WorldWonders

74 ఏళ్ల తూగో జిల్లా బామ్మగారికి కవలపిల్లలు

First Birthday

అమ్మా.. అన్న పిలుపు కోసం జీవితాంతం నిరీక్షించింది ఆమె. బిడ్డల కోసం తిరగని ఆసుపత్రి లేదు, సంప్రదించని వైద్యుడు లేడు. చివరకు 74 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భం దాల్చి 16 నెలల కిందట కవలలకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డల సందడి చూస్తూ అమితానందంలో మునిగితేలుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ కృత్రిమ గర్భదారణ పద్ధతిలో 2019 సెప్టెంబర్‌ 6న కవలలకు జన్మనిచ్చారు. అప్పటికి ఆమె వయసు 74 ఏళ్లు. ఇది అరుదైన ఘటనగా గుంటూరులోని అహల్య ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. లేటు వయసులో కలిగిన బిడ్డలను ఆమె అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. పిల్లలకు ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరిపిన మూడు రోజులకే తండ్రి సీతారామరాజారావు మృతిచెందారు. అప్పటినుంచి మంగాయమ్మ సంతానమే సర్వస్వంగా జీవిస్తున్నారు. బిడ్డలు ఆరోగ్యంగా ఇంట్లో సందడి చేస్తూ ఉంటే సంబరపడిపోతోంది ఆ తల్లి. భర్త మృతితో బిడ్డల సంరక్షణకు ఓ మహిళను నియమించారు మంగాయమ్మ. బంధువులు, ఇరుగుపొరుగువారు పిల్లలను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వయసు దృష్ట్యా పిల్లలు వద్దని అప్పట్లో వారించిన బంధువులు ఇప్పుడు వారిని చూసి ఆనందపడిపోతున్నారు.