Politics

చంద్రబాబు లోకేశ్ అశోక్ గజపతిలే కారణం

చంద్రబాబు లోకేశ్ అశోక్ గజపతిలే కారణం

రామతీర్థం ఘటన ప్రపంచంలో ఎవరికీ తెలియనప్పుడు సామాజిక మాధ్యమంలో చంద్రబాబునాయుడే బయటపెట్టారని, ఆయన కుమారుడు లోకేశ్‌, కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు, వారి సహచరులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. శనివారం రామతీర్థం కొండపై జరిగిన ఘటనను పరిశీలించిన తర్వాత విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత నెల 28న రాత్రి, 29న తెల్లవారుజామున కొండపై జరిగిన ఘటన శోచనీయం. ముఖ్యమంత్రి అందిస్తున్న మంచి పరిపాలనను తప్పు పట్టేలా చంద్రబాబు, ఆయన అనుచరులు కుట్ర పన్నారు. ఈ సంఘటనపై లోకేశ్‌ నాయుడు ఒక సవాలు విసిరారు. తాను ఎక్కడికైనా వస్తానని.. చర్చకు రావాలని అన్నారు. అప్పన్న సన్నిధిలో ఆయన ఒక తేదీ చెబితే చర్చకు వస్తాను. ఇందులో మీ పాత్ర ఉందా.. లేదా అనేది చర్చిద్దాం. ఇక్కడ కొన్ని సందేహాలు వస్తున్నాయి. తెదేపాలో ఉంటూ ఈ దేవస్థానం ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు ఉన్నారు. పేదలకు 400 ఎకరాల్లో ఇళ్లపట్టాల పంపిణీకి 30న ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే.. చెడుబుద్ధితో దీన్ని పాడుచేయాలని వారు పన్నాగం పన్నారు. చంద్రబాబునాయుడుకు దేవుడంటే భయం లేదు. ఆయన ఐదేళ్ల పాలనలో 20 వేల దేవాలయాలు మూతపడ్డాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో వేయికాళ్ల మండపాన్ని తొలగించారు. విజయవాడలో 39 దేవాలయాలను కూలగొట్టిన వ్యక్తీ ఆయనే. తిరుమలలో పోటును మూసివేయించి అర్ధరాత్రి క్షుద్రపూజలు చేశారు. కలకాలం అధికారంలో ఉండాలని శ్రీకాళహస్తి, సింహాచలం, పెందుర్తి భైరవ ఆలయంలో కూడా ఇలాంటి పూజలు చేశారు. సదావర్తి భూముల అమ్మకానికి ప్రయత్నించి.. కోర్టు మొట్టికాయ వేస్తే వెనక్కి తగ్గారు. రామతీర్థం కోదండరామ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దేవాదాయ శాఖకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. ఇందు కోసం రూ.1.50 కోట్లు అవుతుందని వారు అంచనా వేశారు. ఎంత ఖర్చయినా పునఃప్రతిష్ఠిస్తాం. ఇన్ని పాపాలు, అరాచకాలు చేసిన చంద్రబాబునాయుడు ఇక్కడకు రావడం అంటే తప్పుచేసిన వారే తిరిగి రాజకీయం చేస్తున్నట్టు ఉంది. ఈ పని చేయించినవాడికి, చేసినవాడికి శిక్ష తప్పదు. ఇందులో దోషులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. తెదేపా నేత ప్రవృత్తికి తగినట్టుగానే వాళ్ల నాయకులు, కార్యకర్తల ప్రవర్తన ఉంది. మా మీద చెప్పులు, నీళ్ల సీసాలు విసిరి, మా వాహనాల అద్దాలు పగులగొట్టారు. దీనికి చంద్రబాబునాయుడు, అచ్నెన్నాయుడు, కళా వెంకట్రావు, వాళ్లంతా బాధ్యత వహించాలి’’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్న దొర మాట్లాడారు.