Devotional

భగవంతుణ్ణి చూస్తావా బిడ్డా!

భగవంతుణ్ణి చూస్తావా బిడ్డా!

దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం.

మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు మనో మూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.

మనో మూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది.

_భగవంతున్ని చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని *భగవాన్ శ్రీరమణమహర్షి అంటారు.

దీనిబట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అని !

కానీ మనకి కానరావడం లేదు… ఎందుకనీ ? మన మనస్సులో ఉన్న మాలిన్యాలు వలన !

మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు ! మొదటిది ‘నేను’ అనే తలంపు ఇక రెండవది ‘నాది’ అన్న తలంపు. మొదటిది అహంకారం, రెండవది మమకారం ! ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.

మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి… ఎలా ?

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని – ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనో మాలిన్యాలను తొలగించాలి.

అజ్ఞానమను నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి. (కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).

మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరు అడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.

సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదావగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు.

శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలు ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.

మనస్సునూ బుద్ధినీ సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి.

మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.

మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి.

హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించం. ..ఇదే మాయ.

శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ.. ఈ దేహం శిధిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.

మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ప్రేమ, జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది !