Food

డిసెంబరులో జుర్రేశారు

డిసెంబరులో జుర్రేశారు

కరోనా, లాక్‌డౌన్‌, ఆర్థిక తిరోగమనంలాంటి పదాలు వేరే ఏదైనా రంగానికి వర్తిస్తాయేమోగానీ, మద్యానికి ఇలాంటివేమీ పనిచేయవు. దశలవారీ మద్యనిషేధం అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా వాటిని మందు బాబులు లెక్కచేయలేదు. షాపుల సంఖ్య తగ్గించినా, మద్యం అమ్మకాలపై అనేక ఆంక్షలు విధించినా అవి లిక్కర్‌ అమ్మకాలను నియంత్రించలేకపోయాయి. ఎప్పుడూ లేనంతగా ఒక్క డిసెంబరు నెలలోనే ఏకంగా రూ.2300 కోట్ల మద్యం అమ్మకాలతో కొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ ఏ నెలలోనూ అమ్మకాలు రూ.2వేల కోట్లు దాటలేదు. ప్రతి నెలా సగటున రూ.1800 కోట్ల అమ్మకాలే నమోదవుతున్నాయి. కానీ డిసెంబరులో ఒకేసారి దాదాపు రూ.500 కోట్ల మేర అమ్మకాలు పెరగడం యంత్రాంగానికి సైతం ఊహకందని విషయమే. ఆ నెలలో 22,10,592 కేసుల లిక్కర్‌, 6,68,106 కేసుల బీరు అమ్ముడైంది. రోజుకు రూ. 68 కోట్లకుపైగా వ్యాపారం జరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకూ ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.13వేల కోట్లు దాటింది. మొదటి నెల ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు ఏమీ లేవనేది గుర్తు చేసుకొంటే.. ఈ స్థాయిలో ఆదాయం రావడం అనూహ్యమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.15వేల కోట్ల ఆదాయం వచ్చింది. సగటున చూస్తే నెల రోజులు పూర్తిగా అమ్మకాలు లేకపోయినా ఈ స్థాయిలో ఆదాయం రావడం గతేడాది అమ్మకాల కంటే ఎక్కువగానే ఉంది.మిగిలిన మూడు నెలల్లో మరో 7వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మద్యం ద్వారా రూ.20వేల కోట్లు ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉంది.
**రెండు విధాలా లాభమే..
మద్య నిషేధం నినాదంతో అమ్మకాలను తన అధీనంలోకి తీసుకున్న వైసీపీ సర్కారు….కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నతరహాలో పక్కా ప్రణాళికను అమలుచేస్తోంది. మద్యం ధరలు పెంచడం ద్వారా గతంతో పోలిస్తే పరిమాణపరంగా స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. కానీ ధరలు పెరగడం వల్ల సర్కారు ఖజానాకు ఏమాత్రం ఢోకా లేకుండా గతంలో కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. అటు అమ్మకాలు కొంతైనా తగ్గించామన్న పేరు, ఇటు ఖజానాకు లోటు లేకుండా ఆదాయం రెండూ ఏకకాలంలో వస్తున్నాయి. కానీ ఇటీవల రెండు సార్లు మద్యం ధరలు తగ్గించడంతో పరిమాణపరంగా కూడా వ్యత్యాసం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అందుకే అమ్మకాల విలువ భారీగా పెరిగిపోతోంది.
**తన వంతుగా ఎక్సైజ్‌…
ప్రభుత్వానికి వీలైనంత ఆదాయం తెచ్చిపెట్టేందుకు ఎక్సైజ్‌శాఖ కూడా తన వంతు కృషి చేస్తోంది. ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం అమ్మకాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకొని అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ అవి అమ్మకాలు తగ్గించేందుకు పనిచేయలేదు. గతంలో 4300 షాపులుంటే వాటికి వైసీపీ ప్రభుత్వం 2900కు తగ్గించింది. షాపుల పనివేళలను కూడా ఉదయం గంట, రాత్రి రెండు గంటలు తగ్గించింది. అలాగే షాపుల వద్ద నిలబడి తాగేందుకు ఉన్న పర్మిట్‌ రూమ్‌లను రద్దుచేసింది. ఈ చర్యలతో కచ్చితంగా అమ్మకాలు తగ్గుతాయని భావించగా, ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. కేవలం ధరలు పెంచడం ఒక్కటే కొంతకాలం అమ్మకాలు తగ్గేలా చేసింది. అయితే దానివల్ల భారీగా ఆదాయం నష్టపోతున్నామని తెలుసుకున్న ప్రభుత్వం…. పెంపుపై నిలబడకుండా వెనక్కు తగ్గింది. దీంతో గత రెండు నెలల నుంచి అమ్మకాలు మొదటికొచ్చాయి.
**మళ్లీ పాత బీర్లు
ఊరూపేరు లేని కొత్త బ్రాండ్లను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిపైనా క్రమంగా వెనక్కి తగ్గుతోంది. ఎప్పుడూ చూడని కొత్త బ్రాండ్లు కావడంతో వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎంత నిఘా పెట్టినా పక్క రాష్ర్టాల నుంచి అక్రమ మద్యం వస్తూనే ఉంది. దానివల్ల రాష్ర్టానికి వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇది గమనించిన ప్రభుత్వం తాజాగా పాత బీర్లు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మొన్నటివరకూ పాత బ్రాండ్లన్నీ కనిపించకుండా చేసిన ఆ శాఖ, తాజాగా అన్ని రకాల బ్రాండ్లు షాపుల్లో ఉంచుతోంది. నూతన సంవత్సరం, సంక్రాంతి, వేసవికాలాలను దృష్టిలో పెట్టుకుని పాపులర్‌ బ్రాండ్లకు అనుమతిచ్చింది. మొన్నవరకూ ఒక్కసీసా కనిపించకుండా పోయిన కింగ్‌ఫిషర్‌కు తాజాగా 50వేల కేసుల ఆర్డర్‌ వెళ్లింది. దీంతో అమ్మకాలు మరింత పెరగనున్నాయి.
***మద్యం అమ్మకాలు విలువ ఆధారంగా
**నెల 2019-20 2020-21
*మే 1821 కోట్లు 1388 కోట్లు
*జూన్‌ 1553 కోట్లు 1609 కోట్లు
*జూలై 1915 కోట్లు 1371 కోట్లు
*ఆగస్టు 1747 కోట్లు 1627 కోట్లు
*సెప్టెంబరు 1397 కోట్లు 1960 కోట్లు
*అక్టోబరు 1734 కోట్లు 1926 కోట్లు
*నవంబరు 1601 కోట్లు 1980 కోట్లు
*డిసెంబరు 1623 కోట్లు 2300 కోట్లు
*మొత్తం 13,391 కోట్లు 14,161 కోట్లు