Food

తేగలను పిండి చేస్తున్నారు

తేగలను పిండి చేస్తున్నారు

సీజన్‌లో రోడ్డుపక్కనో బండిమీదో తేగలు కనిపిస్తే ఇష్టమైనవాళ్లు ఒకటో రెండో కొనుక్కుని తింటారు. మిగిలినవాళ్లు ‘ఆఁ తేగలే కదా ఏం తింటాంలే’ అని తేలికగా తీసుకుంటారు. కానీ అవి ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో అంటున్నారు ఆహార నిపుణులు. అంతేనా… కేవలం ఈ కాలంలో మాత్రమే దొరికే తేగల్ని ఏడాది పొడవునా తినేలా వాటిని ఎండబెట్టి పిండి రూపంలో తీసుకొస్తున్నారు. మరి ఆ తేగల్లో దాగిన పోషకాలేంటో కాస్త చూద్దామా…?
*ఒకప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్లకైనా చిరుతిండి అంటే ఆయా కాలాల్లో పండేవీ దొరికేవీ మాత్రమే. అందులో భాగంగానే చలికాలంలో వచ్చే తేగల్ని అంతా ఎంతో ఇష్టంగా తినేవారు. వర్షాకాలంలో పండిపోయి రాలిపడ్డ తాటికాయల్ని నేలలో పాతితే వచ్చే మొలకలే తేగలు. తేగల్ని కుండల్లో నీళ్లు పోసి ఉడికించడం లేదా నిప్పులమీద కాల్చడం చేస్తుంటారు.
వేసవిలో వచ్చే తాటికాయల్లోని ముంజెలు చల్లదనాన్ని అందిస్తాయి. అప్పుడు కోయని కాయలు వానాకాలంలో పక్వానికి వస్తాయి. గుజ్జు తినకుండా వదిలిన తాటికాయల్నే పాతరేస్తారు. కొన్ని రోజులకి తాటి గుజ్జు అంతా లేత కొబ్బరిలా మారిపోతుంది. అదే బుర్ర గుంజు. తియ్యగా మృదువుగా ఉండే ఇదీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ దశలో వాటిని తవ్వకుండా ఉంచితే వచ్చే వేరు మొలకలే తేగలు. ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయన్న కారణంతో వీటిని తవ్వి తీసి కాల్చుకునో ఉడికించుకునో తింటారు. తేగలు తవ్వకుండా ఉంటే చెట్లుగా పెరుగుతాయన్నమాట.
**తేగల పొడి!
ఒకప్పుడు తేగలు తినాలంటే సీజన్‌ కోసం వేచి చూడాల్సిందే. ఎక్కువగా జనవరి నుంచి మార్చి వరకూ మాత్రమే ఇవి వస్తాయి. కానీ ఇప్పడు వాటిని ఎండబెట్టి ప్యాక్‌ చేసిన ముక్కలుగానీ లేదా పొడిగానీ ఏడాది పొడవునా దొరుకుతాయి. ఈ పొడిని పాలల్లో కలుపుకుని తాగడంతో పాటు పాయసం, హల్వా, లడ్డూ వంటి వంటలూ చేస్తున్నారు. ఎందుకంటే తేగల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్ధకాన్ని పోగొడుతుంది. అంతేకాదు, వీటిల్లోని పీచుని శరీరం త్వరగా అరిగించుకోలేదు. అందువల్ల తేగలు తింటే ఆకలి వేయదు. కాబట్టే ఇవి ఊబకాయాన్ని నివారిస్తాయి. పైగా వీటిల్లోని పీచు వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, హృద్రోగాలూ క్యాన్సర్లూ రాకుండా ఉంటాయి. తేగల పిండికి కొబ్బరిపాలు, బెల్లం, యాలకులపొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ కరిగిపోతుందట. అదీగాక క్యాన్సర్‌ను తొలిదశలోనే నిర్మూలించే శక్తి తేగలకి ఉంది. ఈ పీచు పెద్దపేగుల్లో మలినాలు చేరకుండా చేస్తుంది. తేగలను ఉడికించి మిరియాల పొడీ, ఉప్పూ రాసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
* తేగలు ఐరన్‌ నిల్వలు కూడా. రక్తహీనతతో బాధపడేవాళ్లకి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. పసుపు వేసిన నీళ్లలో ఉడికించి ఎండలో ఆరబెట్టి తాటిబెల్లంతో కలిపి మిక్సీలో వేసి పిండి పట్టించుకుని తింటే రక్తహీనత త్వరగా తగ్గుతుంది.
* వీటిల్లో సమృద్ధిగా ఉండే కాల్షియం కండరాల కదలికలకీ ఎముకలూ దంతాల దృఢత్వానికీ తోడ్పడుతుంది. వయసుతోపాటు వచ్చే ఆస్టియోపొరోసిస్‌, ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ వంటి రోగాల్నీ అడ్డుకుంటుంది.
ఇంకా ఇందులోని మెగ్నీషియం బీపీనీ కొలెస్ట్రాల్‌నీ అడ్డుకుంటుంది. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల తేగలు తిన్నా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు త్వరగా పెరగవు. మెల్లగా జీర్ణమవుతాయి కాబట్టి మధుమేహులకీ ఇవి మంచిదే. అన్నింటికన్నా తేగల్లో ప్రొటీన్‌ శాతం ఎక్కువ. దెబ్బతిన్న కండరాలకీ; ఎంజైములూ హార్మోన్ల తయారీకీ ఈ ప్రొటీన్లు ఎంతో తోడ్పడతాయి. విటమిన్‌-సి, ఫోలేట్‌, పొటాషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు కూడా తేగల్లో పుష్కలంగా లభిస్తాయి. అందుకేమరి, తేగలే కదా… పల్లెటూరి తిండి, ఏం రుచిగా ఉంటాయిలే… అనుకోకుండా పీచుతో కూడిన ఈ తాటి మొలకల్ని నమిలి తినండి. దొరకని సమయంలో వీటి పొడినీ వాడుకోండి.