చేయినొప్పి పెట్టడం మినహా ఇతర దుష్ప్రభావాలేమి లేవని అందులో వెల్లడించారు.

* దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకలు సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్లుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపై అప్రమత్తంగా ఉంటూ కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా శీతాకాలం కావడంతో ప్రజలు సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలపై జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.

* జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన భాజపా కార్యకర్తలు, నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంతో స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్ట్‌ అయిన భాజపా కార్యకర్తలు, నాయకులు స్టేషన్‌ గేటు దాటుకుని వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు కిందపడ్డారు. అక్కడే ఉన్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ రామచందర్‌రావు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.

* రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించామని, 18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. 35.70లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు.

* కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు బాలీవుడ్‌ సెలబ్రిటీలు జంటలుగా విదేశాలకు పయనమవుతుంటారు. ఈ సమయంలోనే ఆయా సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ బయటపడుతుంది. తాజాగా ఈ జాబితాలో సిద్దార్థ్‌ మల్హోత్రా-కియారా అద్వానీ, అనన్య పాండే-ఇషాన్‌ కట్టర్లు చేరారు. కొత్త సంవత్సరం వేడుకను జరుపుకునేందుకు ప్రచారంలో ఉన్న ఈ రెండు ప్రేమ జంటలు విడివిడిగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే కొద్దికాలంగా కియారా, సిద్దార్థ్‌ మల్హోత్రాలు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి ప్రేమ వ్యవహరంపై వస్తున్న వార్తలను ఈ జంట కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బీ-టౌన్‌ రోడ్లపై మాత్రం వీరిద్దరూ చక్కర్లు కొడుతూ మీడియా కెమారాలకు చిక్కుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ జంట న్యూ ఇయర్‌ సందర్భంగా మాల్ధీవుల పర్యటనకు వెళుతూ విమానాశ్రయంలో మీడియా కెమారాలకు చిక్కారు.

* రైతు సంఘాలతో బుధవారం కేంద్రం​ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సుమారు 5 గంటలకుపైగా కొనసాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశాలు ఎలాంటి కొలిక్కి రాలేదు. కాగా జనవరి 4న మరోసారి కేంద్రంతో రైతు సంఘాలు చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా మద్దతు ధర విషయంపై కమిటీ ఏర్పాటు చేసే యోచనను కేంద్రం పరిశీలిస్తుంది. వాయుకాలుష్య ఆర్డినెన్స్‌లో సవరణలకు సముఖత వ్యక్తం చేయడంతో పాటు విద్యుత్‌ బిల్లులో రైతులు సూచించిన సవరణలకు కేంద్రం మొగ్గుచూపింది.

* అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా బుధవారం నాడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా. అబార్షన్లను అనుమతించవద్దని, అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ క్యాథలిక్‌ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38–29 ఓట్ల తేడాతో అబార్షన్లను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు, బిల్లు ఆమోదం పట్ల కన్నీళ్లు కార్చిన వారు కూడా లేకపోలేదు.

* జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందివాడలో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది ఉంటారని, వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసని అన్నారు. మైకు పట్టుకొని ఊగిపోతూ తోడలు మెడలు నలపుకుంటూ ఎదో వాగితే వినేందుకు జనం పిచ్చివాళ్ళు కాదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అపద వస్తే కాపాడటానికి మాత్రమే రోడ్డు మీదకు వచ్చి నోటికి వచ్చినట్లు వాగుతావని ఎద్దేవా చేశారు. మేము ఎమైనా అంటే బూతులు తిడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఒక్కమాట అన్న కూడా మేము పదిమాటలు అంటామని ధీటుగా సమాధానమిచ్చారు. నువ్వు నన్ను బూతులు మంత్రి అంటావో ఇంకా ఎమైనా అంటావో డోంట్ కేర్. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, దేనికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.