DailyDose

ఉప్పల్‌లో ప్రమాదాల బీభత్సం-నేరవార్తలు

ఉప్పల్‌లో ప్రమాదాల బీభత్సం-నేరవార్తలు

* సెల్‌ఫోన్‌ పేలడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని తండ్రి కూడా హఠాన్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. కరూర్‌ జిల్లా చిన్నతారాపురానికి చెందిన బాలాజీ 12వ తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం బాలాజీ తన సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టాడు. ఈ క్రమంలో ఫోన్‌ ఒక్కసారిగా వేడెక్కి పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తండ్రి చెల్లముత్తు (40) గుండెపోటుతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.

* కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. కరోనాతో గత నెల(డిసెంబర్‌) 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు

* ఉప్పల్‌ ఎన్‌జీఆర్‌ఐ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. లారీ అతివేగంతో వెనుక నుంచి డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో డీసీఎం అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, అనంతరం హనుమాన్‌ ఆలయం ప్రహరీగోడను ఢీకొట్టి ఆగింది. లారీని వెనుక నుంచి మరో మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మినీ లారీలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.

* మానవ హక్కుల కమిషన్‌ ప్రాంగణంలో ఓ యువతి ప్రియుడిపై దాడికి పాల్పడింది. ‘మూడేళ్లు సహజీవనం చేస్తే.. మరొకరితో అక్రమ సంబంధం అంటగట్టి వదిలించుకోవాలని చూస్తావా’ అంటూ నిలదీసింది. కోపంతో ప్రియుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న డీఎస్పీ సుభాష్‌బాబు, సిబ్బంది అబిడ్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ ఠాణాకు తరలించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన యువతి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తున్న కృష్ణా జిల్లా, వత్సవాయి మండలం, శ్రీను తండాకు చెందిన బి.అశోక్‌కుమార్‌తో ఏఎస్‌రావునగర్‌లో సహజీవనం చేసింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని అడిగితే అశోక్‌కుమార్‌ అబార్షన్‌ చేయించారు. అశోక్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది. కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయింది. అందుకే హక్కుల కమిషన్‌ను ఆశ్రయించానని, అప్పటి నుంచి కమిషన్‌కు వస్తూనే ఉన్నానని చెప్పింది. హైకోర్టులో కేసు నడుస్తోన్న నేపథ్యంలో కమిషన్‌ జోక్యం చేసుకోలేదని కోర్టు వారు చెబుతున్నారని, మూడు నెలల క్రితం కమిషన్‌ను ఆశ్రయించినప్పుడు కోర్టులో కేసు ఉన్నట్లు తెలియదా..? అని ఆమె ప్రశ్నించింది. హక్కులను కాపాడతారని వస్తే.. ఇక్కడా అన్యాయమే జరిగిందంటూ బాధితురాలు బోరుమంది.

* కరణ్‌ కాన్సెప్ట్స్‌ అధినేత, ఓ పార్టీ మీడియా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకు కరణ్‌రెడ్డిని గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు కథనం ప్రకారం.. తార్నాక ప్రాంతానికి చెందిన ఓ యువతి(26)తో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ద్వారా నమ్మించి మోసం చేసిన సంఘటనలో చెరుకు కరణ్‌రెడ్డితోపాటు ఆయన భార్య మానసరెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం విదితమే. ఈ ఘటనలో యువతిని మోసం చేసిన కరణ్‌రెడ్డిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఆయన భార్య పరారీలో ఉన్నారన్నారు. బాధిత యువతిని ఇప్పుటికే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించారు. అనంతరం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

* తెలుగు రాష్ట్రాల్లో రుణాల యాప్‌ల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. చైనా కంపెనీలు కేవలం ఆర్నెల్లలో రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్థిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్‌కుమార్‌ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగరాజును రెండురోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ వెనుక నాగరాజు తండ్రి, పోలీస్‌ అధికారి పాత్ర ఉంది. తన కుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని, ఘరానా నేరానికి పాల్పడ్డాడని ఆ పోలీస్‌కు కొద్దిరోజుల క్రితమే తెలిసింది. ఈ విషయాన్ని నాగరాజుకు చెప్పకుండా కర్నూలుకు రావాలంటూ కోరారు. మూడు రోజుల క్రితం అతను ఇంటికి చేరుకున్నాడు. తక్షణం.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్‌ చేయించారు. బంధం కంటే పోలీసు బాధ్యత గొప్పదని భావించిన పోలీస్‌ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్‌ ఠాణాలో ఏఎస్సైగా పనిచేస్తున్నానని, తనపేరు, వివరాలు బహిర్గతం చేయవద్దంటూ ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. ఏఎస్‌ఐకు ఇద్దరు కుమారులు ఈశ్వర్‌కుమార్‌, నాగరాజు. వీరు బెంగళూరులో కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసేవారు. తొలుత నాగరాజు యాప్‌ రుణాల సంస్థలో చేరాడు. తర్వాత తన అన్న ఈశ్వర్‌కుమార్‌ను అందులోనే చేర్పించాడు. పోలీసులు నాగరాజును అరెస్టు చేయడంతో ఈశ్వర్‌కుమార్‌ సైతం లొంగిపోయినట్లు తెలిసింది.