DailyDose

కాచిగూడ దొంగను పట్టుకున్న పోలీసులు-నేరవార్తలు

Crime News - Kachiguda Theft Closed By Police

* కాచిగూడలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పనిమనిషిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నిందితుడి నుంచి రూ.35లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు వివరాలను జాయింట్‌ సీపీ రమేశ్‌ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు.

* ముంబయి పేలుళ్ల సూత్రధారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జాకీ-ఉర్‌-రెహమాన్‌ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తూ వారి కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న కేసులో పాకిస్థాన్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లాహోర్‌లోని సీడీటీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్‌ చేపట్టి 61 ఏళ్ల లఖ్వీని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు. ముంబయి పేలుళ్ల కేసులో అరెస్టయిన లఖ్వీ…2015 నుంచి బెయిల్‌ పైనే ఉన్నాడు. అయితే, ముష్కర మూకలకు నిధులు సమకూరుస్తున్నడన్న ఆరోపణలు రావడంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక శాఖ (సీడీటీ) అతడిని అరెస్టు చేసినప్పటికీ…ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. లాహోర్‌ ఉగ్ర నిరోధక న్యాయస్థానంలో అతడిపై విచారణ జరుగుతుందని తెలిపారు. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది క్షతగాత్రులైన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే.

* దా‘రుణ’ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. యాప్‌ నిర్వాహకుల ఆటలు కట్టించేందుకు ఓవైపు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేధింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వేధింపులకు గురై రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు బాధితులు బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉరి వేసుకొని చంద్రమోహన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. లోన్‌ చెల్లించాలంటూ చంద్రమోహన్‌ను తీవ్రంగా వేధించినట్లు సన్నిహితులు ఆరోపిస్తున్నారు. అయితే రుణ యాప్‌ నిర్వాహకుల బెదిరింపులపై యువకుడు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమోహన్‌ చరవాణిలోని నంబర్లకు యాప్‌ నిర్వాహకులు సందేశాలు పంపించారు. డబ్బు కట్టలేదనే విషయం సన్నిహితులకు తెలిసిందని చంద్రమోహన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

* వారసత్వంగా వచ్చిన భూమి ఉన్నా.. అధికారుల తప్పిదంతో అది వేరే వారి పేరిట నమోదైంది. ఆ పొరపాటును సరిదిద్దమని మూడేళ్లుగా ఆ పేదరైతు వేడుకుంటున్నా అది అరణ్యరోదనే అయింది. మరోవైపు కుమార్తె వివాహానికి చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొత్త సంవత్సరం తొలిపొద్దులో శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపుర గ్రామానికి చెందిన కుంటోల్ల అంజయ్యకు గ్రామ శివార్లలో 9వ నెంబరు సర్వే నంబరులో 1.28 ఎకరాల పట్టా భూమి ఉంది. వారసత్వంగా సంక్రమించిందది. రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల గ్రామానికి చెందిన మరో రైతు పేరిట నమోదైంది. ఫలితంగా అంజయ్య రైతుబంధు పథకానికి దూరమయ్యాడు. ఆన్‌లైన్‌లో భూమి తన పేరిట లేకపోవడాన్ని గుర్తించి లోపాన్ని సవరించాలని కోరుతూ మూడేళ్ల క్రితం అధికారుకులకు దరఖాస్తు చేశాడు. ఎన్నిసార్లు వారి చుట్లూ తిరిగినా ఫలితం లేకపోయింది. అంజయ్యకు భార్య సుగుణమ్మతో పాటు మహేశ్వరి, మనీషా ఇద్దరు కుమార్తెలు. పెద్ద బిడ్డకు మూడు నెలల క్రితం వివాహం చేశారు. ఇందుకోసం ఇతరుల నుంచి రూ.5లక్షల వరకు అప్పు తీసుకున్నారు. వడ్డీల భారాన్ని తట్టుకోలేక భూమిలో కొంత అమ్ముకుందామనుకున్నా వీల్లేకపోయింది. దీంతో విసిగి వేసారిన అంజయ్య గురువారం రాత్రి ఇంటి ముందున్న వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ యాజమాని బలవన్మరణానికి పాల్పడటంతో భార్యాపిల్లలు గుండెలవిసేలా విలపించారు. శుక్రవారం పోలీసు అధికారులు స్థానిక తహసీల్దార్‌ జయరాం, గ్రామపెద్దలు, బాధితులతో ఠాణాలో చర్చించారు. తన భర్త మృతికి రెవెన్యూ అధికారులే కారణమని మృతుడి భార్య సుగుణమ్మ ఆరోపించారు. రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని తహసీల్దార్‌ జయరాంను డిమాండ్‌ చేశారు. నిరాకరించిన సదరు అధికారి భూమిని అంజయ్య పేరిట బదలాయిస్తామని పోలీసుల సమక్షంలో హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

* అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమవడంతో ఏటీఎం యంత్రాన్ని పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఏటీఎంలోని రూ.5.80 లక్షలు కాలి బూడిదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఏటీఎంలో రూ.9 లక్షల నగదు ఉండగా.. ఖాతాదారులు రూ.3 లక్షలు డ్రా చేశారు. మిగతా రూ.6 లక్షల్లో అదేరోజు అర్ధరాత్రి రూ.22 వేలు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. మిగతా రూ.5.80 లక్షలు ఏటీఎంలోనే ఉన్నాయి. అదే సమయంలో దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసి, చివరకు పెట్రోలు పోసి యంత్రాన్ని కాల్చివేశారు. శుక్రవారం ఉదయం పరిగి పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు గుర్తించారు. వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హిందూపురం పట్టణంలో గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న మనోజ్‌కుమార్‌(21) ఆబాద్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు హిందూపురం సమీపంలో ఓ కర్మాగారంలో దినసరి కార్మికుడిగా పని చేసేవాడు. చోరీకి యత్నించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.