Politics

కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి ఝలక్-తాజావార్తలు

News Roundup - Komatireddy Bids Farewell To Congress

* కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. పీసీసీ రేసులో కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. టీపీసీసీ ఎవరిని వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే తన సొంత అభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నాని, దీనికి తన అన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిజానికి ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన ఆయన ఊహాగానాలకు తెరదించారు.

* కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. కరోనాతో గత నెల(డిసెంబర్‌) 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు.

* కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ ఎట్టకేలకు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. కొవిషీల్డ్‌ టీకాను అత్యవసర వినయోగం కోసం ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే టీకా పంపిణీకి డీసీజీఐ అనుమతులిచ్చే అవకాశముంది. ఇక మరో సంస్థ భారత్‌ బయోటెక్‌ దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ లేదని, ఫస్ట్‌ వేవ్‌ కూడా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు 10వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉన్నామన్నారు. నిత్యం 10లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించినట్లు ఈటల తెలిపారు.

* సీఎం జగన్‌ జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎంపై బురద చల్లేందుకే తెదేపా అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రోజుల వ్యవధిలోనే విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విఘ్నేశ్వర స్వామి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కొంత మంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

* ఈ నెల 4న జరగబోయే చర్చల్లో తమ డిమాండ్ల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా వ్యవహరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. చర్చలు విఫలమైతే 6న ట్రాక్టర్లతో మార్చ్‌ నిర్వహించనున్నట్టు రైతు సంఘం నేత యుధ్‌వీర్‌సింగ్‌ తెలిపారు. దిల్లీ సరిహద్దులో గత 37 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న 41 రైతు సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు.

* కొత్త కరోనా వైరస్‌తో అల్లాడుతున్న యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 8 నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు షరుతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ వెల్లడించారు. జనవరి 23 వరకు వారానికి 15 విమానాలే ఇరు దేశాల మధ్య సేవలందించేందుకు అనుమతిస్తామని చెప్పారు.

* భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్‌కు అందించింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌కు పాక్‌ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. 2008 మే 21 జరిగిన కాన్సులర్‌ యాక్సిస్‌ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఖైదీల వివరాలు అందిస్తారు. మరోవైపు భారత్‌ కూడా దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది.

* చైనా, యూకేల్లో బయటపడిన కరోనా వైరస్‌లు ఇప్పటికే అన్ని దేశాలకూ వ్యాపిస్తోన్న తరుణంలో.. కొత్తగా దక్షిణాఫ్రికా కరోనా వైరస్‌ ఫ్రాన్స్‌లో కలకలం రేపింది. దీనిని 501.వీ2 వైరస్‌గా గుర్తించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైనట్లు పారిస్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కొత్తరకం వైరస్‌ జపాన్‌, బ్రిటన్‌, ఇతర దేశాల్లో కూడా బయటపడినట్లు తెలుస్తోంది. యూకే కరోనా వైరస్‌ మాదిరిగానే ఈ వైరస్‌ కూడా చాలా వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. సౌతాఫ్రికా నుంచి ఫ్రాన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటించింది.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆయా దేశాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 20కి పైగా దేశాలు టీకా పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ఇజ్రాయెల్‌ మాత్రం మెరుపువేగంతో దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడి జనాభాలో పదిశాతం మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆ దేశం‌ వైపు చూస్తున్నాయి.

* ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్న వేళ.. ఆస్ట్రేలియా మరో నూతన మార్పును ఆహ్వానించింది. తమ పురాతన సంస్కృతి, వారసత్వాలను మరింతగా ప్రతిబింబించేలా ఆ దేశ జాతీయ గీతంలో మార్పులు చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ‘అడ్వాన్స్‌ ఆస్ట్రేలియా ఫెయిర్‌’ అనే ఆ దేశ జాతీయ గీతంలోని కొన్ని పదాల్లో మార్పు చేశారు.

* 2020లో కేవలం ఆరు నెలల వ్యవధిలో సుమారు పదికి పైనే కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది మెసేజింగ్ యాప్ వాట్సాప్ . అలానే కొత్త సంవత్సరంలో కూడా యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించేందుకు మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో కొన్ని యూజర్స్‌కి ఆందోళన కలింగించేవైతే మరికొన్ని వాట్సాప్‌ వినియోగాన్ని మరింత సులభతరం చేసేవి.

* విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తిప్పికొట్టారు. విజయసాయి ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. ఘటన వెనుక తనతో పాటు చంద్రబాబు హస్తముందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డితో సీఎం జగన్‌ దొంగ ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని సీఎం మాట తప్పారని విమర్శించారు. నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో ఏం చర్చించారో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వేతన సవరణ సంఘం ఇన్ని రోజులు ఏం చేసిందని ప్రశ్నించారు. సీఎంను చూసి ఉద్యోగసంఘాలు ఎందుకు భయపడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు.